బాబ్రీ మసీదు విధ్వంసంలో బిజెపి, సంఫ్‌ు పరివార్ శక్తులు రెచ్చిపోతున్నాయి. కేంద్రంలో అధికారంతో పాటు కీలక రాష్ట్రాల్లో పాగా వేసిన బిజెపి, తన పరివార్ అజెండాను అన్ని రంగాల్లోనూ అమలు చేస్తోంది. దీనికి రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ నీరుగారుస్తోంది. బాబ్రీ మసీదు విధ్వంసం జరిగి 30 ఏళ్ల అయిన సందర్భంగా రాష్ట్రంలో పలువురు ప్రముఖ సాహితీవేత్తలు, మాజీ ఉపకులపతులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు స్పందించారు. స్పందన వారి మాటల్లోనే....

మతం వ్యక్తిగతం.. మనం భారతీయులం..! : శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఎ షరీఫ్˜, పశ్చిమ గోదావరి జిల్లా
1992 డిసెంబర్ ఆరో తేదీన జరిగిన బాబ్రీమసీదు కూల్చివేత ఘటన అప్రజాస్వామికం. అది బాధాకరమైన ఘటన. ప్రపంచంలోనే ప్రజాస్వామ్య విలువలకు భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏదైనా సమస్య వస్తే చర్చలు, న్యాయస్థానాల ద్వారా పరిష్కరించుకునే అవకాశాలున్నాయి. కానీ బాబ్రీమసీదు కూల్చివేతతో జనబలం, సంఖ్యాబలం ఉంటే ఏదైనా చేస్తారనే భావన ప్రజల్లో నెలకొంది. మతసామరస్యానికి ఇది అత్యంత విఘాతం కలిగించే అంశంగా మారింది. మసీదును కూల్చగలిగారు గానీ చివరికి మళ్లీ న్యాయస్థానానికి వెళ్లాల్సి వచ్చింది. ప్రజాస్వామ్య దేశంలో ఇష్టానుసారంగా వ్యవహరించడం కుదరదు. మనం చిన్నప్పటి నుంచి స్కూల్స్‌లో భారతదేశం మన మాతృభూమి, మనమంతా సహోదరులమంటూ చెబుతుంటాం. మతం వ్యక్తిగతం. ముందుగా మనం భారతీయులమని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరూ దేశ గౌరవం, ప్రతిష్టను కాపాడుకునేందుకు పాటుపడాలి. మతాన్ని రాజకీయ కోణంలో చూడటం ఇబ్బందికరంగా మారుతోంది. దీంతో మతసామరస్యానికి తీవ్ర విఘాతం కలిగే పరిస్థితిని తీసుకొస్తున్నారు. హిందూ, ముస్లిం ప్రజానీకంలో బేధాలు లేవు. మతసామరస్యం, లౌకిక విధానం ఇప్పటికీ దేశ ప్రజల్లో ఉంది. మతంతో సంబంధం లేకుండా అందరిలోనూ కలివిడితనం ఉంది.. మనిషి బతకడానికి మతం కాదు..ఆర్థిక సామాజిక ప్రోత్సాహాలను ప్రభుత్వాలు అందించాలి. మతం అనేది ఆధ్యాత్మిక చింతన మాత్రమే. ఎవరికి నచ్చిన దేవుణ్ని వాళ్లు కొలుస్తారు. మానవత్వం కాపాడితే అదే మనల్ని కాపాడుతుంది.

