
ఏ విధమైన ముందస్తు అనుమతి అవసరం లేదనేది పిటిషనర్ల వాదన. ఎఫ్‌ఐఆర్ ను నమోదు చేయకపోతే, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని 156(3) సెక్షన్ కింద విచారణ చేయాలని మేజిస్ట్రేట్ ఆదేశించే అధికారం ఉంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని 156(3) సెక్షన్ కింద దరఖాస్తు సమర్పించేందుకు అదే కోడ్ లోని సెక్షన్ 196 ప్రకారం అధికారుల నుంచి ఎటువంటి అనుమతి అవసరం లేదనేది పిటిషనర్ల వాదన. కేవలం ప్రివెన్షన్ ఆఫ్ క్రిమినల్ యాక్ట్ చేర్చిన కేసుల విషయంలో మాత్రమే ముందస్తు అనుమతి అవసరమని తెలిపే సుప్రీంకోర్టు తీర్పులను పిటిషనర్లు ఉదహరించారు.
కొద్ది వారాల క్రితం మహమ్మద్ ప్రవక్త గురించి జాతీయ దూరదర్శన్‌లో భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. మరో సందర్భంలో ఢిల్లీ హైకోర్టు అదే పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య నాయకులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి అనుమతి నిరాకరిస్తూ ఇటీవల ఉత్తర్వులను జారీ చేసింది.
సౌభ్రాతృత్వానికి వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రసంగాలు చేసి...రాజ్యాంగ నిబంధనలను, రాజ్యాంగం లోని 14, 15, 19, 21, 38 ఆర్టికళ్లను ఉల్లంఘిస్తూ, రాజ్యాంగం లోని ఆర్టికల్ 51ఏ కింద ఉన్న ప్రాథమిక విధులను కించపరిస్తే...కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తిరుగులేని చర్యలు తీసుకునే అధికారం ఉంటుందని జూన్ 13న ఢిల్లీ హైకోర్టులో జస్టిస్ చంద్రధరి బెంచ్ వ్యాఖ్యానించింది.
జనవరి 2020లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న సమయంలో కేంద్ర మంత్రి, బిజెపి ఎంపీలు చేసిన విద్వేషపూరిత ప్రసంగాలపై దాఖలైన పిటిషన్లపై న్యాయమూర్తి తీర్పు చెప్పారు. పిటిషన్లు దాఖలు చేసిన వారిలో భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) మాజీ ఎం.పి బృందా కరత్, ఆ పార్టీ ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి ఉన్నారు. ఇంతకు ముందే వారి పిటిషన్‌ను 2020 ఆగస్ట్ 26న అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ (ఎసిఎంఎం) కొట్టివేయడం వల్ల వారు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు నుండి మార్గదర్శకాలను కోరుతూ దాఖలైన ఇతర పిటిషన్లు కూడా ఉన్నాయి. కానీ పిటిషన్లతో విభేదించకుండానే న్యాయమూర్తి ఎసిఎంఎం ఉత్తర్వులను సమర్థించారు. ఎఫ్‌ఐఆర్ నమోదు కావాలంటే అధికారుల నుంచి ముందస్తు అనుమతి అవసరమని న్యాయమూర్తి నిర్దేశించారు. భారత శిక్షా స్మృతి లోని 153ఏ, 153బీ, 295ఏ, 505 సెక్షన్ల కింద మతపరంగా నేరాలను ఆరోపించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరమని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 196 తెలియజేస్తుంది.
ఇక్కడ ఉదహరించబడిన ప్రసంగాలు సామాజిక, ఎలక్ట్రానిక్ మాధ్యమాలతో పాటు ప్రింట్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రసారమయ్యాయి. ''దేశంలోని కుట్రదారులను కుక్కలను కాల్చినట్లుగా కాల్చి సమాధానం చెప్పండని'' కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ భారీ బహిరంగ సభలో నినదించాడు. ఇది ఫిబ్రవరి 2020 లో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు చోటు చేసుకుంది. పశ్చిమ ఢిల్లీకి చెందిన బిజెపి ఎం.పి పర్వేశ్ వర్మ ఆ మరుసటి రోజు ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి, షాహీన్ బాగ్ నిరసనకారులను పోలీస్ ఫోర్స్‌తో వెళ్ళగొట్టిస్తామని ఒక న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బెదిరించాడని పిటిషనర్లు ఆరోపించారు. జాతీయ సమగ్రతకు భంగం కలిగించే ప్రకటనలు, బెదిరింపులు, మతపరమైన శత్రుత్వాన్ని ప్రేరేపిస్తున్న ఇద్దరు నాయకులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పిటిషనర్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను కోరారు. ఆ ఇద్దరు నాయకుల రెచ్చగొట్టే ప్రసంగాల తరువాత జరిగిన ఓ సంఘటన విషయంలో కూడా వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని 2020 జనవరి 31న పిటిషనర్లు ఢిల్లీ పోలీసులను కలిశారు. హిందూసేనకు చెందిన సభ్యునిగా భావించబడిన ఒక వ్యక్తి...నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై కాల్పులు జరిపాడు.
