Oct 23,2023 08:31

పంటలు పొంగారినప్పుడు.. ప్రకృతి పరవశించినప్పుడు... ఆనందం తాండవించినప్పుడు... అందరూ కలగలిసినప్పుడు- సంతోషం వెయ్యింతలై నాట్యమాడుతుంది. మాటలు హార్మోనియం మీటలవుతాయి. పాటలు వాటికవే పల్లవిస్తాయి. కాళ్లు లయాత్మకంగా కదం తొక్కుతాయి. హృదయాలు సరదాల సాగరాలై పోటెత్తుతాయి. ఇలాంటి ఆనందానందపు సందర్భాలనే మనం పండగలు అంటాం. శరత్కాలపు వెన్నెల రాత్రుల్లో .. నిర్మల ఆకాశపు చుక్కల వెలుగుల్లో ... సరదాలను సందిట దాచుకొని వచ్చే దసరా... ఇలాంటి వేలవేల ఎన్నియల పాటల పేటిక. జానపద గానాల కమనీయ వాటిక. పంటలూ ప్రకృతీ ప్రధానంగా ఈ దసరా వేళ .. మన రాష్ట్రంలో ఒకప్పుడు ఘనమైన గైరమ్మ సంబరాలు జరిగాయి. ఇప్పుడు అవి గతం అన్నట్టుగా వైభవం కోల్పోయాయి !

దసరాకు నేపథ్యంగా మనం ఇప్పుడు చెప్పుకుంటున్న కథలు వేరు. మన మూలాలైన పల్లెటూళ్లు ఒకప్పుడు సందడిగా జరుపుకున్న సరదాల సందర్భాలు వేరు. ఊరు ఊరంతా ఉప్పెనలా ఎగిసిన ఆటపాటలకు ప్రకృతే ప్రధాన కారణం. పంటపనులన్నీ పూర్తయ్యి .. పైరుచేలు పచ్చపచ్చగా పరవశించే తరుణమే పర్వదినం. ఒకటి కాదు, రెండు కాదు; ఎనిమితో, తొమ్మిదో అసలే కాదు; వెండి వెన్నెల కాసినంతకాలమూ పండగే అప్పుడు. చుక్కల ఆకాశం, నిండైన పండు వెన్నెల, చక్కని వాతావరణం ... అలాంటప్పుడు ఎవరు మాత్రం ఒంటరిగా బజ్జుంటారు ఇంట్లో? ఒకడు ఆ మూలన రాగమేదో అందుకుంటాడు. ఇటుపక్క ఇంకొకడు మద్దెల దరువవుతాడు. వేరొకడు పిల్లనగ్రోవి పిలుపవుతాడు. ఊరి ఆడపడుచులు ఆనందపు చిందులవుతారు. గుంపు గుంపులుగా ఒక్కచోటకు చేరి .. సంతోషపు సింధువులవుతారు. మరి .. ఆ సామూహిక సందడిలో మాటలు ఎక్కడివి? పాటలు ఎవరివి? ఆటలు ఏ తరహావి. చుట్టూ ఉన్న జీవితమే ఇతివృత్తం. పాడిపంటలూ, చెట్టుచేమలూ, కొన్ని ఆశలూ మరికొన్ని ఆకాంక్షలూ, పంటకు వినతులూ, ప్రకృతికి ఆరాధనలూ ... వారే రచయితలు. వారే సంగీతకారులు. వారే గాయనీగాయకులు.. వారే ప్రేక్షకులూ వీక్షకులూ.. వారే వారే ప్రశంసకులూ విమర్శకులూ. అదే జానపద కళావైభవం. మన జానపదుల జీవన పరమార్థం.
 

                                                              పైరు పరవశించే వేళ ...

