May 20,2023 09:44

పేదరికం, అత్తింటి వేధింపులు, భర్త హింస ఉంటే ఏ మహిళైనా కుంగిపోతుంది. కాని సవితా ప్రధాన్‌ మాత్రం వాటిని అధిగమించి చదువుకున్నారు. ఇద్దరు పిల్లల్ని పోషిస్తూనే ఉద్యోగ పోటీ పరీక్షలు రాశారు. ఉన్నత స్థాయిలో ఉద్యోగం సంపాదించాలన్న సంకల్పంతో ఎదురైన ప్రతి సవాలునూ ఎదుర్కొన్నారు. చివరికి సాధించారు. ఇప్పుడు మధ్యప్రదేశ్‌ అర్బన్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో జాయింట్‌ డైరెక్టర్‌గా పదోన్నతి సాధించి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. తనలాగా ఎవరూ వేధింపులకు గురి కాకూడదని మహిళల కోసం ఓ ఛానెల్‌ నడుపుతూ చైతన్య పరుస్తున్నారు.

11

          మధ్యప్రదేశ్‌లో మండై గ్రామానికి చెందిన సవితా పేద కుటుంబంలో పుట్టింది. ఐదుగురు సంతానంలో ఆమె ఒకరు. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లేవారు. దగ్గర్లో ఉన్న అడవిలోకి వెళ్లి టెండు ఆకులు, మహువ పూలు సేకరించి అమ్మేవారు. సవితాకు చిన్నప్పటి నుంచి చదువు అంటే ఇష్టం. కాని పాఠశాలకు పంపే స్థోమత తమకు లేదంటూ తల్లిదండ్రులు పంపేవారు కాదు. చదువుకుంటే రూ. 75 స్కాలర్‌షిప్‌ వస్తుందని, దాంతో కావాల్సిన పుస్తకాలు కొనుక్కుంటా అని గొడవపడి మరీ పాఠశాలకు వెళ్లింది. ఒక యూనిఫాం ఒంటి మీద ఉంటే మరో యూనిఫాం ఉతుక్కునేది. ఇంట్లో రోజూ పొందే దలియా (గంజి) చేసేవారు. ఒక్కోసారి అది ఉండేది కాదు. అయినా స్కూలుకు మాత్రం మానకుండా వెళ్లేది. ఆ తర్వాత 7 కి.మీ. దూరంలో పల్హేరాలో ఉన్న ఉన్నత పాఠశాలకు వెళ్లి చదువుకుంది. రోజూ నడిచి వెళ్లి రావడం కష్టమవుతున్నా సవితా మాత్రం చదువు ఆపలేదు. ఆమె పట్టుదల చూసి కుటుంబమే ఆ ఊరికి మకాం మార్చింది. 22 మంది అబ్బాయిలున్న తన క్లాసులో ఇద్దరే అమ్మాయిలు. అయినా ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా స్కూలుకు వెళ్లింది. అలా ఆ ఊరిలోనే పదవ తరగతి చదివిన మొదటి అమ్మాయిగా పేరు తెచ్చుకుంది.

                                                                    వేధింపులు తట్టుకోలేక

పై చదువులు చదివించే స్థోమత లేక తల్లిదండ్రులు సవితకు భోపాల్‌కు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. అతను ఆమె కన్నా 11 ఏళ్లు పెద్దవాడు. పెళ్లయిన తర్వాత ఆమె జీవితం నరకప్రాయంగా మారింది. అత్తమామలు ఆమెను పనిమనిషిలా మార్చారు. సరిగ్గా తిండి పెట్టేవారు కాదు. ఆకలి తట్టుకోలేక చపాతీలు బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లి తిన్న సందర్భాలూ ఉన్నాయి. మాట్లాడినా, నవ్వినా తిట్టేవారు. ఆమెను టీవీ చూడకుండా బంధించేవారు. బాధలు తట్టుకోలేక చనిపోదాం అనుకుంది. వెంట వెంటనే ఇద్దరు మగ పిల్లలు పుట్టారు. దాంతో ఆత్మహత్య ప్రయత్నాలు మానుకుంది. భర్త పిల్లల్నీ హింసించడంతో చివరకు తట్టుకోలేక వారిని తీసుకుని పుట్టింటికి వచ్చింది.

22


                                                                        పని చేస్తూ...చదువు

తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు సవితకు మద్దతుగా నిలిచారు. వారి సహకారంతో మళ్లీ చదువు కొనసాగించింది. డిగ్రీలో చేరింది. ఇంటి దగ్గర చిన్నపిల్లలకు ట్యూషన్‌ చెబుతూ, బ్యూటీపార్లర్లో పని చేస్తూ తన పిల్లల్ని పోషించింది. అప్పుడు రాష్ట్ర సివిల్‌ సర్వీసెస్‌ గురించి తెలిసి ఆ వైపుగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. దానికి సంబంధించిన మెటీరియల్‌, జనరల్‌నాలెడ్జీ బుక్స్‌ తెచ్చుకుని ఇంట్లోనే చదువుకున్నారు. ఆమె ఎదుగుదల తట్టుకోలేక అత్తింటి వారు వచ్చి దాడి చేశారు. అయినా సవితా తట్టుకుని నిలబడ్డారు. ఎన్నో ఇబ్బందులు పెట్టిన భర్త నుంచి విడాకులు తీసుకొంది. అప్పుడు సవితాను చుట్టూ ఉన్నవారు రకరకాలుగా మాటలు అన్నారు. 'ఇద్దరు పిల్లలు ఉన్నా... భర్తను వదిలేస్తున్నావా?' అని అడిగి ఇబ్బంది పెట్టేవారు. అవేమీ ఆమె పట్టించుకోలేదు. చదువు మీద దృష్టికేంద్రీకరించారు. దాంతో 24 ఏళ్ల వయస్సులో చీఫ్‌ మున్సిపల్‌ అధికారిగా బాధ్యతలు చేపట్టింది. 2021లో ఖాండ్వా మున్సిపల్‌ కార్పొరేషన్‌కి తొలి మహిళా కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు ప్రస్తుతం పట్టణ పరిపాలన విభాగంలో రాష్ట్ర మొదటి మహిళా జెడిగా బాధ్యతలు తీసుకుని ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. అత్తింటి వేధింపులకు గురవుతున్న మహిళల కోసం ఏకంగా 'హిమ్మత్‌ వాలీ లడ్కియాన్‌' (బ్రేవ్‌ గర్ల్స్‌) అనే యూట్యూబ్‌ ఛానెల్‌ని నడుపుతున్నారు. వారికి అవసరమైన సలహాలు, సూచనలు చేస్తూ అండగా నిలుస్తున్నారు.