Oct 30,2023 07:42

విజయనగరం: విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు డీ కొన్న ఘటనలో 13 మంది మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లలో విజయనగరం ఆసుపత్రికి తరలిస్తున్నారు. రైల్వే అధికారుల, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 7.10 గంటల సమయంలో విశాఖ నుంచి పలాస వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్‌ రైలు కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద సిగల్‌ కోసం పట్టాలపై ఆగి ఉంది. అదే సమయంలో దాని వెనకాలే వస్తున్న విశాఖ-రాయగడ రైలు.. ప్యాసింజర్‌ రైలును డీ కొట్టింది. ప్రమాదంపై రైల్వే బోర్డు గ్రూపులో డీఆర్‌ఎం సౌరబ్‌ ప్రసాద్‌ సమాచారం ఇచ్చారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ప్రమాదంలో 3 బోగీలు పట్టాలు తప్పాయి. రైళ్లు డీకొనడంతో ఘటనా స్థలంలో విద్యుత్‌ వైర్లు తెగిపోయాయి. దీంతో ఆ ప్రాంతమంతా అంధకారం నెలకొనడంతో సహాయక చర్యలకు ఆటంకమేర్పడింది. మఅతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఘటనా స్థలిలో భీతావహ పరిస్థితి నెలకొంది.
విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటన నేపథ్యంలో అధికారులు హెల్ప్‌ లైన్‌ నంబర్లు ఏర్పాటు చేశారు. సమాచారం కోసం.. 0891 2746330, 0891 2744619, 81060 53051, 81060 53052, 85000 41670, 85000 41677, 83003 83004, 85005 85006 నెంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు.

  • రైలు ప్రమాద ఘటనపై సీఎం దిగ్భ్రాంతి

రైలు ప్రమాద దుర్ఘటనపై ముఖ్యమంత్రి జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న ప్యాసింజర్‌ రైలుకు ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం వచ్చిందని, ఈ ఘటనలో నాలుగు బోగీలు పట్టాలు తప్పినట్టుగా సమాచారం అందుతోందని సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. విజయనగరం సమీప జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి నుంచి వీలైనన్ని అంబులెన్స్‌లను పంపించాలని, మెరుగైన వైద్యం అందించడానికి సమీప ఆస్పత్రుల్లో అన్నిరకాల ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. వైద్య ఆరోగ్య, పోలీసు, రెవిన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులకు వైద్య సేవలు అందేలా చూడాలని సీఎం ఆదేశాలు జారీచేశారు.