సహజంగా అక్టోబరు నెల నాటికి - వర్షాలు కురిసి.. అరకలు నడిచి.. విత్తనాలు మొలకెత్తి .. పంటచేలు పైకెగసి .. ప్రకృతి అంతా హరిత శోభను సంతరించుకుంటుంది. చెరువుల నిండా జలకళ ఉట్టి పడుతుంది. వాగులూ వంకలూ గలగలా పారుతుంటాయి. ఎక్కడ చూసినా రకరకాల పూలు కనువిందు చేస్తూ ఉంటాయి. వ్యవసాయ పనులు కాస్త నెమ్మదిస్తాయి. కొంతకాలం ఇలాగే సాగితే- భీకర వర్షాలో, తుపాన్లో రాకుండా ఉంటే- పంటలు చక్కా పండుతాయి. శ్రమ ఫలిస్తుంది. గాదెలు నిండుతాయి. ఊరంతా హాయిగా బతుకుతుంది. అందుకనే అలాంటి ఆశతో ఎదురుచూస్తూ- జానపదులు పాటలు అల్లుకున్నారు. తాము ఆనందంగా గడిపే వేళ ఆటలపాటలతో ప్రకృతిని వేడుకున్నారు. ఇప్పుడు తెలంగాణాలో జరిగే బతుకమ్మ పండగలో కనిపించే పరమార్థం ఇదే! ఇలాంటి జానపద వైభోగం ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కూడా ఉంది. కాకుంటే- ఒకప్పుడు ప్రబలంగా.. ఇప్పుడు అక్కడక్కడ. కొత్త పండగల ఉరవడిలో పడిపోయి... ఇక్కడి జానపదాలు మూలనపడిపోయాయి. మన మూలాల్లో పల్లవించిన పాటలూ, వాటి సందర్భాలూ ఇప్పుడు ఇక్కడ చాలా తక్కువమందికే తెలుసు. ఇలాంటి వ్యాసాలు రాయటానికి కూడా మనుషుల నుంచి కాక పుస్తకాల నుంచి సమాచారం సేకరించుకోవల్సిన పరిస్థితి !
 

                                                         ఊరూరా గైరమ్మ పాటలూ ఆటలూ

గైరమ్మ సంబరాలు ఒకప్పుడు ఊరూరా ఘనంగా జరిపేవారు. ఉత్తరాంధ్రలో వీటికే నందెన్న ఉత్సవాలు అని పేరు. 21 రోజుల వరకూ ఈ సందడి సాగేది. ఇది పూర్తిగా ప్రకృతి పండగ. పాడిపంటల పండగ. వరిదుబ్బును గద్దెపై పెట్టి.. పసుపు కుంకుమలతో అలంకరించి.. నిత్యం దీపారాధన చేస్తూ ... రాత్రుళ్లు అక్కడ ఆటపాటలతో గడిపేవారు. ఈ సంబరానికి సంబంధించిన మౌఖిక సాహిత్యం ఎంతో ఉంది. రకరకాల లయాత్మకంగా వరుసల్లో నృత్యం చేస్తూ .. పాడుకునే పాటలు చాలావి ఉన్నాయి. మహిళలు పాడుతూ ఆడుతూ ఉంటే- పురుషులు వాద్య సహకారం అందించేవారు. ఇతరత్రా ఉత్సవ సందళ్లలో పాల్గొనేవారు.
ఎంత చక్కని తల్లివే గైరమ్మ
ఎంత చక్కని తల్లివే ఓ గైరమ్మ
ఒక్కొక్క పోకందునా గైరమ్మ
ఒక్కొక్క ఆకుందునా గైరమ్మ
కస్తూరి చలమందునా గైరమ్మ ... ఇలా గైరమ్మ
పాట సాగుతుంది.
ఈ గైరమ్మను కొలిచే, పాడే, వేడుకునే తీరు తెలంగాణాలో జరిగే బతుకమ్మ పండగను తలపిస్తుంది. ఆఖరిరోజున గైరమ్మను కూడా నీళ్లలో ఓలలాడిస్తారు. అయితే, ఇదిప్పుడు శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో కొన్ని గ్రామాల్లో మాత్రమే కనిపిస్తుంది. విజయదశమి తరువాత ఈ సందడి మొదలవుతుంది. శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతంలో పాడుకునే ఈ పాటలో ప్రకృతి ఆరాధనను స్పష్టంగా వినవచ్చు.
