Nov 02,2023 11:17
  • రైల్వేలో లోపించిన పారదర్శకత
  • రాయగడ ఎక్స్‌ప్రెస్‌కు వెనక గూడ్స్‌ ఇంజన్‌ దేనికి ?
  • వాకీటాకీలు మొరాయించినా ఎందుకు పట్టలేదు ?
  • రైలు ప్రమాదంపై సమాధానం దొరకని ప్రశ్నలు ఎన్నో!

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : ఇద్దరు పైలట్లు, ఒక గార్డు సహా 14 మంది ప్రయాణికుల మృత్యువాత వెనుక గూడ్స్‌కు వాడాల్సిన, అదీ పనిచేయని 'డెడ్‌ ఇంజనే' కారణమా? అంటే... అవుననే సమాధానమే వస్తోంది. గత నెల 29న విజయనగరం జిల్లా అలమండ వద్ద జరిగిన రైలు ప్రమాదానికి... రాయగడ పాసింజర్‌కు వెనక పాత గూడ్స్‌ ఇంజిన్‌ అమర్చడమే కారణమని తేలినట్లు సమాచారం. పాత గూడ్స్‌ ఇంజన్‌ విశాఖ నుంచి రాయగడకు వెళ్లే రైలుకు వెనుక ఉండడాన్ని పలువురు స్థానికులు గుర్తించారు. దాన్ని రాయగడ రైలుకు అవసరం లేకపోయినా ఎందుకు అమర్చారన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఇది పాతది, అత్యంత బరువైనది కావడంతో పలాస పాసింజర్‌ను బలంగా వెనక నుంచి ఢకొీట్టడంతో బోగీలపై భారీ ఒత్తిడి పెరిగి 14 మంది ప్రయాణికుల మృతికి కారణమైందనే వాదన వినిపిస్తోంది. 'పనిచేయని ఇంజన్‌ను, గూడ్స్‌కు వాడాల్సిన దాన్ని దీనికి తగిలించడం తీవ్ర నేరం' అని రైల్వే ఉద్యోగుల్లోనూ చర్చ నడుస్తోంది. అదీగాక ఆ రోజు పొద్దున్నుంచీ డిఫెక్ట్‌ సిగల్‌ అని తెలిశాక ఎటువంటి మరమ్మతులూ చేపట్టకపోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగాక ఎలా సరిచేశారు? ఈ పని ముందే చేసివుంటే 14 మంది ప్రాణాలు నిలబడేవి కదా? అంటూ రైల్వే ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. పైగా, కంటకాపల్లి నుంచి మరో ఐదు నిమిషాల్లో అలమండకు వెళ్లే క్రమంలో చిన్న డౌన్‌ ఉండడంతో రాయగడ వేగంగా వచ్చి గుద్దడంతో బోగీల్లో జనం చనిపోయారని స్పష్టమవుతోంది. కంటకాపల్లి-అలమండ మధ్య రైలు ప్రమాదం జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే సిగలింగ్‌ సిస్టంను రైల్వే అధికారులు సరిచేశారు. అంతకు ముందు డ్యూటీకి వెళ్లిన వారంతా సిగలింగ్‌ వ్యవస్థ దెబ్బతిన్న విషయాన్ని సంబంధిత ఉన్నతాధికారులకు చెప్పినా పట్టనట్టు వ్యవహరించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లోకో పైలట్లు, అసిస్టెంట్‌ లోకో పైలట్ల వద్దగల వాకీటాకీలు సైతం ప్రమాదం రోజు మొరాయించాయి. ఆ రోజు డ్యూటీలో ఉన్న అసిస్టెంట్‌ లోకో పైలట్లు, లోకో పైలట్లకు ఎలాంటి రాతపూర్వక జాగ్రత్తలూ రైల్వే నుంచి లేవని కొంతమంది ఉన్నతోద్యోగులే చెబుతున్నారు. ఆ రోజు ఉదయం నుంచి సుమారు పది రైళ్ల వరకూ ఆ ట్రాక్‌పై వెళ్లినా వాకీటాకీలేవీ పనిచేయలేదు. ఆ విషయాన్ని రైలు రెగ్యులర్‌ బుక్స్‌లో రాసినా అసిస్టెంట్‌ లోకో పైలట్లు, లోకో పైలట్లకు మాత్రం చెప్పలేదు.
 

                                                             తప్పుడు నివేదికలు సిద్ధమవుతున్నాయా ?

ఈ దుర్ఘటనపై బుధవారం వాల్తేరు రైల్వే డిఆర్‌ఎం కార్యాలయంలో విచారణ సాగింది. సిగలింగ్‌ సిస్టం, ట్రాక్‌ బ్రిడ్జ్‌ ఇతరత్రా సిబ్బంది పాల్గొన్నారు. రైల్వే ఉన్నతాధికారులు ఈ సందర్భంగా ప్రమాదానికి కారణం (పైలట్‌ ఎలాగూ చనిపోయారు కదా!) మానవ తప్పిదంగా నివేదిక సిద్ధం చేయాలని హుకుం జారీ చేసినట్లు తెలిసింది. పొద్దున్నుంచీ సిగల్‌ సిస్టంపై సమాచారం ఉన్నా స్పందించలేదు. రాయగడ లోకో పైలట్‌ పడుకుని ఉండొచ్చని కూడా అధికారులు నెపం నెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. విశాఖ నుంచి రైలు బయల్దేరిన రెండు గంటల్లోనే నిద్రలోకి వెళ్లిపోతారా ఎక్కడైనా? లేదా ఓవర్‌ టైం ఒత్తిడా? రైల్వే అధికారులు దేన్ని నివేదించనున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఆటో సిగల్‌ ఈ మధ్యనే ఈ రూట్‌లో పెట్టినందున అనుభవం ఉన్న లోకో పైలట్లతో పంపాల్సి ఉండగా, రాయగడ లోకో పైలట్‌కి ఎలాంటి లెర్నింగ్‌ ట్రిప్‌ ఇచ్చిన దాఖలాలు లేవని రైల్వే వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒకవేళ సిగల్స్‌ పనిచేయడం లేదు కాబట్టి రాయగడ లోకో పైలట్‌ అలమండకు సమీపంలోకి వచ్చినప్పుడు రెడ్‌ సిగల్‌ ఉందే అనుకుందాం... ఎలాగూ సిగల్‌ సిస్టం పనిచేయడం లేదు కాబట్టి ముందుకెళ్లిపోయాడా? అన్న ప్రశ్న కూడా ఉద్భవిస్తోంది.