- బెంగళూరు, చెన్నయ్, హైదరాబాద్ సర్వీసుల్లో సర్దుబాటు
బెంగళూరు : విమానయాన రంగంలో డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని తమ పలు సేవల్లో సర్దుబాట్లు చేస్తున్నట్లు సింగపూర్ ఎయిర్‌లైన్స్ (ఎస్‌ఐఎ) గ్రూప్ వెల్లడించింది. ఎస్‌ఐఎ, స్కూట్ తమ సామర్థ్యం, నెట్‌వర్క్ మార్పుల్లో భాగంగా బెంగళూరు, చెన్నయ్, హైదరాబాద్ సేవలను పునర్నిర్మిస్తున్నట్లు పేర్కొంది. పౌర విమానయాన నియంత్రణ సంస్థ ఆమోదాలకు లోబడి మార్పులు చేసినట్లు తెలిపింది. 2023 నవంబర్ 5 నుండి సింగపూర్ - చెన్నయ్ మధ్య రోజువారీ సేవలను స్కూట్ ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. ఫలితంగా సింగపూర్, చెన్నయ్ మధ్య ఎస్‌ఐఎ గ్రూప్ కార్యకలాపాలు వారానికి 17 సార్ల నుండి వారానికి 21 సార్ల వరకు పెరుగుతాయని తెలిపింది. 2023 అక్టోబర్ 29 నుండి సింగపూర్, హైదరాబాద్ మధ్య స్కూట్ రోజువారీ సేవలను అందుబాటులోకి తేనుందని.. రెండు నగరాల మధ్య రాకపోకలను వారానికి ఏడు సార్ల నుండి 12 సార్లకు క్రమంగా పెంచనుందని వెల్లడించింది.