ఎంత చక్కని తల్లివే ఓ గైరమ్మ
ఎంత చల్లని తల్లివే ఓ గైరమ్మ
జాదవలు పోసేమమ్మా ఓ గైరమ్మ
చిన్నచిన్న మేఘాలలో ఓ గైరమ్మ
చిన్నమ్మ దిగిరావమ్మా ఓ గైరమ్మ
పెద్దపెద్ద మేఘాలలో ఓ గైరమ్మ
పెద్దమ్మ దిగిరావమ్మా ఓ గైరమ్మ
మొక్కుకున్న మొక్కులన్ని ఓ గైరమ్మ
నీకే చెల్లించామమ్మా ఓ గైరమ్మ
మా పాడిపంటలను ఓ గైరమ్మ
కలకాలం కాపాడాలమ్మా ఓ గైరమ్మ
మా పిల్లాపాపలను ఓ గైరమ్మ
సల్లంగా చూడాలమ్మా ఓ గైరమ్మ
విజయనగరం జిల్లా సాలూరు, పార్వతీపురం, బొబ్బిలి, శృంగవరపుకోట, భోగాపురం; విశాఖ జిల్లా నర్సీపట్నం, అనకాపల్లి, ఎలమంచిలి తదితర ప్రాంతాల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి. 21 రోజుల ఆరాధన, ఆటపాటల సందడి పూర్తయ్యాక- ఆఖరి రోజున అనుపోత్సవం (నిమజ్జనం) నిర్వహిస్తారు. ఘనంగా మేళతాళాలతో, వివిధ నృత్యాలతో, బండ్ల వేషాలతో గైరమ్మను తోడ్కొని వెళ్లి... చెరువులు తదితర జలాశయాల్లో నిమజ్జనం చేస్తారు. అయితే, ప్రాంతానికి, ప్రాంతానికి మధ్య ఈ సంబరాల్లో, ఆరాధనా పద్ధతుల్లో కొద్దిపాటి తేడాలు ఉంటాయి. ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్లి అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో స్థిరపడ్డ వారు ఇప్పటికీ ఈ గైరమ్మ సంబరాలు జరుపుకుంటారు. వ్యవసాయంతో ముడి తెగిపోయినప్పటికీ - వారు అక్కడ మూల సంప్రదాయాన్ని ఏటేటా సంబరాల రూపంలో గుర్తు చేసుకుంటారు.
పాటల్లోనే కథలూ గాథలూ ...
గైరమ్మ సంబరాల్లో పాడుకునే అనేక పాటల్లో రామాయణ, భారత గాధల ఇతివృత్తాలు కూడా ఉంటాయి. గంగా పార్వతి సంవాదం, పార్వతీ సందీశ్వరుడి సంవాదం కూడా పాటల్లో వినిపిస్తారు. 'రావనా చందనాలో' వరుసతో వచ్చే పాడే చాలా హుషారుగా సాగుతుంది. ఈ పాట బాణీని గతంలో ఎన్నికల ప్రచారంలోనూ విరివిగా వాడేవారు. గైరమ్మ కథను ఉయ్యాలో వరసలో పాడే పాట కూడా ఉంది.
ఏడుగురు తోడనా ఉయ్యాలో
ఒక్కదాయి రింజమ్మ ఉయ్యాలో
చెల్లెలా రింజమ్మ ఉయ్యాలో ... బాణీలో ఇది
నడుస్తుంది.
గైరమ్మ ఆరాధనలో గోగిపూలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. అది ఈ పాటలో చూడండి.
ఒక్కపువ్వూ పూచే గోగిపువ్వో
పళ్లెరాన పోసి గోగిపువ్వు
పళ్లెరాన పోసె గోగిపువ్వో
ఏడత్తా నీ కొడుకు గోగిపువ్వు
పొద్దోయి వేళాయె గోగిపువ్వు
శివుడెళ్లి చిత్తాడ గోగిపువ్వు
గంగ మరిగిన జాన గోగిపువ్వు..
దీనిలో పార్వతి ఆవేదన, అంతరంగమూ ఆవిష్కృతం అవుతాయి. పాటకు పాట, కథకు కథ .. ఇలా సాగిపోతాయి.
పువ్వుల్లో .. కాయల్లో ...