సామ్రాజ్యవాదానికి మతోన్మాదం తోడు ప్రమాదకరం : ద్రవిడ యూనివర్శిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కెఎస్ చలం, విశాఖ
మనదేశంలోని లౌకిక మూలాలు అశోకుని కాలం నుంచీ ఉన్నాయి. తన రాతి శాసనాల్లో అందరినీ సమానంగా చూడాలని ఆదేశాలూ ఉన్నాయి. మనుషులంతా ఒక్కటే అనే నినాదం పురాణకాలంలోనూ విస్తరించింది. 1991లో ఆర్థిక సామ్రాజ్యవాద విధానంతో పాలకులు అనుసరించిన సంస్కరణలు కొంత మేర దేశ లౌకిక మూలాలను దెబ్బతీశాయని చెప్పవచ్చు. ఓ పక్క ఈ ప్రమాదకర సంస్కరణలపై దేశ ప్రజల్లో ఆందోళన కొనసాగుతున్న క్రమంలో 1992 డిసెంబరు 6న బాబ్రీ మసీదు కూల్చివేత జరిగింది. ఈ దేశంలో లౌకిక వాదానికి పెద్ద ప్రమాదం దాపురించింది. ఇది యాధృచ్ఛికమా? లేదా కావాలని చేశారా? అనే అంశాన్ని పరికించి చూస్తే.. ఆ రోజు అనేది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్థంతి. దేశంలోని హిందూత్వ శక్తులు ఈ రోజును ఎంచుకుని బాబ్రీ విధ్వంసానికి పాల్పడడం దేశంలోని ప్రజలంతా విస్మయానికి గురైన సంగతిని నేటికీ మరచిపోలేము. ఇది యాధృచ్ఛికంగా జరిగింది కాదన్నది రూఢి పరచుకోవచ్చు.ఇంతవరకూ ఈ విధ్వంసంపై చాలా విశ్లేషణలూ వెలువడ్డాయి. హిందూత్వ మూకలు పని గట్టుకుని బాబ్రీ మసీదును నాశనం చేసి తమ అజెండా అమలుకోసం నాటినుంచీ ప్రయత్నిస్తున్నారు. ఆనాటి నుంచీ ఈ దేశం హిందూత్వం వైపు పయనించేలా కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఈ తరహా దుర్మార్గ ఘటనలు మనదేశంలో ఎక్కడా సరిగ్గా లిఖించబడకపోవచ్చు. మానవ నాగరికతను మరింత వెనక్కి నెట్టే చర్యలపై మేథావి వర్గం నోరుమెదపాలి. ఆర్థిక సామ్రాజ్యవాదం ఒకవైపు, మతోన్మాదం మరోవైపు భారతదేశ మూలాలపై దాడులు చేస్తూ ప్రజలను, వ్యవస్థలను తీవ్ర అవస్థలకు గురిచేయడం అందరూ ఖండించాల్సిన విషయం. లౌకిక వాదులు ఈ అంశాలపై ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది. భవిష్యత్‌లో ప్రమాదకర పోకడలు పెరగకుండా అభ్యుదయ శక్తులు కలసికట్టుగా పునరేకీకరణ కావాల్సిన అవసరం ఉంది.

మతతత్వంపై పోరుకు విశాల ఐక్యవేదికలు : కృష్ణా-గుంటూరు ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు
హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధం, జైనం, సిక్కు, పార్శి తదితరమతాల భిన్నత్వంతో సాంప్రదాయాలతో కొనసాగుతున్న పరిస్థితులు దేశంలో ఉన్నాయి. లౌకిక వాదం, లౌకిక విధానాల ద్వారానే భారత దేశ భిన్నత్వం రక్షించబడుతోంది. రాజ్యాంగ నిర్మాతలు రాజ్యంగంలో మత స్వేచ్ఛకు, లౌకిక వాదానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మత సామరస్యం కొనసాగాలని ఆకాక్షించారు. కానీ ప్రస్తుతం మతతత్వ శక్తులు, ముఖ్యంగా సంఫ్‌ు పరివార్, ప్రజలను మతపరంగా విభజించడం ద్వారా మత సామరస్యానికి భంగం కలిగించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆ ప్రయత్నాలను చైతన్యవంతంగా ఎదుర్కొని దేశ సమైక్యతను కాపాడాలి. మతతత్వంపై పోరాటం కేవలం మతానికి సంబంధించినదే కాదు, సాంస్కృతికంగా, సామాజికంగా, రాజకీయంగా పోరాటం చేయాలి. విశాలమైన శక్తులను కలుపుకోవాలి. పౌర సమాజంలోని ప్రజాసంఘాలు, సాంస్కృతిక సంఘాలు, మేథావులు, విద్యావేత్తలను కలుపుకొంటూ ప్రజా ఉద్యమాలు నిర్మించాలి. విశాల ఐక్యవేదికలు నిర్మించి ప్రజలల్లో చైతన్యం తెస్తూ మతతత్వ శక్తులను ఎదుర్కోవాలి.
ఆర్‌ఎస్‌ఎస్ రాజకీయ రూపంగా జనసంఫ్‌ు పార్టీ ఏర్పాటు చేసినప్పటికీ విజయవంతం కాలేదు. 1970లో ఏర్పడిన బిజెపి 1984 తరువాత మతపరమైన అంశాలతో ఎదగడానికి ప్రయత్నాలు చేసింది. రాజీవ్ గాంధీ అనుసరించిన మెతక వైఖరి విధానాలతో రామశిలాపూజలు నిర్వహించడం, కరసేవకులను రప్పించడం ద్వారా మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టింది. గత మూడు దశాబ్దాలుగా కార్పొరేటీకరణ, మతతత్వ విధానాలు కలసి కొనసాగుతున్నాయి. బిజెపి ప్రాబల్యం పెరగడం, కాంగ్రెస్ క్రమంగా క్షీణిస్తున్న పరిస్థితుల్లో కార్పొరేట్ సంస్థలు, కార్పొరేట్ మీడియా, నరేంద్రమోడీ రూపంలో కొత్తనాయకుడ్ని ముందుకు తెచ్చాయి. 2014 ఎన్నికల్లో బిజెపి నరేంద్రమోడీ నాయకత్వం విజయం సాధించడానికి కారణం ఇదే. గత 8 ఏళ్లలో నరేంద్ర మోడీ కార్పొరేట్ , మతతత్వ విధానాలు అమలు చేస్తూ ప్రజలతో మత పరంగా చీలికలు తెస్తున్నారు. మైనార్టీలపై దళితులపై దాడులు, రామాలయనిర్మాణం, కాశ్మీర్ 370 రద్దు, సిఎఎ వంటి చట్టాలు తేవటం, విద్యారంగ కాషాయికరణ మొదలైనవన్నీ దీనిలో భాగమే. దీనితో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను లాభాలతో నడుస్తున్న వాటిని ప్రైవైటీకరిస్తున్నారు.

