అనగనగా ఒక ఊరిలో ఒక రైతు కుటుంబం ఉండేది. వాళ్లది చాలా పేద కుటుంబం. పంటలు పండక చాలా కష్టాలు పడేవారు. ఒక పూట తిని రెండో పూట పస్తులుండే వారు. వాళ్లకి ఒక కొడుకు ఉన్నాడు. కొడుకును చాలా ప్రేమగా పెంచేవారు. అతన్ని బాగా చదివించాలన్నది రైతు కల. తండ్రి కలను నెరవేర్చేలా కొడుకు బాగా చదివి ఉద్యోగం సంపాదించుకున్నాడు. అయితే ఉద్యోగం వచ్చాక ఇంటికి వచ్చిన కొడుక్కి అక్కడి పరిస్థితుల్లో ఏమీ మార్పు కనబడ లేదు. తన చిన్నప్పుడు తమ కుటుంబం పడిన బాధలు, కష్టాలు ఇప్పటికీ అక్కడ చాలా కుటుంబాలు అనుభవిస్తు న్నాయి. ఇవన్నీ చూసిన రైతు కొడుకు ఎక్కడో పట్టణంలో ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించడం కంటే ఇక్కడే ఊళ్ళోనే ఏదైనా ఊరు బాగుపడే పని చేయాలనుకున్నాడు. వ్యవసాయ పనిముట్ల దుకాణం పెట్టాడు. గతంలో ఎప్పుడూ ఆ ఊరివాళ్లు ఆ వస్తువులు వాడలేదు. దీంతో స్వయంగా వాటిని ఎలా ఉపయోగించాలో నేర్పాడు. డబ్బులు లేని వాళ్లకు ఉచితంగా ఇచ్చాడు. రైతు కొడుకు చేసిన సాయం వల్ల, పనిముట్ల వాడకం వల్ల ఆ యేడు పంటలు బాగా పండాయి. అందరి కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. చిన్నవాడైనా ఊరి బాగుకోసం రైతు కొడుకు పడిన తాపత్రయం ఊరందరినీ సంతోషపరిచింది. శాస్త్ర, సాంకేతికతంగా ఎలా ముందుకెళ్లాల్లో నేర్పించిన అతని తెలివితేటలను ఊరివాళ్లు ప్రశంసించారు.
- ఎన్. శ్రీసాయి పవన్,
6వ తరగతి, పొనుకుమాడు,
ఏలూరు జిల్లా.










