పదో తరగతి చదువుతున్న అమ్మాయిని అదే క్లాసు చదువుతున్న అబ్బాయి రోడ్డుపై అటకాయించాడు. నీ పేరేంటని అడుగుతూ భుజంపై తాకాడు. అనుకోని ఆ సంఘటనకు ఆ పిల్ల భయంతో వణికిపోయింది. ఇంటికి వచ్చినా వణుకు తగ్గలేదు.. అవి ఫైనల్ పరీక్షలు జరుగుతున్న సమయం. జ్వరంతో బాధపడుతున్న ఆ పిల్ల పరీక్షలు రాసినా ఫెయిలైంది. ఆ సంఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన ఆమె స్నేహితురాలు 'మేం ఎందుకు భయపడాలి? ఈ పరిస్థితికి కారణమేంటి? అమ్మాయిలను ఏడిపించాలన్న అబ్బాయిలు భయపడాలంటే ఏం చేయాలి?' అని ఆలోచించింది. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనైనా ఇప్పటికీ దాన్ని మర్చిపోని ఆమె ఆ తరువాత ఆడపిల్లల ఆత్మరక్షణ కోసం 'రుద్రమదేవీ సెల్ఫ్ డిఫెన్స్ అకాడెమీ' స్థాపించి సుమారు 25 ఏళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మందికి ఆత్మరక్షణ శిక్షణ ఇస్తున్నారు. ఆమె పేరు ఎన్ లక్ష్మి సామ్రాజ్యం.
కరాటే విద్యలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన లక్ష్మి సామ్రాజ్యం ... ఆడపిల్లలకు విద్య ఎంత అవసరమో.. ఆత్మరక్షణ విద్య కూడా అంతే అవసరమని అంటారు. ఆత్మరక్షణ విద్య చాలా సులభంగా నేర్చుకోవచ్చని చెబుతారు. తన ప్రయాణం గురించి ఆమె మాటల్లో..
''ప్రకాశం జిల్లాలో పుట్టిన నేను ప్రస్తుతం హైద్రాబాద్‌లో సెటిల్ అయ్యాను. రైతు కుటుంబంలో పుట్టాను. నాన్నకు పుట్టుకతోనే రెండు కళ్లూ కనిపించవు. మేం నలుగురు సంతానం. ముగ్గురు అక్కచెల్లెళ్లం, ఒక తమ్ముడు. నన్ను పోలీసు చేయాలన్నది నాన్న కల. కానీ అప్పట్లో మా ఊళ్లో సైకిల్ తొక్కడం కూడా చాలా తప్పు. ఆడపిల్లకు సైకిల్ అవసరమా అనేవారు. అలాంటి చోట చిన్నప్పటి నుండే కరాటేలో శిక్షణ తీసుకున్నాను. ఆడపిల్ల కరాటే నేర్చుకుని ఏం చేస్తుంది? ఎవరిని తంతుంది? అనేవారు. అయినా పట్టుదలతో నేర్చుకున్నాను. నాలుగేళ్లలో పూర్తిచేయాల్సిన కోర్సును రెండేళ్లకే ఫినిష్ చేశాను. అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలిచ్చి ఎన్నో ప్రశంసలు అందుకున్నాను. అంతర్జాతీయ స్థాయిలో మూడు సార్లు బంగారు బహుమతులు అందుకున్నాను. కానీ ఏదో వెలితి నన్ను వెంటాడేది. పదో తరగతిలో నా స్నేహితురాలికి జరిగిన సంఘటన ఎప్పుడూ నన్ను తొలిచి వేసేది. కరాటే విద్య నేర్చుకున్న తరువాత నాలో ఎంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆత్మరక్షణ ఉండబట్టే నాపై నాకు నమ్మకం కలిగిందని బలంగా నమ్మాను. అందుకే నేను ఒక్కదాన్నే కాదు.. ప్రతి ఆడపిల్లా ధైర్యంగా ఉండాలి. ఒకపక్క యుద్ధ విమానాలు నడుపుతున్న మహిళలు.. మరోపక్క బయటికి రావాలంటేనే భయపడుతున్న మహిళలు సమాజంలో కనిపిస్తారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. ప్రతి ఒక్కరూ.. ఆడపిల్లలు తనకాళ్లపై తాను నిలబడాలంటే చదువొక్కటే మార్గమనుకుంటారు. కానీ ధైర్యంగా బయటికి రావాలంటే ఆత్మస్థైర్యమిచ్చే ఆత్మరక్షణ విద్య రావాలి. ఆ ఆలోచన నుండే నేను నేర్చుకున్న విద్య పదిమందికీ నేర్పించాలన్న లక్ష్యంతో మొదట్లో స్కూళ్లు, కాలేజీలు తిరుగుతూ అవకాశాలు వెతుక్కుని మరీ శిక్షణ ఇచ్చేదాన్ని.

