Sep 16,2023 22:08

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబుకు పది మందితో కూడి ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వైద్య శాఖ శనివారం తెలిపింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబుపై కేసు నమోదు అనంతరం ఈ నెల 10న తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సెంట్రల్‌ జైలుకు రిమాండ్‌కు తరలించిన విషయం విదితమే. చంద్రబాబు తరుపు న్యాయవాది విజ్ఞప్తి మేరకు చంద్రబాబుకు ఇంటి నుంచి భోజనంతోపాటు ఆరోగ్యంపైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే నగరంలోని ఒక ప్రముఖ ఆస్పత్రిలో ఆయన కోసం ఒక బెడ్‌ను రిజర్వ్‌ చేశారు. తాజాగా ఆయన కోసం ఐదురుగు వైద్యులు, ముగ్గురు సిబ్బంది, ఇద్దరు డ్రైవర్లతో బృందాన్ని ఏర్పాటు చేశారు. ఓ పాజిటివ్‌ రక్తం, అత్యవసర మందులు నిత్యం అందుబాటులో ఉంచాలని వైద్య శాఖ ఆదేశించింది.