ప్రజాశక్తి-కంచికచర్ల (ఎన్‌టిఆర్ జిల్లా):దసరా ఉత్సవాలలో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రం బాసర వెళ్తూ రైలు ప్రమాదంలో తండ్రీ కుమార్తె మృతి చెందారు. ఈ సంఘటన నిజామాబాద్‌లోని రైల్వే స్టేషన్‌లో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... ఎన్‌టిఆర్ జిల్లా కంచికచర్ల మండలం గనిఆత్కూరు గ్రామానికి చెందిన చలమల రామచంద్రరావు (45) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ, కుటుంబంతో కలిసి అక్కడే ఉంటున్నారు. ఆయనకు భార్య సునీత, కుమార్తెలు జస్మిత, జనని (13) ఉన్నారు. దసరా ఉత్సవాల నేపథ్యంలో సరస్వతీ దేవి ఆలయానికి శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి బాసరకు రైలులో బయలుదేరారు. రామచంద్రరావు, ఆయన భార్య సునీత ఒక బోగీలో, వారి ఇద్దరు కుమార్తెలు మరో బోగీలో ఎక్కారు. అందరూ ఒకే బోగీలోకి మారేందుకు నిజామాబాద్‌లో రైలు దిగారు. భార్య ఉన్న బోగీలోకి పెద్ద కుమార్తెను ఎక్కించారు. చిన్న కుమార్తె జననీని ఎక్కించే క్రమంలో రైలు ముందుకు కదిలింది. దీంతో పట్టు కోల్పోయిన జనని ప్రమాదవశాత్తూ రైలు కింద పడిపోయింది. ఆమెను పైకి లాగే క్రమంలో రామచంద్రరావు ప్లాట్ ఫాంపై పడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో జనని దుర్మరణం చెందగా, గాయపడిన రామచంద్రరావును స్థానికులు ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కళ్ల ముందే భర్త, కుమార్తె మృతి చెందడంతో సునీత కుప్పకూలిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మఅతదేహాలకు పోస్టుమార్టం అనంతరం స్వగ్రామమైన గనిఆత్కూరుకు తరలించారు. నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్‌మోహన్‌రావు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మృతదేహాలను సందర్శించి నివాళులర్పించారు.