పంటల ప్రాధాన్యాన్ని వివరించే మరోపాట చిక్కుడు పువ్వుల పాట. ప్రతి పంటలో, పూవులో గైరమ్మను చూడటం జానపదుల ఆనవాయితీ.
చిక్కుడు పువ్వుందమోలీ గైరమ్మా
చిక్కుడ కాయందమా గైరమ్మా
చిలకల పలుకులు సాయప్ప దండాలు
చందమామా నీళ్లు
నీకుడ్డ విరబోసే నా గైరమ్మా నీ నోము
నోచుతివి గైరమ్మా
అరటిపువ్వుందమోలీ గైరమ్మా
అరటిపువ్వందమా గైరమ్మా ... ఇలా అనేక
పువ్వులతో, కాయలతో గైరమ్మను పోలుస్తారు.
ఈ పండగలో భాగంగా నందెన్న (శివుడు)కు
వివిధ ఫలాలను నివేదించే పాట ఉంది.
ఈవొచ్చె ఆవొచ్చె
ఎలగాపళ్లు కావుకొచ్చె
నీవందిపుచ్చుకోరా నందెన్న
నీ గాలి మేడలుకే
ఈవొచ్చె ఆవొచ్చె
దబ్బాపళ్లూ కావుకొచ్చె
నీవందిపుచ్చుకోరా నందెన్న .. ఇలా నడుస్తుంది.
గైరమ్మ కథను మహిళలు తుమ్మీద వరుసలో
పాడతారు.
నోమి నోమన్నల్ల తుమ్మీద
నోమన్నలా రేమి తుమ్మీద
దచ్చి దచ్చిణాది తుమ్మీద
దచ్చుడు భార్య తుమ్మీద
లచ్చమ్మ శివదేవి తుమ్మీద
లచ్చమ్మ కన్నాది తుమ్మీద
నూటొక్క కూతుళ్లను తుమ్మీద ...
ఇదొక పెద్ద కథ. తల్లికూతుళ్ల సంవాదం కూడా
దీనిలోనే సాగుతుంది.
ఒక్కొక్క పువ్వేసి చందమామా
ఒక్క జాము అయ్యే చందమామా
శివపూజ యాళాయె చందమామా
శివుని జాడ లేదే చందమామా
.. ఇది శివుడి కోసం గైరమ్మ ఎదురుచూసే పాట. చాలా హృద్యంగా సాగుతుంది.
ఇలా ఇంకా ఎన్నో ఉన్నాయి. చాలావి పాడేవాళ్లు లేక, పాడేవారి నుంచి వేరెవరూ నేర్చుకోక కాలగర్భంలో కలిసిపోయాయి. కొన్ని పుస్తకాలకు పరిమితమై ఉన్నాయి. రకరకాల పువ్వులు, పంటల్లో పోల్చుకొని.. పొదువుకొని ఉత్తరాంధ్ర జానపద హృదయంలో ఎన్నెన్నో పాటలు, వాటికి అనుగుణంగా ఆటలూ రంజిల్లాయి. ఇప్పుడు అలాంటి జానపద వైభవం లేదు. అక్కడక్కడ వెతికిచూస్తే- కొద్దికొద్ది ఆనవాళ్లు తప్ప- ఇప్పుడు ఎక్కువగా కనిపించవు. కొత్తగా వచ్చిన మార్పుల్లోకి తీరప్రాంతం చాలా వేగంగా మారిపోతూ వచ్చింది. దాని ఫలితమే ఇది. ఇక్కడి తరతరాల ఆటపాటల సంస్క ృతి నానాటికీ తగ్గిపోయి.. కొత్తకొత్తవి చివుళ్లెత్తాయి. నిజానికి జానపదం మన జీవనాడి. మన మూలనిధి. ఉన్నంతలో దానిని కాపాడుకోవటం, రాష్ట్రం నలుచెరుగులా విస్తరించుకోవటం ఒక అవసరం. అలా చేస్తే- అరువు తెచ్చుకున్న ఆధునిక డ్యాన్స్‌ బేబీ డ్యాన్సు స్థానే మనవే అయిన గొంతులు మార్మోగుతాయి. మన గ్రామాల గుండెలు ఉప్పొంగుతాయి.
- సత్యాజీ