Aug 19,2023 21:46
  • నేడు స్పెయిన్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఫైనల్‌ పోరు
  • మధ్యాహ్నం 3.30గం||ల నుంచి

సిడ్నీ: ఫిఫా మహిళల ప్రపంచకప్‌ చివరి దశకు చేరుకుంది. స్పెయిన్‌, ఇంగ్లండ్‌ మహిళల జట్లు తొలిసారి టైటిల్‌ను చేజిక్కించుకునేందుకు ఆదివారం జరిగే ఫైనల్లో తలపడనున్నాయి. ఈ రెండు జట్లు ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి కావడంతో ఇరుజట్లు టైటిల్‌కై తీవ్రంగా పోటీపడనున్నాయి. ఇక స్పెయిన్‌ జట్టు ఫిఫా ప్రపంచ ర్యాంకింగ్స్‌ లో 6వ స్థానంలో ఉండగా.. గ్రూప్‌-సిలో అగ్రస్థానంలో నిలిచి స్పెయిన్‌ నాకౌట్‌కు చేరింది. నాకౌట్‌లో స్విట్జర్లాండ్‌, నెదర్లాండ్స్‌ను పెనాల్టీ షూటౌట్‌లలో ఓడించి సెమీస్‌కు చేరింది. ఈ క్రమంలోనే సెమీస్‌లోనూ పటిష్ట స్వీడన్‌కు ఝలక్‌ ఇచ్చి తొలిసారి ఫైనల్లోకి ప్రవేశించింది. స్పెయిన్‌ జట్టు టోర్నమెంట్‌లో ఇప్పటివరకు 17గోల్స్‌ నమోదు చేసింది. బోన్మతి, జెన్నీఫర్‌, అల్బా రెడోండో మూడేసి గోల్స్‌తో ప్రథమస్థానంలో ఉన్నారు. ఇక ఇంగ్లండ్‌ జట్టు ఫిఫా ర్యాంకింగ్స్‌లో 4వ స్థానంలో ఉంది. ఆ జట్టు గ్రూప్‌-డిలో టాపర్‌గా నిలిచింది. గ్రూప్‌ దశలో హైతీ, డెన్మార్క్‌, చైనాలను చిత్తుచేసింది. ప్రి క్వార్టర్స్‌లో నైజీరియాపై షూట్‌ ఆఫ్‌లో, క్వార్టర్స్‌లో కొలంబియాను ఓడించి సెమీస్‌కు చేరింది. అదే ఊపులో సెమీస్‌లో ఏకంగా ఆతిథ్య ఆస్ట్రేలియాను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకొచ్చింది. ఇరుజట్లు ఇప్పటివరకు 16సార్లు ముఖాముఖి తలపడగా.. ఇంగ్లండ్‌ 7, స్పెయిన్‌ 3మ్యాచుల్లో గెలిచింది. మరో ఆరు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.

స్వీడన్‌కు కాంస్యం

22

ఫిఫా మహిళల ప్రపంచ కప్‌ కాంస్య పతకాన్ని స్వీడన్‌ జట్టు మరోసారి చేజిక్కించుకుంది. శనివారం 3వ స్థానానికి జరిగిన పోటీలో స్వీడన్‌ జట్టు 2-0గోల్స్‌ తేడాతో ఆతిథ్య ఆస్ట్రేలియాను చిత్తుచేసింది. మహిళల ప్రపంచ కప్‌ చరిత్రలో తొలిసారి సెమీస్‌కు చేరిన ఆసీస్‌ జట్టు కాంస్య పతక పోటీలో తడబడింది. మ్యాచ్‌ ప్రారంభమైన తొలి రెండు నిమిషాల్లోనే గోల్‌చేసే అద్భుత అవకాశాన్ని కోల్పోయిన స్వీడన్‌ జట్టు మ్యాచ్‌ పూర్తయ్యేవరకు తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. దాంతో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. స్వీడన్‌కు ఇది నాలుగో కాంస్య పతకం కావడం విశేషం. బ్రిస్బేన్‌లోని లాంగ్‌ పార్క్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో స్వీడన్‌ జోరు కొనసాగించింది. 28వ నిమిషంలో ఆ జట్టుకు పెనాల్టీ లభించింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్న ఫ్రిడోలినా రాల్ఫో గోల్‌ కొట్టింది. ఆ తర్వాత కెప్టెన్‌ కొసొవరె అస్లానీ 60వ నిమిషంలో గోల్‌ కొట్టి ఆధిక్యాన్ని 2-0కు పెంచింది.