- కదం తొక్కిన టీమిండియా బౌలర్లు
అహ్మదాబాద్: మొతేరాలో పరుగుల వరద పారలేదు.. హోరాహోరీ పోరు సాగలేదు.. ఈ మ్యాచ్‌ను కనులారా వీక్షించడానికి వెళ్లిన అభిమానులకు ఓ రకంగా క్రికెట్ మజా దక్కలేదనే చెప్పాలి. ఎందుకంటే అంతా ఏకపక్షమే.. 155 పరుగులకు 2వికెట్లు కోల్పోయి పటిష్టస్థితిలో నిలిచిన పాకిస్తాన్.. 191పరుగులకే ఆలౌట్ కావడం.. ఆ లక్ష్యాన్ని టీమిండియా 30.3ఓవర్లలో 3వికెట్లు కోల్పోయి ఛేదించడం చక చకా జరిగిపోయాయి. దీంతో వన్డే ప్రపంచకప్‌లో భారత్ 8-0తో పాకిస్తాన్‌పై పైచెయ్యి సాధించింది. టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్‌కే మొగ్గుచూపాడు. బౌలర్లు కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయక.. తొలి రెండు వికెట్లను 73పరుగుల్లోపే కూల్చారు. ఆ తర్వాత కెప్టెన్ బాబర్(50), వికెట్ కీపర్ రిజ్వాన్(49) కలిసి 3వ వికెట్‌కు 82పరుగుల జతచేశారు. దీంతో పాకిస్తాన్ జట్టు 2వికెట్ల నష్టానికి 155పరుగులు చేసి భారీ స్కోర్ దిశగా పయనించసాగింది. డ్రింక్ విరామం తర్వాత భారత బౌలర్లు ఒక్కసారిగా చెలరేగారు. సిరాజ్ పాకిస్తాన్ కెప్టెన్ బాబర్‌ను, బుమ్రా వికెట్ కీపర్ రిజ్వాన్‌ను బౌల్డ్ చేయడం చక చకా జరిగిపోయాయి. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లందరినీ టీమిండియా బౌలర్లు వెంట వెంటనే ఔట్ చేశారు. దీంతో 36పరుగుల వ్యత్యాసంలోనే మిగిలిన ఎనిమిది వికెట్లను పడగొట్టారు. ఛేదనలో టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్(16), కోహ్లి(16) నిరాశపరిచినా.. కెప్టెన్ రోహిత్ శర్మ(86; 63బంతుల్లో 6ఫోర్లు, 6సిక్సర్లు), శ్రేయస్(52నాటౌట్; 3ఫోర్లు, 2సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. దీంతో టీమిండియా 30.3ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 192పరుగులు చేసి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ బుమ్రాకు లభించింది.