అప్రమత్తత అవసరం : ఆచార్య కేతు విశ్వనాధరెడ్డి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, కడప
దేశంలో విద్వేష వాతావరణం పెచ్చరిల్లడం అవాంఛనీయం. బాబ్రీ మసీదు విధ్వంసం నుంచి జ్ఞానవాపి వివాదం, తాజాగా తంజావూరు కులాల గొడవల వరకు చోటుచేసుకున్న ఘటనలు అవాంఛనీయ పరిణామాలని గుర్తుపెట్టుకోవాలి. ఇవి సమాజంలో విచ్ఛిన్నకర, విద్వేష వాతావరణం పెచ్చరిల్లడానికి దారితీశాయని చెప్పవచ్చు. దేశంలో ఇటీవలి కాలంలో ఇటువంటి మత అసహన దోరణులు విస్తరించడం ఆందోళన కలిగిస్తున్నది. అభ్యుదయ మహాకవి గురజాడ అవార్డు ప్రకటన అనంతర పరిణామాలు విస్మయాన్ని కలిగించాయి. ఎటువంటి ఆశయ నిబద్ధత లేని వ్యక్తులకు అవార్డును కేటాయించడం, ఆ అవార్డును స్వీకరించడం వంటి పరిణామాలను సమాజం చవిచూసింది. మహాకవి గురజాడ ఆశయ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ముందుకుపోవాలి. మతాలన్నీ మాసి పోవును.. జ్ఞానమొక్కటే నిలిచి ఉండును అనే సూక్తి ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతుందని గుర్తుంచుకోవాలి. భారతదేశం కూడా భిన్న మతాలు, కులాల, భిన్నసంస్కృతులతో విలసిల్లిందని గ్రహించాలి. ఇటువంటి వైవిధ్యం కలిగిన జాతులు, కులాలు, సంస్కృతుల మధ్య సయోధ్యను చేకూర్చాలి. వాటిని విధ్వంసం చేయడం దుర్మార్గం. దేశంలో ఇటువంటి సంకీర్ణ సంస్కృతి నాశనమయ్యే పరిస్థితి ఉత్పన్నం కావడం అత్యంత ప్రమాదకరమని గుర్తించాలి. ఇటువంటి మత, కుల అసహన ధోరణుల పట్ల పౌర సమాజం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.

దేశానికి చీకటి రోజు : ఇమామ్, 'కదలిక' సంపాదకులు, అనంతపురం
డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీదు కూల్చివేసి లౌకిక రాజ్యాంగంపై దాడి జరిగి దేశానికి చీకటి రోజుగా నిలిచింది. దేశమూలాలపై జరిగిన దాడిగా దీనిని భావిస్తున్నాం. భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న దేశంలో ఒక మతం మరొక మతంపై ఇలా దాడి చేయడం సహించరానిది. సెక్యులరిజాన్ని దెబ్బతీయడమే అవుతుంది. ప్రజాస్వామ్య మూలాలపై జరిగిన దాడి. మోడీ ప్రభుత్వం దేశంలో ప్రమాదకర ధోరణులు, ధ్వంద విధానాలను అనుసరిస్తోంది. మైనార్టీల పట్ల దయాదాక్షిణ్యం లేకుండా వ్యవహరిస్తోంది. ప్రభుత్వంలో ఏకపక్ష పరిపాలన సాగుతోంది. దేశాన్ని అక్బర్ 100 సంవత్సరాలు పరిపాలించారు. ఔరంగజేబు పరిపాలననూ విన్నాం. వారు సర్వమతాలనూ గౌరవించారు. దేశంలో ముస్లిం, క్రిస్టియన్‌లు, హిందూవులు, సిక్కులు అన్నదమ్ములుగా జీవిస్తున్నారు. సంకుచిత ఆలోచనలతో ఉన్న పాలకులు చేసే రాజ్యాంగ వ్యతిరేక విధానాలను సమిష్టిగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది.










