Nov 14,2023 08:23

-తొమ్మిది మంది మృతి
-వీరిలో ఆరుగురిది ఒకే కుటుంబం
-పలువురికి తీవ్ర అస్వస్థత
-సెల్లార్‌లో అక్రమంగా నిల్వ చేసిన రసాయనాలే కారణం
-తెలంగాణ సిఎం, గవర్నర్‌ దిగ్భ్రాంతి
-మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో:నివాస సముదాయంలో అక్రమంగా నిల్వ చేసిన రసాయనాలు పేలి తొమ్మిది మంది మృతి చెందారు. వీరిలో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రమాదంలో చిక్కుకున్న 21 మందిని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, డిఆర్‌ఎఫ్‌ బృందాలు కాపాడాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్‌ నాంపల్లి ప్రాంతంలోగల బజార్‌ఘాట్‌లోని వ్యాపారవేత్త రమేష్‌ జైశ్వాల్‌కు చెందిన బాలాజీ రెసిడెన్సీ నాలుగు అంతస్తుల భవనంలో సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. సెల్లార్‌ నుంచి రగులుకున్న మంటలు అక్కడ అక్రమంగా ప్లాస్టిక్‌ డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన బెంజీన్‌ నైట్రేట్‌ ద్రావణానికి అంటుకోవడంతో నిమిషాల వ్యవధిలోనే నాలుగు ఫ్లోర్లకు వ్యాపించాయి. మండే గుణం కలిగిన రసాయనాలు కావడంతో మంటల తీవ్రతతోపాటు దట్టమైన పొగలు కమ్మేయడం, పేలుడు సంభవించడంతో అపార్ట్‌మెంట్లోని వారు భయంతో బయటకు పరుగులు తీశారు. అయితే, అప్పటికే మెట్ల మార్గంలో నల్లటి పొగలు కమ్మేయడంతో ఎటు వెళ్లాలో అర్థం కాక 'రక్షించండి. రక్షించడం' అంటూ పలువురు బిగ్గరగా కేకలు చేశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, జిహెచ్‌ఎంసికి చెందిన డిఆర్‌ఎఫ్‌ బృందాలు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అతికష్టమ్మీద భవనం లోపలికి వెళ్లిన రెస్క్యూ టీం మొదటి, రెండు అంతస్తుల్లో అపస్మారక స్థితిలో ఉన్న తొమ్మిది మందిని నిచ్చెల సహాయంతో కిందకి తెచ్చి ఉస్మానియా ఆస్పత్రికి తరలించింది. అయితే, అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. మంటల్లో చిక్కుకుని ప్రాణాలతో బైటపడిన 21 మందిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ప్రమాదంలో కొన్ని కార్లు, పలు ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. మృతుల్లో ఎండి జకీర్‌ హుస్సేన్‌ (66), ఎండి అజాం (57), రెహ్మాన్‌ సుల్తానా (50), నికత్‌ సుల్తానా (50), తహురా ఫర్హీమ్‌ (35), హజేబుర్‌ రెహ్మాన్‌ (32), ఫైజా సమీనా (26), తరోబా (13), మన్హ (6) ఉన్నారు. నికత్‌ సుల్తానా, ఫర్హీమ్‌, రెహ్మాన్‌ తప్ప మిగిలిన ఆరుగురూ ఒకే కుటుంబానికి చెందినవారు. ప్రమాద ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌, గవర్నర్‌ తమిళిసై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఘటనాస్థలికి వెళ్లాల్సిందిగా మంత్రులు కెటిఆర్‌, తలసానిలను సిఎం ఆదేశించారు. ప్రమాద ఘటనపై పూర్తి వివరాలతో నివేదిక అందజేయాల్సిందిగా పోలీసులకు గవర్నర్‌ ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మంత్రులు కెటిఆర్‌, తలసాని, మేయర్‌ విజయలక్ష్మి, స్థానిక నాయకులు ఫిరోజ్‌ ఖాన్‌, నంద కిషోర్‌ వ్యాస్‌, కుమార్‌ గౌడ్‌, విహెచ్‌ తదితరులు సందర్శించారు. బాధితులను పరామర్శించారు. దీపావళి సందర్భంగా కాల్చిన పటాసుల నిప్పు రవ్వలు సెల్లార్‌లో పడి రసాయనాలకు అంటుకుని మంటలు వ్యాపించి ఉంటాయని క్లూస్‌ టీం ప్రాథమికంగా నిర్థారించినట్టు పోలీసులు తెలిపారు. నాంపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

  • రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి : సిపిఎం గ్రేటర్‌ హైదరాబాద్‌ కమిటీ

అగ్నిప్రమాద ఘటన ప్రాంతాన్ని సిపిఎం బృందం సోమవారం సందర్శించింది. ప్రమాదం జరిగిన తీరుపై స్థానికులతో ఆరా తీసింది. హైదరాబాద్‌ నగరంలో అగ్నిప్రమాదాలు తరచుగా జరుగుతున్నా వాటి నివారణకు ప్రభుత్వం నిర్ధిష్ట చర్యలు తీసుకోవడంలేదని సిపిఎం గ్రేటర్‌ హైదరాబాద్‌ కమిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌ విమర్శించారు. నాంపల్లి ప్రమాద ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. సిపిఐ నేతలు నారాయణ, చాడ వెంకటరెడ్డి తదితరులు ప్రమాద ప్రాంతాన్ని సందర్శించారు.

  • ఘటన బాధాకరం : సిపిఎం ఎపి రాష్ట్ర కమిటీ

హైదరాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందడం బాధాకరమని, హృదయ విదారకమని సిపిఎం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపింది. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.