Oct 13,2023 21:03

ఎనిమిదో మాసంలోనూ పతనం
న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన ఎగుమతులూ వరుసగా పతనం అవుతున్నాయి. ప్రపంచ మార్కెట్‌లో భారత సరుకులకు డిమాండ్‌ పడిపోవడం, పోటీపడలేక వరుసగా ఎనిమిదో మాసంలోనూ క్షీణించాయి. మరోవైపు ఎగుమతుల కంటే దిగుమతులు అధికంగా ఉండటంతో భారత వాణిజ్య లోటు పెరిగింది. ప్రస్తుత ఏడాది సెప్టెంబర్‌లో భారత ఎగుమతులు 2.6 శాతం కోల్పోయి 34.47 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయని శుక్రవారం వాణిజ్య మంత్రిత్వ శాఖ గణంకాలు వెల్లడించింది. గతేడాది ఇదే మాసంలో 35.39 బిలియన్ల ఎగుమతులు జరిగాయి. గడిచిన నెలలో దిగుమతులు 15 శాతం తగ్గి 53.84 బిలియన్‌ డాలర్లుగా చోటు చేసుకున్నాయి. ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉండటంతో దేశ వాణిజ్య లోటు 19.37 బిలియన్‌ డాలర్లుగా చోటు చేసుకుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ కాలంలో భారత సరుకుల ఎగుమతులు 8.77 శాతం క్షీణించి 211.4 బిలియన్లకు తగ్గగా.. అదే సమయంలో దిగుమతులు 12.23 శాతం తగ్గి 326.98 బిలియన్లుగా చోటు చేసుకున్నాయి. గడిచిన నెలలో రత్నాలు, అభరణాలు, రసాయనాలు, ఇంజనీరింగ్‌ గూడ్స్‌, రెడీమేడ్‌ గార్మెంట్స్‌ ఉత్పత్తులకు డిమాండ్‌ సన్నగిల్లింది. ప్రపంచ దేశాల ఉత్పత్తులతో పోటీ పడలేకపోవడం, గ్లోబల్‌ డిమాండ్‌లోనూ స్తబ్దత నేపథ్యంలో భారత ఎగుమతులు తగ్గిపోతున్నాయని పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు.