Sep 02,2023 07:25

వరణుడి ముప్పు..?
మధ్యాహ్నం 3.00గం||ల నుంచి
కాండీ : ఆసియాకప్‌-2023లో భారత్‌ాపాకిస్తాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. కాండీ వేదికగా శనివారం భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ జరగనుంది. ఆసియాకప్‌లో పాకిస్తాన్‌పై భారత్‌దే పైచేయి. ఈ హైవోల్టేజ్‌ మ్యాచ్‌కు భారత్‌ అన్ని విధాలా సన్నద్ధమైంది. టాప్‌ఆర్డర్‌ బ్యాటర్స్‌తోపాటు మిడిలార్డర్‌, ఆల్‌రౌండర్ల కలయికతో భారతజట్టు దుర్భేద్యఫామ్‌లో ఉంది. వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌తోపాటు జస్ప్రీత్‌ బుమ్రా చాలాకాలం తర్వాత పాకిస్తాన్‌పై యార్కర్లు సందించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆల్‌రౌండర్ల కోటాలో హార్దిక్‌, జడేజా జట్టుకు కొండంత అండగా ఉండనే ఉన్నారు. పోరుకు భారత ప్లేయింగ్‌ ఎలెవన్‌ను కూడా జట్టు మేనేజ్‌మెంట్‌ ఖారారు చేసింది. హైదరాబాద్‌కు చెందిన తిలక్‌ వర్మ ఈ మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేయడం ఖాయం. వన్డేల్లో ఆశించినస్థాయిలో రాణించలేకపోతున్న సూర్యకుమార్‌ యాదవ్‌ స్ధానంలో మేనేజ్‌మెంట్‌ తిలక్‌కు చోటు కల్పించినా ఆశ్చర్యపోన్నక్కర్లేదు. టి20ల్లో నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా ఉన్న సూర్యకుమార్‌.. వన్డేల్లో మాత్రం తేలిపోతున్నాడు. దాంతో తొలి మ్యాచ్‌లో అతడిని బెంచ్‌కే పరిమితం చేసినట్లు సమాచారం. మరోవైపు వెస్టిండీస్‌తో టి20ల్లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన తిలక్‌ వర్మ నిలకడగా రాణిస్తున్నాడు. ఆరంగేట్రంలోనే అద్భుతమైన ప్రదర్శనతో అకట్టుకున్నాడు. ఇక రోహిత్‌కు జోడీగా కిషన్‌ను ఓపెనర్‌గా, శుభ్‌మన్‌ను గిల్‌ ఫస్ట్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కు పంపే సూచనలు ఉన్నాయి.
ఇక పాకిస్తాన్‌ జట్టు విషయానికొస్తే.. ఆ జట్టు తన తొలి లీగ్‌ మ్యాచ్‌లో నేపాల్‌పై ఏకంగా 238పరుగుల తేడాతో గెలిచింది. కెప్టెన్‌ బాబర్‌, ఇప్తికార్‌ అహ్మద్‌ దుర్భేద్యఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు కలిసిరానుంది. బ్యాటింగ్‌కంటే పాకిస్తాన్‌ జట్టు బౌలింగ్‌పైనే ప్రధానంగా ఆధారపడింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య జరిగే ఆసియాకప్‌ మ్యాచ్‌ ప్రాధాన్యతను సంతరించుకుంది.

  • వర్షం ముప్పు..?

మరోవైపు ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా నిలిచే సూచనలున్నాయని శ్రీలంక వాతావరణ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. శనివారం మ్యాచ్‌ జరిగే సందర్భంలో వర్షం కురిసే సూచనలున్నాయని, 50 ఓవర్ల కోటా పూర్తి మ్యాచ్‌ జరగడం కష్టమేనని వాతావరణ శాఖ పేర్కొంది. శుక్రవారం కూడా చెదురుమదురు జల్లులు కురవడంతో గ్రౌండ్‌మన్లు పిచ్‌ను పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు.

  • జట్లు..

భారత్‌: రోహిత్‌(కెప్టెన్‌), శుభ్‌మన్‌, కోహ్లి, శ్రేయస్‌, ఇషాన్‌(వికెట్‌ కీపర్‌), హార్దిక్‌, జడేజా, శార్దూల్‌, కుల్దీప్‌, షమీ, బుమ్రా, సిరాజ్‌, అక్షర్‌, సూర్యకుమార్‌, ప్రసిధ్‌ కృష్ణ, తిలక్‌ వర్మ.
పాకిస్తాన్‌: ఫకర్‌, ఇమామ్‌, బాబర్‌(కెప్టెన్‌), రిజ్వాన్‌(వికెట్‌ కీపర్‌), అఘా సల్మాన్‌, ఇప్తికార్‌, నవాజ్‌, షాహిన్‌ అఫ్రిది, నసీమ్‌ షా, హరీస్‌ రవూఫ్‌, ఫహీమ్‌ అష్రాఫ్‌, హర్రీస్‌, వాసీం జూనియర్‌, షఫీక్‌, షకీల్‌, ఒసామా మిర్‌.