Nov 03,2022 16:11

ప్రజాశక్తి-నిమ్మనపల్లి (అన్నమయ్య) : గ్రామీణ ప్రాంతాలైన పల్లెలోని ప్రతి ఒక్కరికి వైద్యం అందాలని రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ వైద్యుడి విధానానికి శ్రీకారం చుట్టిందని మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ జులేఖ బేగం అన్నారు. గురువారం రాచవేటివారి పల్లి పంచాయతీలో 104 వాహనం ద్వారా వైద్య శిబిరాన్ని వారు నిర్వహించారు. ప్రజలకు స్థానికంగానే బిపి, షుగర్‌ వంటి ప్రాథమిక వైద్య పరీక్షలను నిర్వహించారు. సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అవగాహన కలిగించారు. జననివాస ప్రాంతాలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మురికి కుంటలు లేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. మలేరియా, టైఫాయిడ్‌, డెంగీ వంటి జ్వరాల లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. అనంతరం రోగులకు మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎం కవిత, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.