Oct 17,2023 08:31

ప్రతి ఇంట్లోనూ తల్లిదండ్రులు..నానమ్మ-తాతయ్య..అమ్మమ్మ-తాతయ్య ఇలా దాదాపుగా వృద్ధాప్యంలో ఉన్న వారు తప్పక ఉంటారు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక పనిచేస్తుంటారు. వయస్సు పెరిగాక వృద్ధులుగా మారుతుంటారు. అయితే 68 సంవత్సరాలు దాటిన వారు కూడా ఉత్సాహంగా ఉంటూ తమ పని చేసుకుంటూ ఇంట్లో మిగతా వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండేవారు సైతం ఉంటారు. మరికొందరికి వయస్సు మీదపడ్డప్పుడు జరిగే మార్పులను తట్టుకోలేరు. అలాంటి వారికి ఇంట్లో మిగతా సభ్యుల నుంచి సహకారం, సంరక్షణ అవసరం ఉంటుంది. డయాబెటీస్‌, గుండె జబ్బులు, క్యాన్సర్‌ వంటి వ్యాధులు సైతం ఉన్న వారు సైతం తమ ఆహార అలవాట్లను క్రమం తప్పకుండా పాటించటం, సంతోషంగా ఉండటం, వ్యామాయం చేయటం, ఇష్టమైన సంగీతం వినడం, డ్యాన్సులు చేయటం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందుతున్న వారు కూడా సమాజంలో ఉన్నారు. కేరళ రాష్ట్రంలోని త్రిశూర్‌ ప్రాంతంలో సుమిత్ర (ఎన్‌జిఒ) '60 ఫ్లస్‌ మ్యూజిక్‌ క్లబ్‌' వృద్ధుల్లో ఉత్సాహాన్ని నింపటానికి నిరంతరం కృషిచేస్తోంది. వారిలో ఉన్న సృజనాత్మక శక్తులకు సరికొత్తగా మెరుగులు అద్దటానికి క్లబ్‌ సభ్యులు ప్రోత్సహిస్తున్నారు.

022


        సాధారణంగా వృద్ధులంటే సమాజంలో ఒకచులకన భావం ఉంటుంది. ఇన్నాళ్లు కష్టపడ్డారుగా...ఈ వయస్సులో మీకు ఇంకా పనులు చేయటం అవసరమా?...ఇక విశ్రాంతి తీసుకోండి..బయట విషయాలు మీకెందుకు అన్న చందంగా కుటుంబ సభ్యుల మాటల్లో వ్యక్తమవుతూ ఉంటుంది. ఇలాంటి మాటలోని అంతరార్థం తెలుసుకుంటున్న పెద్దోళ్లు లోలోపల కుమిలిపోవటం కూడా సమాజంలో నిత్యం చూస్తున్న సంఘటనలే. వృద్ధాప్యంలో ఉన్న కొందరు మిత్ర సమూహంగా ఏర్పాటై 'సుమిత్ర' ద్వారా ఈ క్లబ్‌ను ఏర్పాటుచేశారు. తమ ఆధ్వర్యంలో ప్రభుత్వేర సంస్థగా (ఎన్‌జిఒ)గా 2018లో '60-ఫ్లస్‌ మ్యూజిక్‌ క్లబ్‌'ను కేరళలోని త్రిశూర్‌ ప్రాంతంలోని అరింపూర్‌ పంచాయతీ పరిధిలో ఏర్పాటుచేశారు. కేవలం ఇది వృద్ధుల కోసమే పనిచేస్తుంది. మొదట్లో తక్కువమందితో ప్రారంభమైన ఈ క్లబ్‌లో వృద్ధులైన పురుషులు, మహిళలు ఇందులో సభ్యులుగా చేరటం ప్రారంభించారు. మొదట్లో పాకలో ప్రారంభమైన ఈ క్లబ్‌ అనతికాలంలోనే పంచాయతీ పాలకవర్గ సహకారంతో చిన్నపాటి సముదాయం ఏర్పడటంతో వృద్ధుల విశేష ప్రతిభా పాటలవాల ప్రదర్శనా కేంద్రంగా మారింది. ఈ క్లబ్‌కు హాజరయ్యేవారు కుల,మత, ప్రాంతం వంటి ఎలాంటి బేధాలు లేకుండా తమకు వచ్చిన కళలను ప్రదర్శించొచ్చు. ఆటలు, పాటలు, నృత్యాలు, వినోదం వంటివి ఏవైనా ప్రదర్శించొచ్చు. అయితే అవి ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉండాలి. అలా ఉంటేనే ప్రదర్శనకు అంగీకరిస్తారు. మంచి క్లాసికల్‌ డ్యాన్సుల నుంచి లేటెస్ట్‌ పాటల వరకూ పాడొచ్చు. ఆడొచ్చు...పాడొచ్చు...నృత్యాలు చేయొచ్చు. తద్వారా ప్రతిఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చిన వారు తమ ప్రతిభకు పదునుపెడుతుంటారు. తమలో ఉన్న ఎలాంటి కళలైనా ఎలాంటి జంకు, బిడియం, అభద్రత వంటి వాటికి ఇక్కడ చోటుండదు. ఆడండి..పాడండి..ఆరోగ్యంగా ఉండండి అంటూ అవకాశం దొరికనప్పుడల్లా క్లబ్‌ సభ్యులు మైకుల ద్వారా ప్రోత్సహిస్తుంటారు. సుమతితో ఆమె స్నేహితులు కూడా ఇక్కడికి ఎక్కువమంది వస్తుంటారు. సుమతి తన జీవితంలో ఎక్కువ భాగాన్ని ముంబైలో గడిపారు. ప్రస్తుతం ఆమెకు 72 సంవత్సరాలు. పాత హిందీ సినిమా పాటలను ఆమె బాగా ఇష్టపడతారు. తనవంతుగా ప్రతిరోజూ రెండు, మూడు అలాంటి హిందీ పాటలను ఆలపిస్తారు. అంతటితో ఆగకుండా మిగతా వారితో కలిసి డ్యాన్సుల్లో తనవంతుగా స్టెప్పులు సైతం వేస్తారు. స్వతహాగా ఆమె గాయకురాలు. ఆరోజుల్లో ఎవర్‌గ్రీన్‌ మెలోడీలు ఆలపించే గాయకుల్లో ఆమె కూడా ఒకరు. మిగతావారు ఆడుతున్నా, పాడుతున్నా ఆమె స్వతహాగా ముందుకొచ్చి పాడుతూ చిందులేస్తూ మిగతావారిలో ఉత్సాహాన్ని నింపుతుంటారు.
 