ఫిబ్రవరి 2వ తేదీన, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను పిటిషనర్లు కలిశారు. పలుమార్లు కలిసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరినప్పటికీ, ఢిల్లీ పోలీస్ ఎటువంటి చర్యలు తీసుకోని సందర్భంలోనే పిటిషనర్లు ఫిబ్రవరి 5వ తేదీన ఎసిఎంఎం ను కలిసి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 156(3) కింద, భారత శిక్షా స్మృతి లోని 153ఏ, 153బీ, 295ఏ, 298, 504, 505, 506 సెక్షన్ల కింద నేరాలు మోపుతూ ఒక దరఖాస్తును అందజేశారు. న్యూఢిల్లీ జిల్లా డిప్యూటీ పోలీస్ కమీషనర్ నుండి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ఎటిఆర్)ను అందజేయాలని పిటిషనర్లు కోరారు.
క్రైం బ్రాంచ్ కు చెందిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ వారు 2020 ఫిబ్రవరి 11న ఒక ఎటిఆర్ ను అందజేశారు. దాని తరువాత ఫిబ్రవరి 26న ఒక నివేదిక 'ప్రాథమికంగా ఏర్పడిన అభిప్రాయం ఆధారంగా' గుర్తించదగిన ఎటువంటి నేరం జరగలేదని తెలియజేసింది. 'గద్దర్' అనే పదం ఒక ప్రత్యేకమైన మతాన్ని ఉద్దేశించి ఉపయోగిందలేదు కాబట్టి అది నేరం కాదనీ, ఆ ప్రసంగాలకు, ఆ తరువాత జరిగిన హింసకు ఎటువంటి సంబంధం లేదని ఆ నివేదిక తెలిపింది. ఫిబ్రవరి 23-29 మధ్య కాలంలో జరిగిన అల్లర్లలో 53 మంది (వారిలో ఎక్కువ మంది ముస్లింలు) ప్రాణాలు కోల్పోయారు. ఫిర్యాదుదారులు సంబంధిత అధికారుల నుంచి ఆమోదం పొందలేదన్న కారణంతో ఆగస్ట్ 26న, ఎసిఎంఎం కార్యాలయం వారి అప్లికేషన్‌ను కొట్టివేసింది.
ముందస్తు తీర్పు
ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో, డిసెంబర్ 2020లో (అమీష్ దేవగన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా) సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో, ''ప్రభావవంతమైన వ్యక్తి, ప్రభుత్వ అధికారి, అనుచరగణం ఉన్న రాజకీయ నాయకుడు చేసే ద్వేషపూరిత ప్రసంగం సాధారణ వ్యక్తి చేసే ద్వేషపూరిత ప్రసంగం కంటే ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందని'' పిటిషనర్లు ఉదాహరించారు. ద్వేషపూరిత ఉద్దేశం అనేది ప్రసంగం చేస్తున్న సందర్భాన్ని బట్టి, ఉపన్యాసకుని గుర్తింపు, ప్రసంగం చేస్తున్న పరిస్థితులను బట్టి ఉంటుంది. దీనిపై ఆధారపడి, సూఫీ విశ్వాసకుడైన ఖ్వాజా మోయినుద్దీన్ ఛిస్తీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ అమీష్ దేవగన్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయడానికి సుప్రీంకోర్టు తిరస్కరించింది.
ప్రస్తుత సందర్భంలో కూడా, ఎన్నికల సమయంలో ఒక మతానికి వ్యతిరేకంగా ద్వేషపూరిత ప్రసంగాలు చేశారని పిటిషనర్లు పేర్కొన్నారు. ఒక మతానికి చెందిన వ్యక్తులను ఉద్దేశించే ఆ ద్వేషపూరిత ప్రసంగాలు చేశారు. దానితోపాటు ఈ సందర్భంగా మాట్లాడిన మాటలు కూడా ద్వేషపూరితంగా ఉన్నాయి. కాబట్టి, పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఉండాల్సిందని పిటిషనర్ల వాదన.
ఏ విధమైన ముందస్తు అనుమతి అవసరం లేదనేది పిటిషనర్ల వాదన. ఎఫ్‌ఐఆర్ ను నమోదు చేయకపోతే, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని 156(3) సెక్షన్ కింద విచారణ చేయాలని మేజిస్ట్రేట్ ఆదేశించే అధికారం ఉంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని 156(3) సెక్షన్ కింద దరఖాస్తు సమర్పించేందుకు అదే కోడ్ లోని సెక్షన్ 196 ప్రకారం అధికారుల నుంచి ఎటువంటి అనుమతి అవసరం లేదని పిటిషనర్ల వాదన. కేవలం ప్రివెన్షన్ ఆఫ్ క్రిమినల్ యాక్ట్ చేర్చిన కేసుల విషయంలో మాత్రమే ముందస్తు అనుమతి అవసరమని తెలిపే సుప్రీంకోర్టు తీర్పులను పిటిషనర్లు ఉదహరించారు.
