
దేశమంటే భిన్న జాతులు, మతముల సమ్మేళనం. దేశమంటే విభిన్న భాషల, సంస్క ృతుల సంగమం. అంతకంటే ముందు దేశమంటే.. మనుషుల సందోహం. కలిసి మెలిసి బతకటం, కలిసి మెలిసి కదలటం మన స్వాతంత్య్ర పోరాటం మనకిచ్చిన వారసత్వం! కొంతమంది చరిత్రను వక్రీకరించి, మనుషుల మెదళ్లలో మతాల పేరిట విషం, విద్వేషం నింపుతున్నప్పటికీ; ఉన్మాదం, ఉన్మత్తత రాజ్యమేలుతున్నప్పటికీ; రక్తం ఏరులై పారుతున్నప్పటికీ ... అలాంటి ఘోర దురంతాల మధ్య కూడా కొందరు మనుషులు మనుషుల వలె ప్రవర్తిస్తారు. సామరస్యాన్ని, సౌభ్రాతృత్వాన్ని ప్రదర్శిస్తారు. మణిపూర్ మారణహోమంలోనూ అలాంటి మనుషులు కొందరు కనిపించారు. అసలు సిసలు భారతీయులుగా నిలిచారు.

మే 3.. మణిపూర్ మారణహోమం మొదలైన రోజు.. ఒకపక్క కట్టుకున్న గూడు మంటల్లో ఆహుతైపోతోంది.. తుపాకీ గుండ్లకు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మరోపక్క తన వారెవరో.. పరాయివారెవరో తెలియని అయోమయంలో కుకీలు, మెయితీలు ఒకరిపై మరొకరు విరుచుకుపడుతున్నారు. అటువంటి భీకర పరిస్థితిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెడుతున్న బాధితులను అక్కున చేర్చుకున్నారు ముస్లిం నివాసితులు. బాధితుల్లో కుకీలు, మెయితీలు ఇద్దరూ ఉన్నారు. ఇద్దరికీ ఆశ్రయం ఇచ్చిన మానవత్వ హృదయులు వారు. దేశంలో ఎంతోమంది వారిపై విద్వేషాలు చిమ్ముతారు. వారి ఆహార నియమాలపై ఆంక్షలు పెడతారు. ఏదొక నెపం వేసి హత్యలు, అత్యాచారాలు చేస్తారు. దేశం వదిలిపొమ్మంటారు. ఇంతటి వివక్షకు గురవుతున్నా, తమపై దాడికి తెగబడిన మనుషులని తెలిసినా, సాటి మానవులుగా బాధితులను అక్కున చేర్చుకున్నారు.
ఈశాన్య భారతానికి చిహ్నంగా ఎత్తైన కొండలు ప్రారంభమైన ప్రాంతంలో క్వాక్తా ఒకటి. ముస్లింలు ఎక్కువగా ఉండే ఆ ప్రాంతానికి దగ్గరగా మెయితీలకు చెందిన 'టర్బంగ్ బంగ్లా', 'వెయిక్ హోరక్', కుకీల ఆవాసం 'కంగ్వి' కూడా ఉన్నాయి. మే 3 మధ్యాహ్నం ఆ ప్రాంతాలలో అల్లరిమూకలు విరుచుకుపడ్డాయి. ఒక్కసారిగా చెలరేగిన సంఘర్షణలో చెల్లాచెదురుగా పరుగులు పెడుతున్న వాళ్లకి అండగా నిలిచారు స్థానికంగా ఉన్న ముస్లింలు. భద్రతా బలగాలు వచ్చేవరకు వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించారు.
ఆ రోజు నుండి ఈ వంద రోజుల్లో కుకీలు, మెయితీల్లో ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. ఇప్పుడు ఆ కొండల్లో ఊళ్లు లేవు. సహాయక శిబిరాలతో, నిరాశ్రయులతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. శిబిరాల్లో తలదాచుకుంటున్న కుకీ, మెయితీలకు అండగా ముస్లిం గ్రామాలు, పట్టణాలు స్వచ్ఛందంగా ముందుకువచ్చాయి. నిధులు సేకరించి శిబిరాలకు అందజేశారు. వంటనూనె, ఆహార పదార్థాలు, దుప్పట్లు, బట్టలు, నిత్యావసరాలు సమకూర్చారు. ఇంకో విషయమేమంటే మణిపూర్‌లో ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో హింస కనిపించలేదు. ఇరు వర్గాల మధ్య సయోధ్య కూర్చి తటస్థంగా ఉండేందుకు స్థానిక ముస్లిం పెద్దలు ఎనలేని కృషి చేశారు.
