Aug 11,2023 11:54

 రుషికొండ ఐటి జంక్షన్‌ వరకూ చకచకా రోడ్ల విస్తరణ
 రాజధాని కోసమేనంటున్న జనం

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : విశాఖ సాగర తీరంలో పనులు శరవేగంగా సాగుతున్నాయి. రుషికొండ ఐటి జంక్షన్‌ వరకూ పలు రోడ్లను లింక్‌ చేస్తూ విస్తరణ చేపట్టారు. విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సహా ఆయన మంత్రివర్గం, ఎమ్మెల్యేలూ చెబుతున్న సంగతి తెలిసిందే. క్యాపిటల్‌ ఏరియాగా ప్రచారం జరుగుతున్న విశాఖ సాగర్‌ నగర్‌, పిఎం.పాలెం, మధురవాడ, రుషికొండ మొదలు భీమునిపట్నం వరకూ సుందరీకరణ పనులు సాగుతున్నాయి. ఆర్‌కె బీచ్‌, సాగర్‌ నగర్‌, జోడుగుళ్లపాలెం, రుషికొండ నుంచి భీమునిపట్నం వరకూ సముద్రపు ఒడ్డునంతటినీ యంత్రాలతో వారం రోజులుగా చదును చేస్తున్నారు. బీచ్‌లో ఇసుకను చాలా వరకూ తీసేసి శుభ్రం చేశారు.
చీచ్‌ రోడ్‌ సుందరీకరణ
ఇప్పటికే పది ఎలక్ట్రిక్‌ ఆటోలను ఆర్‌కె బీచ్‌ నుంచి సాగర్‌ నగర్‌ వరకూ ఉచితంగా ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ డ్రైవర్లకు రూ.14 వేలకుపైగా జీతాన్ని ప్రభుత్వం నిర్ణయించింది. సాగర తీరం వెంబడి అటవీ శాఖ భూమి అధికంగా ఉండడంతో 'గ్రీన్‌ ఆర్మీ' పేరుతో 25 మందిని సాగర తీరం వెంబడి విధులకు వేసింది. ఇటీవలే వీరిని రిక్రూట్‌మెంట్‌ చేసి నెలకు రూ.18 వేల జీతం ఒక్కొక్కరికీ ఇస్తోంది. బీచ్‌ రోడ్డుకు ఇరువైపులా డివైడర్లపై మొక్కలను వీరు పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వం మరోవైపు అనేక ప్రాజెక్టులనూ చకచకా చేపట్టింది. హనుమంతవాక జంక్షన్‌ నుంచి జోడుగుళ్లపాలెం వెళ్లే 50 అడుగుల రహదారిని 80 అడుగులకు విస్తరించే పనులు మొదలయ్యాయి. క్యాపిటల్‌ ఏరియా డవలప్‌మెంట్‌గా అధికారులు కొంతమంది దీన్ని పేర్కొంటున్నారు. పిఎం పాలెం హైవే నుంచి నేరుగా ఐటి రుషికొండ జంక్షన్‌ వరకూ రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
పెద్దలకదలికలు
రుషికొండపై మొక్కలు, చెట్లు, గతంలో ఉన్న హోటళ్లను వైసిపి సర్కారు పడగొట్టేసి కొత్త నిర్మాణాలను చేపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇక్కడ రెండు భారీ భవంతులు సిద్ధమయ్యాయి. జులై 30న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా ఈ ప్రాంతాన్ని రహస్యంగా సందర్శించి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఆనందపురం మండలం తర్లువాడ కొండపైకి వైపిపి సీనియర్‌ నాయకులు, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి రహస్యంగా ఈ నెల 5న వెళ్లి, రెండు గంటల పాటు పరిశీలించి వెళ్లారు. మరోవైపు భీమునిపట్నం, ఆనందపురం, పద్మనాభం మండలాల్లో పెద్ద ఎత్తున ల్యాండ్‌ పూలింగ్‌కు రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. భీమునిపట్నం మండలం నేరెళ్లవలసలో 31 ఎకరాలను సమీకరిస్తున్నట్లు వారు చెబుతున్నారు. ఆనందపురం మండలంలో ఇప్పటికే ల్యాండ్‌ పూలింగ్‌ మొదలైంది. రుషికొండపై రాజధాని కార్యాలయాలు ఉంటాయన్న చర్చ తాజాగా జరుగుతోంది.