- మూడేళ్లుగా రూ.200 కోట్లకు బ్రేక్
- రాష్ట్రంలో 84,469 క్లయిములకు అందని పరిహారం
- ఉమ్మడి కడప జిల్లాలో రూ.10.19 కోట్లు పెండింగ్
ప్రజాశక్తి- కడప ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం పశుబీమా పథకాన్ని పడకెక్కించింది. 2020 మార్చి నుంచి బీమా పరిహారాన్ని చెల్లించడం లేదు. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో 84,469 పశువులకు సంబంధించి రూ.200.05 కోట్ల బకాయి ఉన్నాయి. క్లెయిములను పరిష్కరించాలని కోరుతూ పశుపోషకులు, రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం ఉండడం లేదు. దీంతో, వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పశువుల బీమా పరిహారాన్ని చెల్లించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, రైలు, రోడ్డు, ఇతర ప్రమాదాలు, లంపీస్కిన్ వంటి వ్యాధులు, సర్జరీల కారణంగా వేలాది పశువులు మరణిస్తున్నాయి. ఇటువంటి ఉపద్రవాల కారణంగా ఏటా పశుపోషకులకు, రైతులకు కోలుకోలేని దెబ్బ తగులుతోంది. ఈ దృష్ట్యా వారిని ఆదుకొనేందుకు ప్రవేశపెట్టిన పశుబీమా పథకానికి వైసిపి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. మూడేళ్ల నుంచి పశుబీమా పరిహారం చెల్లించడం లేదు. ఈ పథకాన్ని నిలిపివేసినట్లు ప్రచారం జరుగుతుండడంతో క్లెయిముదారులు ఆందోళన చెందుతున్నారు
ఉమ్మడి కడప జిల్లాలో 2020 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ 5,300 పశువులు మృతి చెందాయి. వీటికి సంబంధించి పశు బీమా పరిహారం కోసం రైతులు, పశుపోషకులు క్లెయిం చేశారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించిన తర్వాతే క్లెయిములకు ఆమోదం తెలుపుతున్నారు. వీటిలో 52 దరఖాస్తులను తిరస్కరించారు. 875 పశువులకు సంబంధించి పరిహారం చెల్లించారు. 4,373 పశువులకు సంబంధించి 10.19 కోట్ల రూపాయలు పరిహారం బకాయి ఉంది. జిల్లా పశుసంవర్థక శాఖ కార్యాలయం చుట్టూ క్లెయిముదారులు ప్రదక్షిణలు చేస్తోన్నా ఫలితం ఉండడం లేదు. పశువుల బీమా చెల్లింపుల నిలిపివేతపై ఇటీవల జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున గళమెత్తినా అధికారుల్లో స్పందన లేదు. ఉమ్మడి కడప జిల్లాలో 2020 నాల్గో త్రైమాసికంలో 875 పశువుల క్లెయిములకు సంబంధించి రూ.2.47 కోట్ల పరిహారం చెల్లింపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపి జిల్లా పశుసంవర్థక శాఖ ట్రెజరీ శాఖకు పంపిం చింది. ట్రెజరీలో ఆ మేరకు డబ్బులు లేకపోవడం, సాంకేతిక కారణాల వల్ల చెల్లింపులు జరగలేదు. ఇది ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడం గమనార్హం.
త్వరలో చెల్లిస్తాం
పశువుల బీమా చెల్లింపులో ఆలస్యం మాట వాస్తవమే. వీటి క్లెయిములకు సంబంధించి రూ.2.47 కోట్లు ట్రెజరీకి పంపించాం. మిగిలిన రైతులకు త్వరలోనే పూర్తి స్థాయిలో చెల్లింపులు చేస్తాం
- సి.శారదమ్మ, జిల్లా పశుసంవర్థక శాఖాధికారి, కడప