సరిగ్గా 30 ఏళ్ల క్రితం, మణిపూర్ జనాభాలో 53 శాతం ఉన్న మెయితీలలో మైనార్టీ వర్గంగా ఉన్న 8 శాతం మంది ముస్లిములు తీవ్ర వివక్షకు గురయ్యారు. మైనార్టీ వర్గం వల్ల మెజారిటీ వర్గానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని అప్పట్లో పుకార్లు లేవనెత్తారు. ఫలితంగా అప్పుడు హింస పెచ్చరిల్లింది. వందమందికి పైగా ముస్లిములు ప్రాణాలు కోల్పోయారు. మనుషులను విభజించే ఉన్మాదం ఎంత ప్రమాదమో వాళ్లకు తెలుసు. అందుకే ఇప్పుడు జరుగుతున్న ఈ ఘోరాలను చూస్తూ.. మౌనంగా ఉండలేకపోయారు. తమవంతుగా జాతుల భేదం లేకుండా రెండు వర్గాల బాధితులకు అండగా నిలిచాయి.
మణిపూర్ ముస్లింలని 'మెయితీ పంగల్' పేరుతో పిలుస్తారు. 'దాడులు జరుగుతున్నప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల నుండి వందలమంది మా గ్రామాలవైపు వచ్చారు. నా ఇంట్లో వందమందికి ఆశ్రయం ఇచ్చాను. వారంతా మెయితీ వర్గానికి చెందిన మా కోడలు బంధువులు. వారిలో 20 మంది చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఆ రోజు వారినే కాదు, కుకీలు వచ్చినా నేను రక్షించే దాన్ని' అని చెప్పింది 65 ఏళ్ల పిత్రుబీబీ. ఆమె కొడుకుపై జూన్ 1న మెయితీ వర్గం విరుచుకుపడింది. దారుణంగా కొట్టింది. 'ఈ ముస్లిం కుకీలను రక్షించాడు..' అంటూ వారంతా నా మీద తెగబడ్డారు. కానీ మేం రక్షించింది మెయితీలను.. అంతకంటే ముందు బాధితులను..' అని చెప్పాడు అతడు.
మరొక సంఘటనలో అత్యంత పాశవికంగా మూకదాడికి గురైన ఓ బాధితురాలు కొండపై నుంచి దొర్లుకుంటూ వచ్చి, సాయం కోసం వేచి చూస్తున్నప్పుడు అటుగా వస్తున్న ఓ ముస్లిం ఆటోడ్రైవరు ఆమె ప్రాణాలను కాపాడి.. బంధువుల ఇంటికి చేర్చాడు. ఇంకా అనేకమంది బాధితులు ఆ కల్లోల ప్రాంతం నుంచి ఇంఫాల్‌కి, అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలివెళ్లటానికి ఎంతోమంది ట్రక్కు డ్రైవర్లు సహకరించారు. డబ్బు తీసుకోకుండా ఉచితంగానే తమ వాహనాల్లో వారికి చోటిచ్చారు.

మానవత్వం మనిషి లక్షణం...
సమైక్యత, సౌభ్రాతృత్వం మనకు స్వాతంత్య్రోద్యమం ఇచ్చిన వారసత్వం. పాలకులు తాము చేసే తప్పులు బయటపడకుండా ప్రజలను కుల, మత, ప్రాంతీయ ఉద్వేగాలు, ఉద్రేకాలు వైపు నడిపిస్తారు. విష బీజాలు నాటుతారు. ప్రజలు ఆ ప్రమాదాన్ని పసిగట్టాలి. సమైక్య, సామరస్యాలతో పరిమళించాలి.