- మాస్టర్ ప్లాన్ మార్పుతో ఆశలు అడియాసలు
- రిటర్నబుల్ ప్లాట్ల అభివృద్ధి శూన్యం
- విక్రయించుకోలేక, రుణాలు రాక రైతుల కుటుంబాల్లో ఆర్థిక సంక్షోభం
ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి:రాజధాని రైతులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. భవిష్యత్తు ఏమిటన్నదీ వారికి అంతుబట్టడం లేదు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు ఇప్పటికే చాలా వరకు నష్టపోయారు. రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి భూ సమీకరణలో తిరిగి సిఆర్‌డిఎకు భూములు ఇచ్చిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సిఆర్‌డిఎకు భూ సమీకరణలో భూములు ఇచ్చిన వారికి అభివృద్ధి చేసిన రిటర్నబుల్ ప్లాట్లు ఎప్పటికి అందుతాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. రాజధానిలో ఎనిమిదేళ్ల క్రితం భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతుల ప్లాట్ల అభివృద్ధిని వైసిపి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రాంతంలో 50,793 మంది పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించింది. ఈ పరిణామం రైతులకు ఏ మాత్రమూ మింగుడుపడడం లేదు. పేదలకు సెంటు భూమి పంపిణీ నిమిత్తం ప్రభుత్వం దాదాపు 1,400 ఎకరాల్లో యుద్ధ ప్రాతిపదికన 25 లే అవుట్లను ఏర్పాటు చేసింది. మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో చూపిస్తోన్న ఆసక్తి తమ ప్లాట్ల అభివృద్ధిపై చూపడంలేదని 29 గ్రామాల రైతులు వాపోతున్నారు. 2014లో అప్పటి టిడిపి ప్రభుత్వం 24 వేల మంది రైతుల నుంచి 34,385 ఎకరాల భూమిని సమీకరించి సిఆర్‌డిఎకు అప్పగించింది. భూములు కోల్పోయిన వారిలో చిన్న, సన్నకారు రైతులు ఎక్కువ మంది ఉన్నారు. రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి భూ సమీకరణలో భూములు ఇచ్చిన వారూ ఐదారు వేల మంది ఉన్నట్లు సమాచారం. వీరిందరికి మూడేళ్లలో అభివృద్ధి చేసిన రిటర్నబుల్ ప్లాట్లను అప్పగించాల్సి ఉంది. గత ప్రభుత్వం ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ చూపలేదు. అప్పట్లో రిటర్నబుల్ ప్లాట్ల అప్పగింత కాగితాలపైనే జరిగింది. వాణిజ్య, గృహ అవసరాల నిమిత్తం మొత్తం 63,462 ప్లాట్లను ఎంపిక చేసి 42,529 ప్లాట్లను సంబంధిత భూ యజమానులకు 2019కి ముందే సిఆర్‌డిఎ రిజిస్ట్రేషన్ చేసింది. మిగతా ప్లాట్లకు రిజిస్ట్రేషన్ ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది. రైతుల నుంచి భూ హక్కు పత్రాలన్నింటినీ సిఆర్‌డిఎ స్వాధీనం చేసుకుంది. అభివృద్ధి చేసిన ప్లాట్ల అప్పగింతకు ఎకరాకు రూ.కోటి చొప్పున రూ.35 వేల కోట్లు ఖర్చు అవుతుందని గత ప్రభుత్వం అంచనా వేసింది. అందుకు సంబంధించి నిధులు సమీకరించలేకపోయింది. దీంతో, అభివృద్ధి చేసిన ప్లాట్లు రైతులకు దక్కలేదు. రైతులకు ఏర్పాటు చేసిన లేఅవుట్‌ల్లో కనీస సదుపాయాల్లేక చిట్టడవుల్లా తయారయ్యాయి. పిచ్చి చెట్లు పెరిగిపోయి ఎవరి ప్లాటు ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి ఉంది. ప్లాట్లు ఇతరులకు అమ్ముకోవాలన్నా, బ్యాంకులో రుణం పొందాలన్నా రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రైతులకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్ల అభివృద్ధికి ఎకరాకు రూ.3 కోట్ల చొప్పున రూ.లక్ష కోట్లు కావాలని, అంత సొమ్ము తమ వద్ద లేదని వైసిపి ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. టిడిపి ప్రభుత్వం రూపొందించిన మాస్టర్ ప్లాన్ కొనసాగింపుగా నవనగరాలు ఏర్పాటై, తమకు అభివృద్ధి చేసిన ప్లాట్లను అప్పగిస్తే తమ ప్లాట్లకు మంచి ధరలు వచ్చి ఉండేవని రైతులు అంటున్నారు. మూడు రాజధానుల పేరుతో ప్రభుత్వం దారుణంగా దెబ్బతీసిందని వాపోతున్నారు. టెక్నాలజీ సిటీ కోసం కేటాయించిన భూముల్లో 1400 ఎకరాలు తీసుకుని 50,793 ఇళ్ల నిర్మాణం చేపడితే తమ ప్లాట్లకు ధరలు ఎలా వస్తాయని రైతులు మదనపడుతున్నారు. జులై 8 నుంచి ఈ స్థలాల్లో ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామని సిఎం జగన్ శుక్రవారం ప్రకటించారు. ఇళ్లు నిర్మించిన తరువాత కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చినా ఏం చేయగలమని ప్రశ్నిస్తున్నారు.