                                                                       స్నేహమేరా జీవితం...

ఇక్కడికి వచ్చే వారంతా వృద్ధులైనా ఎంతో సంతోషంగా ఉంటారు. ప్రతిఒక్కరూ తమలో ఉండే ఆత్మన్యూనతాభావాన్ని అనతికాలంలోనే తొలగించుకుంటారు. ఎలాంటి భావప్రకటనకైనా స్వేచ్ఛ ఉండటంతో ప్రశాంతవాతావరణంలో ఉంటారు. అంతా నవ్వుతూ కేరింతలు కొడుతూ ఆటపాటల్లో మునిగి తేలుతుంటారు. తమకు తెలిసిన, తోచిన, మదిలే మెదిలో ఎలాంటి ఊహలు, ఆలోచనలు, భయాలు, ఆందోళనలు వంటిపై భయంలేకుండా చెప్పేసుకునే అవకాశాలు ఉన్నాయి. నిషేధాజ్ఞలు లేవు. స్టేజ్‌ భయాలు ఉండబోవు. లీలా, మణిలు అనారోగ్య సమస్యలు ఉన్నా, శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులున్నా కూడా తమవంతుగా కూడా నృత్యాలు చేయటానికి ముందుకొచ్చారు. మరికొందరు తమ వయస్సును పక్కన పెట్టేసి ఆటల్లోనూ, పాటల్లోనూ, నృత్యాల్లోనూ జతకలుస్తుంటారు. ఎవరికీ ఏ విధమైన బేధాభిప్రాయాలు ఉండబోవు. తన కార్యకలాపాల ద్వారా, సీనియర్‌ సిటిజన్లు తరచూ సమావేశాలు అయ్యేలా క్లబ్‌ కీలకపాత్ర పోషిస్తుంది. అలాగా వారి సమస్యలను పంచాయతీ అధికారుల దృష్టికి క్లబ్‌ ప్రతినిధులు తీసుకెళ్లి పరిష్కరిస్తుంటారు. కరోనా మహమ్మారి కాలంలో లాక్‌డౌన్‌ సమయంలో పంచాయతీ సహకారంతో ఈ క్లబ్‌ ద్వారా కరోనా బాధితులకు కౌన్సిలింగ్‌లు, ఆన్‌లైన్‌ ద్వారా అవగాహనా కార్యక్రమాలు కూడా జరిగాయి.
 

                                                                హెల్ప్‌లైన్‌కు పంచాయతీ సహకారం

60-ఫ్లస్‌ మ్యూజిక్‌ క్లబ్‌'ను 'వయోజన హెల్ప్‌లైన్‌ను సైతం ఏర్పాటుచేశారు. దీనికింద వాలంటీర్ల నెట్‌వర్క్‌ సహాయానికి అవసరమయ్యే వృద్ధులు, వికలాంగులను ఆహానిస్తుంటారు. పంచాయతీ పాలకవర్గం కూడా తమ పంచాయతీ వార్షిక ప్రణాళికలో వయోజన హెల్ప్‌లైన్‌కు స్పందించాలనీ, సమస్యలను పరిష్కరించటానికి పూనుకోవాలని నిర్ణయించింది. కుటుంబశ్రీ వృద్ధుల డేకేర్‌ కోసం 'పాకలవీడు' వంటి స్థలం కోసం తాము వెతకటం లేదని సుమిత్ర సహ వ్యవస్థాపకుడు బికె మణి అన్నారు. 'మాకు అవకాశం దొరికినప్పుడుల్లా ఈ క్లబ్‌కు హాజరై కొంత సమయాన్ని ఆనందంగా గడిపేస్తున్నాం. ఇది మాది జీవితంలో సంతోషాన్ని నింపుతుంది. తరచుగా ఇంట్లో ఒంటరిగా ఉండటం వల్లే కలిగే ఒత్తిడి నుంచి క్లబ్‌లో జరిగే 'సమావేశాలు...ఒత్తిడిని జయించే విషయాలు..ఒత్తిడి నుంచి అపారమైన ఉపశమనాన్ని అందిస్తున్నాయి' అని ఆమె పేర్కొన్నారు.