- నా మొదటి ప్రయాణం
కరాటే విద్యలో రాణిస్తున్నప్పుడే శిక్షకురాలిగా జూనియర్స్‌కి తర్ఫీదు ఇచ్చేదాన్ని. ఆ ప్రోత్సాహంతో శిక్షణ పూర్తయిన తరువాత హాస్టల్‌కి వెళ్లి అక్కడి పిల్లలకు కరాటే నేర్పించేదాన్ని. ఆదాయంతో పాటు నా కాళ్లపై నిలబడగలను అన్న ధైర్యం అప్పుడే వచ్చింది. అయితే శిక్షణ ఇస్తానని స్కూళ్లకు, కాలేజీలకు చాలాసార్లు తిరగాల్సి వచ్చేది. ఎన్నో తిరస్కారాలు ఎదురయ్యేవి. 'వద్దమ్మా ఆడపిల్లలకు అలాంటివి నేర్పించడానికి తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు. చదువుంటే చాలు.. కరాటే నేర్చుకుంటే పెళ్లిళ్లు అవుతాయా అని భయపడుతున్నార'ని కొన్ని యాజమాన్యాలు ఒప్పుకునేవి కావు. అయినా, నా ప్రయత్నాలు ఆపేదాన్ని కాదు.
- రుద్రమదేవి గొప్ప స్ఫూర్తి..
దాదాపు 25 ఏళ్లుగా ఆత్మరక్షణ విద్యలో లక్షల మందికి తర్ఫీదునిస్తున్నా. అకాడెమీ కల అలాగే ఉండిపోయింది. ఎంతో వ్యయప్రయాసలకోర్చి 2016లో 'రుద్రమదేవీ సెల్ఫ్ డిఫెన్స్ అకాడెమీ'నీ రిజిస్టరు చేయించాను. రుద్రమదేవీ అంటే నాకు చాలా ఇష్టం. మా ఐదో పాఠంలో ఆమె గురించి ఉండేది. ఇప్పటికీ ఆ పాఠం సంఖ్య గుర్తుందంటే ఆ పాఠం నాపై ఎంత ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు. విలువిద్య నేర్చుకున్న రాణి రుద్రమ మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ఆ పాఠం చదువుతున్నంతసేపూ ధైర్యవంతురాలైన మహిళ తన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తుందని అనిపించేది. అందుకే అకాడెమీకి ఆమె పేరే పెట్టాను.
- నామమాత్రపు ఫీజుతో..
అకాడెమీకి వచ్చే పిల్లలకు, మహిళలకు నెలకు రూ.500లు ఫీజుతో శిక్షణ ఇస్తుంటాను. వారి ఆసక్తిని బట్టి కాలపరిమితి ఉంటుంది. అంగన్వాడీ, ఆశా, ఎల్‌ఐసి, ఆర్‌టీసీ వంటి ప్రభుత్వరంగ మహిళా ఉద్యోగుల్లో ఎంతోమందికి శిక్షణ ఇచ్చాను. పేద పిల్లలకు, అనాథాశ్రమాల నుండి వచ్చేవారికి, వృద్ధులకు ఉచితంగా నేర్పిస్తున్నాను.

- పోలీసు రంగంలోని వారికి కూడా ...
ఎంతోమంది అధికారులకు కూడా సెల్ఫ్ డిఫెన్స్‌లో తర్ఫీదునిచ్చాను. నేను పోలీసునైతే.. ఎక్కడో ఒక ప్రాంతానికే పరిమితమైపోయేదాన్ని. కానీ ఈ శిక్షణ ఇవ్వడం ద్వారా ఎంతోమంది పోలీసులకు శిక్షణ ఇచ్చే స్థాయికి వచ్చాను. తెలంగాణలో షీ టీమ్ సిబ్బందికి కూడా శిక్షణ ఇచ్చాను. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నా సేవలను గుర్తించి పలు అవార్డులు, ప్రశంసలు అందించాయి.
ఒకేసారి వేలాదిమంది ప్రదర్శనలిచ్చి, గిన్నీస్ రికార్డు, ప్రపంచ రికార్డులను సాధించాము. పలు టీవీ షోలలో, సోషల్ మీడియా వేదికలపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాను. ''
- ప్రతి ఇంటి నుంచీ ఒకరు రావాలి
ఆడపిల్లలను ఇంటినుండి బయటకు పంపాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. చుట్టూ నేరాలు పెరిగిపోయాయి. చదువు, ఉద్యోగం పేరుతో ఆడపిల్లలు సుదూరాలు వెళుతున్నారు. వారందరికీ ఆత్మరక్షణ విద్య అవసరం. జపాన్, చైనా, మలేషియా లాంటి దేశాల్లో ప్రతి ఇంట్లో ఆడపిల్లలు మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణులై ఉంటారు. మనదేశంలో కూడా ఆ విధానం రావాలి. అప్పుడే దాడులు తగ్గుతాయి. ఆత్మరక్షణ ఉంటేనే ఆత్మస్థైర్యం ఉంటుంది. లక్షల మంది మహిళలకు శిక్షణ ఇచ్చిన నేను భవిష్యత్తులో అకాడెమీ ద్వారా మరింతమందికి తర్ఫీదునివ్వాలి. ఆత్మరక్షణ ఒక్కటే కాకుండా మహిళల ఉపాధికి ఉపయోగపడే పలు రకాల రక్షణ, మల్లయుద్ధ విద్యలను కూడా నేర్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను.
- జ్యోతిర్మయి










