Feb 15,2023 20:36

న్యూఢిల్లీ : భారత ఉత్పత్తులకు విదేశాల్లో గిరాకీ తగ్గిపోతోంది. మరోవైపు ప్రపంచ దేశాల ఉత్పత్తులతో పోటీ పడలేకపోవడం, గ్లోబల్‌ డిమాండ్‌లోనూ స్తబ్దత నేపథ్యంలో ప్రస్తుత ఏడాది జనవరిలో దేశ ఎగుమతులు 6.58 శాతం పతనమై 32.91 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. దిగుమతులు 3.63 శాతం తగ్గి 50.66 బిలియన్‌ డాలర్లుగా చోటు చేసుకున్నాయి. దీంతో దేశ వాణిజ్య లోటు 17.75 బిలియన్‌ డాలర్లకు ఎగిసి.. 12 మాసాల గరిష్ట స్థాయికి చేరింది. 2022 జనవరిలో వాణిజ్య లోటు 17.42 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022ా23)లో ఏప్రిల్‌ నుంచి జనవరి కాలంలో భారత సరుకు ఎగుమతులు 8.51 శాతం పెరిగి 369.25 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో దిగుమతులు ఏకంగా 21.89 శాతం ఎగిసి 602.20 బిలియన్‌ డాలర్లకు చేరాయి. దీంతో గడిచిన పది మాసాల్లో దేశ వాణిజ్య లోటు 233 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. 2022 డిసెంబర్‌లో ఎగుమతులు 12.2 శాతం తగ్గి 34.48 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.
గడిచిన పది మాసాల్లో ముఖ్యంగా ఇంజనీరింగ్‌, ముడి ఇనుప ఖనిజం, ప్లాస్టిక్‌, లినోలియమ్‌, రత్నాలు, అభరణాల ఎగుమతుల్లో ప్రతికూల వృద్థి చోటు చేసుకుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. గడిచిన ఏప్రిల్‌ా జనవరి కాలంలో బంగారం దిగుమతులు 11.26 శాతం తగ్గి 29 బిలియన్‌ డాలర్లుగా చోటు చేసుకున్నాయి. ఇంతక్రితం ఏడాది ఇదే కాలంలో పసిడి దిగుమతులు 40.35 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.