- సాధారణ స్థితికి ప్రవాహం
- కాటన్ బ్యారేజీ వద్ద 10.9, భద్రాచలం వద్ద 29.10 అడుగుల నీటిమట్టం
- పలుచోట్ల ధ్వంసమైన రోడ్లు
- రహదారులపై పేరుకుపోయిన ఒండ్రు
ప్రజాశక్తి- యంత్రాంగం : వారం రోజులుగా ఉగ్రరూపం దాల్చిన గోదా వరి శాంతించింది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం సాధారణ స్థాయికి చేరుకుంది. దీంతో, గోదావరి తీరప్రాంత వాసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, వరద ఉధృతికి పలు రోడ్డు ధ్వంసమయ్యా యి. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 11.70 అడుగుల నీటిమట్టం నమోదైంది. దీంతో, ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అనంతరం వరద క్రమంగా తగ్గుతూ సాయంత్రానికి 10.90 అడుగులకు చేరుకుంది. కాటన్ బ్యారేజీ నుంచి సముద్రంలోకి 8,64,489 క్యూసెక్కులు, డెల్టా కాలువలకు 11,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భద్రాచలం వద్ద కూడా వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. అక్కడ నీటిమట్టం 29.10 అడుగులకు తగ్గింది. గోదావరి వరద వల్ల కోనసీమ జిల్లాలోని తొమ్మిది మండలాల్లో 36 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వరద ప్రవాహం తగ్గడంతో లంక గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కాజ్‌వేలు నీటి నుంచి బయటపడడంతో పి.గన్నవరంలో కనకాయిలంక కాజ్‌వే, అయినవిల్లిలో అయినవిల్లిలంక కాజ్‌వేలపై రాకపోకలు సాగాయి.
పోలవరం కాఫర్ డ్యాం బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల కుక్కునూరు-దాచారం మధ్య గుండేటి వాగుపై ఉన్న కాజ్‌వేపై వరద ఏ మాత్రం తగ్గకపోవడంతో 14 గిరిజన గ్రామాలకు గత 17 రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. వరద ముంపు నుండి బయటపడిన రహదారులపై అడుగు మందం ఒండ్రు పేరుకుపోవడంతో వాహనాలు తిరగలేని పరిస్థితి ఉంది. వరద ఉధృతికి వేలేరు-బూర్గంపాడు ప్రధాన రహదారి ధ్వంసం అవడంతో బస్సులు, ఇతర వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. పోలవరం వద్ద కూడా గోదావరి నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. ఈ ప్రాజెక్టు నుండి 9,29,921 క్యూసెక్కుల వరద జలాలను దిగువకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఇఇ పి.వెంకటరమణ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే ఎగువన 32.320 మీటర్లు, దిగువన 24.000 మీటర్లు, ఎగువ కాఫర్ డ్యాం వద్ద 33.070 మీటర్లు, దిగువ కాఫర్ డ్యాం వద్ద 23.500 మీటర్లు, పోలవరం వద్ద 22.577 మీటర్ల నీటిమట్టం నమోదైంది. పోలవరం ప్రాజెక్టుకు వాహనాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట, యలమంచిలి మండలాల్లోని లంక గ్రామాలు ముంపు నుంచి తేరుకుంటున్నాయి. లంక గ్రామాలకు గోదావరిపై పడవల రాకపోకలను ఇంకా అధికారులు పునరుద్ధరించలేదు. ఆచంట మండలంలోని లంక గ్రామాల్లో సుమారు నాలుగు వేల ఎకరాల్లో అరటి, కొబ్బరి, బొప్పాయి, మునగ, తమలపాకు, బెండ, బీరతోపాటు పలు రకాల ఆకుకూరల పంటలు నీట మునిగాయి. ఎకరానికి రూ.లక్ష నుంచి సుమారు రూ.2 లక్షల వరకు పెట్టుబడులు పెట్టామని, పంటంతా వరద పాలైందని లబోదిబోమంటున్నారు.
తేరుకున్నంటున్న ముంపు మండలాలు
పది రోజులుగా పొంగి ప్రవహించిన గోదావరి, శబరి నదులు శాంతించాయి. దీంతో, అల్లూరి జిల్లాలోని ముంపు మండలాలైన విఆర్.పురం, కూనవరం, చింతూరు, ఎటపాకలు తేరుకున్నాయి. సోమవారం రాత్రికి పూర్తిగా వరద తొలగిపోవడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. చింతూరు మండలం కల్లేరు, చట్టి, కొమ్మూరు, ముకునూరు, ఎజి.కోడేరు, చింతూరు గ్రామాల్లోనూ, విఆర్.పురం మండలం వడ్డుగూడెం, వడ్డుగూడెం కాలనీ తదితర ప్రాంతాల్లోనూ, కూనవరం మండలంలో పలు గ్రామాల్లోనూ పారిశుధ్య పనులు ప్రారంభమయ్యాయి. అధికారుల ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది గ్రామాల్లో బ్లీచింగ్ చల్లారు. చింతూరు నుంచి విఆర్.పురం వెళ్లే రహదారిపై పేరుకుపోయిన బురదను తొలగించారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, సబ్ కలెక్టర్ బన్సల్, చింతూరు ఐటిడిఎ పిఒ సూరజ్ గనోరే సహాయక కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.