ద్వేషపూరిత ప్రసంగాలతో పాటు కొన్ని నేరాలకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంటుంది. లేకుంటే చట్టాలను తయారు చేసే అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు చట్టాల్లో చిక్కుకొని పోతారు. ప్రస్తుత వ్యాజ్యంలో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేరారోపణలు చేయడానికి ముందస్తు అనుమతి అవసరమని చెప్పే క్రమంలో, చార్జ్‌షీట్ దాఖలైన తరువాత కోర్టు దానిని పరిగణలోకి తీసుకున్న తర్వాత మాత్రమే అనుమతి అవసరమని పిటిషనర్లు చేసిన విన్నపాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 156(3) కింద విచారణ చేయడానికి మార్గదర్శకాలు ఇవ్వడానికి ఏ అనుమతి అవసరం లేదు
అయినా, వాస్తవం ఏమిటంటే కమెడియన్లు, జర్నలిస్ట్‌లు, ఫిల్మ్ మేకర్లపై కోర్టు ఉదహరించిన సెక్షన్లన్నీ మోపారు. ఎఫ్‌ఐఆర్ లు నమోదు చేశారు. 'షిల్లాంగ్ టైమ్స్' ఎడిటర్ పత్రీసియా ముఖిమ్ అనే మహిళ గిరిజనేతర యువకులపై దాడి చేసిన గిరిజన యువకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 2020 జులైలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మత సామరస్యానికి విఘాతం కలిగించే విధంగా పోస్ట్ పెట్టారనే నెపంతో సెక్షన్ 153ఏ కింద ఆమెను నిర్బంధంలోకి తీసుకున్నారు. ఈ సంఘటనతో సుప్రీంకోర్టు ఎఫ్‌ఐఆర్ న్యాయసమ్మతం కాదని కొట్టివేసింది.
పిటిషనర్లు, స్టేషన్ హౌస్ అధికారిని కాక పోలీసు కమిషనర్‌ను కలవడాన్ని బెంచ్ తప్పు పట్టింది. వారి పిటిషన్‌ను అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ డిస్మిస్ చేసిన తరువాత వారు రివిజనల్ కోర్టును ఆశ్రయించాల్సిందని బెంచ్ అభిప్రాయపడింది.
హేతుబద్ధత ఏదీ?
పేరు చెప్పేందుకు ఇష్టంలేని ఒక క్రిమినల్ న్యాయవాది ''ఫ్రంట్‌లైన్''తో మాట్లాడుతూ, పిటిషనర్లు వారి ఆలోచన ప్రకారం సరైన విధంగానే ఉన్నారని ఆయన అన్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదైన తరువాతనే పోలీసులు ఛార్జిషీట్ తయారు చేస్తారని ఆయన అన్నారు. అనుమతి ఈ దశలో మాత్రమే అవసరం. నేరం జరిగిందని కోర్టుకు చెప్పడాన్ని ఎవరూ అడ్డుకోలేరని, ఎఫ్‌ఐఆర్ నమోదు కావాల్సిన అవసరం ఉంటుందని ఆయన చెప్పారు. ఇది గుర్తించబడిన నేరాన్ని పరిగణలోకి తీసుకునే విధానం.
అల్లర్లు జరగడానికి ముందు ప్రముఖ బిజెపి నాయకుల రెచ్చగొట్టే ప్రసంగాలకు వ్యతిరేకంగా ఎఫ్‌ఐఆర్ లను నమోదు చేయాలని కోరుతూ చేసిన విన్నపాలను పరిష్కరించాలని సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టును రెండు సార్లు (2020లో, 2021 డిసెంబర్‌లో) ఆదేశించింది. ఆ కేసులో పిటిషన్‌దారులంతా ఆ హింసలో బాధితులే. జస్టిస్ ఎస్.మురళీధర్, జస్టిస్ తల్వంత్ సింగ్ నాయకత్వం లోని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆ ప్రసంగాల వీడియోలు వీక్షించిన తరువాత రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన కపిల్ మిశ్రా, అనురాగ్ ఠాకూర్, పర్వేశ్ వర్మలకు వ్యతిరేకంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. కానీ ఆ పని జరగలేదు. ఆ మరుసటి రోజే జస్టిస్ మురళీధర్ ను పంజాబ్ మరియు హర్యానా హైకోర్టుకు బదిలీ చేశారు.
టి.కె. రాజాలక్ష్మి (''ఫ్రంట్ లైన్'' సౌజన్యంతో)