ద్రోహానికి సహకరిస్తున్న కేంద్రం
రాజధాని లేకుండా చేసిన పాపం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :జగన్ పాలనలో వైఫల్యం చెందారని, దోచుకోవడం దాచుకోవడం తప్ప మరొకటి అతనికి పట్టడం లేదని రాజధాని రైతుల ధర్నాలో వక్తలు పేర్కొన్నారు. రాజధాని రైతులకు యూన్యూటి (వార్షిక కౌలు) బకాయిలు ఇవ్వాలని, దరఖాస్తుల తనిఖీ పేరుతో వేధింపులు ఆపాలని కోరుతూ బుధవారం విజయవాడలోని ధర్నాచౌక్‌లో రాజధాని పరిరక్షణ సమితి ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. దీనికి పెద్దఎత్తున రైతులు, మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. రైతులు వ్యక్తులకు భూమి ఇవ్వలేదని, ప్రభుత్వానికి ఇచ్చారని తెలిపారు. కానీ జగన్ వచ్చిన తరువాత కక్షపూరితంగా వ్యవహరిస్తూ అమరావతి రాజధానిని అన్యాయం చేశారని అన్నారు. అభివృద్ధి పనులు చేయకపోగా, రైతులను మరిన్ని ఇబ్బందులు పెడుతున్నారన్నారు. స్వయంగా శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ పట్టించుకోవడం లేదని, రాజధాని విషయంలో రాష్ట్రం చేస్తున్న ద్రోహానికి సహకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటే జగన్‌కు ఇబ్బంది ఏమిటో అర్థం కావడం లేదని అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు మాట్లాడుతూ.. ఎపికి రాజధాని లేకుండా చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ద్రోహం చేశాయని అన్నారు. అసైన్డ్ రైతులకు మామూలు రైతులతో సమానంగా పరిహారం ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, భూమిలేని వారికి ఇస్తున్న రూ.2500 పెన్షన్ కూడా ఆరునెలలకు ఒకసారి ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.5,000 పెంచుతామన్న హామీని గాలికొదిలేశారని అన్నారు. కేంద్రం కూడా నిధులివ్వకుండా మొండిచేయి చూపిందన్నారు. భూములిచ్చిన రైతులు కౌలు కోసం కోర్టుకు వెళ్లాల్సిన దుస్థితి కల్పించారని అన్నారు. మా దళితులు, గిరిజనులు అంటూ కబుర్లు చెప్పే ముఖ్యమంత్రి అమరావతి దళితులు, బలహీనవర్గాలకు చెందిన అసైన్డ్ రైతులకు కౌలు ఇవ్వడం లేదని తెలిపారు. 1,300 రోజుల నుండి నిర్విరామంగా పోరాడుతున్న రైతులకు సిపిఎం తరపున సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అమరావతి రాజధానిగా ఉండాలని, కొనసాగాలని తొలి నుండి సిపిఎం తరపున పోరాడుతున్నామని పేర్కొన్నారు. ప్రజాభిప్రాయాన్ని, కోర్టు తీర్పులను, చట్టాలను లెక్క చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమరావతి ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేశాయని పేర్కొన్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. రైతుల పోరాటానికి తమవంతు మద్దతు ఉంటుందని అన్నారు. ముఖ్యమంత్రి మూర్ఖంగా పాలన సాగిస్తున్నారని, ప్రజలు విసిగి వేసారిపోయారని అన్నారు. అన్నిట్లోనూ దోపిడీ సాగుతోందని, నెలకు రెండువేల కోట్లు తాడేపల్లిలోని సిఎం ప్యాలస్‌కు చేరుతున్నాయని ఆరోపించారు. అమరావతి పరిరక్షణ సమితి నాయకులు శివారెడ్డి, పువ్వాడ సుధాకర్ మాట్లాడుతూ.. చట్ట ప్రకారం పూలింగుకు భూములు ఇస్తే దానిపై నిరంకుశంగా వ్యవహరిస్తూ వేధింపులకు దిగడం అన్యాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ.. రాజధానికి అన్యాయం జరగడం వెనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా వ్యవహరించాయని విమర్శించారు. ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య మాట్లాడుతూ.. రైతులకు అన్యాయం చేసిన ఏ ప్రభుత్వాలు మనుగడ సాగించలేదని అన్నారు. పంటలు పండే భూములను ప్రభుత్వం తీసుకుందని, అయినా వ్యక్తులకు ఇచ్చారని ప్రచారం చేసి జగన్‌మోహన్‌రెడ్డి కక్షపూరిత చర్యలకు దిగారని విమర్శించారు. కార్యక్రమానికి ముందు రాజధాని ప్రాంతంలో వైసిపి ప్రభుత్వం వేధింపులతో మనోవేదనకు గురై మరణించిన వారికి సంతాపంగా ఒక నిమిషం మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎం రవి, వెంకటేశ్వరరావు, రామారావు, ఎర్ర పీరు, పరిరక్షణ సమితి నాయకులు జి జయకృష్ణ, బెజవాడ నరేంద్ర, కొండయ్య, కె నరేంద్ర పాల్గన్నారు.