Jan 01,2023 09:03
  • రూ.2,162 కోట్లతో సా..గుతున్న వైనం
  • 82 వేల ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకం

ప్రజాశక్తి - కడప ప్రతినిధి : గాలేరు-నగరి సుజల స్రవంతి (జిఎన్‌ఎస్‌ఎస్‌) కాలువ విస్తరణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ఈ కాలువ ద్వారా కడప, అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు జిల్లాలోని 3.05 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించవచ్చు. కర్నూలు జిల్లా అవుకు నుంచి ప్రారంభమైన ఈ కాలువ నెల్లూరు జిల్లా వరకు మొత్తం 119 కిలోమీటర్లు. ప్రతి ఏటా వర్షాకాలంలో 19 నుంచి 26 రోజుల పాటు కృష్ణా నదికి పోటెత్తే వరద నీటిని సద్వినియోగం చేసుకునేందుకు ఈ కాల్వను నాలుగు వేల క్యూసెక్కుల నుంచి ఆరువేల క్యూసెక్కులకు విస్తరించాలనేదే ముఖ్య ఉద్దేశం.
           జిఎన్‌ఎస్‌ఎస్‌ కెనాల్‌- హంద్రీ-నీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌) కెనాల్‌ లిఫ్టు స్కీమ్‌ ద్వారా అనుసంధాన ప్రతిపాదన నేపథ్యంలో ప్రధాన కాల్వ విస్తరణ పనులకు 2019లో అప్పటి టిడిపి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కాల్వ విస్తరణతో జిఎన్‌ఎస్‌ఎస్‌ కెనాల్‌లో అంతర్భాగమైన గండికోట రిజర్వాయర్‌ను 25.85 టిఎంసిలతో సకాలంలో నింపవచ్చు. 0-119 కిలోమీటర్ల వరకు పనులు చేపట్టేందుకు గత టిడిపి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఎన్నికల అనంతరం వైసిపి అధికారంలోకి రావడంతో రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో 25 శాతం పూర్తి చేయని టెండర్లను రద్దు చేసింది.
2023 ఆగస్టు నాటికి పనులను పూర్తి చేయాలని 2021లో రూ.2,162 కోట్లతో వైసిపి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఫేజ్‌-1 కేటగిరీలోని ప్యాకేజీ-1 కింద 0 కి.మీ నుంచి 34 కి.మీ పనులను రూ.175 కోట్ల కాంట్రాక్టును ఎస్‌ఎల్‌ఆర్‌ కంపెనీ దక్కించుకుంది. 32 కి.మీ పరిధిలో 40 శాతం పనులను మాత్రమే పూర్తి చేసింది. ప్యాకేజీ-2 కింద 34 కి.మీ నుంచి 56 కి.మీ వరకు రూ.130 కోట్లతో కూడిన పనులను పిఎల్‌ఆర్‌ కాంట్రాక్టు సంస్థ దక్కించుకుంది. 60 శాతం మాత్రమే పనులను పూర్తి చేసింది. కీలకమైన 41.55 కి.మీ వద్ద 1100 మీటర్ల మొగమేరు అక్విడెక్ట్‌ ప్రతిపాదనలు ఫైనాన్స్‌ డిపార్టుమెంట్‌లో పెండింగ్‌లో ఉన్నాయి. ప్యాకేజీ-1, 2 పనులను సకాలంలో పూర్తి చేస్తే సర్వరాయసాగర్‌, వామికొండ రిజర్వాయర్ల కింద 36 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉంది.
            జిఎన్‌ఎస్‌ఎస్‌ ఫేజ్‌-2 కింద ప్యాకేజీ-1 కింద 34 కి.మీ నుంచి 66 కి.మీ మేర పనులకు రూ.372 కోట్లతో టెండర్లు నిర్వహించింది. ఇందులో 23 స్ట్రక్షర్లు, బ్యాలెన్స్‌ కెనాల్‌ పనులను చేపట్టాల్సి ఉంది. ఈలెక్కన 90 శాతం మేరకు పనులు పూర్తి చేసింది. ప్యాకేజీ-2 కింద 66 కి.మీ నుంచి 96 కి.మీ వరకు రూ.320 కోట్లతో కూడిన టెండర్‌ను ఎంఆర్‌కెఆర్‌ కాంట్రాక్టు సంస్థ దక్కించుకుంది. 10 కి.మీ పరిధిలోని 32 స్ట్రక్షర్లు, ఎర్త్‌వర్క్‌ పనులను మాత్రమే పూర్తి చేసింది. 250 ఎకరాల భూసేకరణ క్లియరెన్స్‌ సెకెండ్‌స్టేజ్‌లో ఉంది. రూ.21.21 కోట్లు చెల్లింపులు చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. దీని కింద 12 వేల ఎకరాల ఆయకట్టు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్యాకేజీ -3 కింద 96 కి.మీ నుంచి 119 కి.మీ వరకు రూ.1165 కోట్ల టెండర్‌ను ఐవిఆర్‌సిఎల్‌ కంపెనీ దక్కించుకుంది. పనుల్లో మందగమనం వంటి కారణాలతో 60(సి) కింద రైసా కంపెనీ పనులను చేపట్టింది. ఈ కాలువ కింద 1072 ఎకరాల భూసేకరణ స్టేజ్‌-2 క్లియరెన్స్‌ దశలో ఉంది. రూ.72 కోట్లను చెల్లింపులు చేయడంలో తాత్సారం చేయడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీని కింద 25 వేల ఎకరాల ఆయకట్టు అందుబాటులోకి రానుంది. వైఎస్‌ఆర్‌ జిల్లాలోని వీరపునాయనిపల్లె, పెండ్లిమర్రి, నందలూరు, రైల్వేకోడూరులో ఫారెస్టు అనుమతులు రావాల్సి ఉంది. ఫారెస్ట్‌ క్లియరెన్స్‌, భూ సేకరణలో జాప్యం వల్ల పనులు సకాలంలో పూర్తి కావడం లేదు.
 

                                                               2023 అక్టోబర్‌లో సాగు నీరందిస్తాం

జిఎన్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కాల్వ విస్తరణ పనులు చురుకుగా సాగుతున్నాయి. 2023 ఏప్రిల్‌ - ఆగస్టు నాటికి ప్యాకేజీల గడువు ముగింపు దశకు చేరనుంది. ఒప్పంద గడువులను పొడిగింపు చేసి 2023 అక్టోబర్‌ నాటికి 20 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందిస్తాం.
                                                                                                     - ఎం.మల్లికార్జునరెడ్డి, ఎస్‌ఇ, జిఎన్‌ఎస్‌ఎస్‌, కడప.