- నిరసనలపై నిషేధం
- ఎపి సర్వీస్ రూల్స్‌లోకి ఆర్టీసీ ఉద్యోగులు
- అమలులోకి 54 కఠిన నిబంధనలు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ఆర్‌టిసి ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం ఎపి సివిల్ సర్వీస్ (కాండక్ట్) రూల్స్ పరిధిలోకి తీసుకువచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. 1964నాటి ఎపి సర్వీస్ రూల్స్‌లో సవరణలు చేయడం ద్వారా, ఆర్‌టిసి ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ సర్వీసు రూల్స్‌లోకి తీసుకువచ్చినట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనిలో భాగంగానే అనేక కొత్త నిబంధనలను కూడా చేర్చారు. వీటిని పరిశీలిస్తే చిన్న పొరపాటు చేసినా చర్యలు తప్పవని స్పష్టమవుతోంది. ఆదేశాలను ఉల్లంఘించడం, ఇతరుల విధులను అడ్డుకోవడం, ఉద్దేశ్యపూర్వకంగానీ, సంస్థ ఆస్తులకు నష్టం కలిగించడం, అప్పగించిన విధులను సక్రమంగా నిర్వహించలేకపోవడం వంటివి ఈ నిబంధనల్లో ఉన్నాయి. ఆర్‌టిసి ఉద్యోగులు రాజకీయ కార్యకలాపాల్లో పాలుపంచుకోకూడదని పేర్కొన్నారు. కీలక సమయాల్లో వీటిలో అనేకం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీటితో పాటు, విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతి తదితర అంశాలను కూడా పేర్కొన్నారు.
నిరసనలపై కఠినం
సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు చేసే నిరసన కార్యక్రమాలను ఉత్తర్వుల్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. నిరసన బాడ్జీలు ధరించడం, సంస్థను కించపరిచేలా స్లోగన్లు ఇవ్వడం, నిరసన కార్యక్రమాలతో కూడిన ప్రదర్శనలు, ధర్నాలు, ఘెరావ్‌లు, వర్క్ టు రూల్ పాటించడం, ఆకస్మికంగా విధులను బహిష్కరించడం, మెరుపు సమ్మెలకు చేయడం నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు.
క్రిందివారిని నియంత్రించలేకపోయినా...
తమ కింది ఉద్యోగులను సక్రమంగా నియంత్రించలేకపోవడాన్ని కూడా తప్పిదంగానే భావించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనివల్ల ఆ విభాగానికి, సంస్థకు నష్టం వాటిల్లుతుందన్న భావాన్ని ఉత్తర్వుల్లో వ్యక్తం చేశారు. ముందుగా చెప్పకుండా గైర్హాజరు కారాదని, ఇచ్చిన సెలవు కన్నా అధికంగా ఉపయోగించకూడదని స్పష్టం పేర్కొన్నారు. వారు పనిచేసేప్రధాన కార్యాలయాలను విడిచి అనుమతి లేకుండా బయటకు వెళ్లరాదని నిర్దేశించారు. అధికారిక లైసెన్స్ లేకుండా వాహనాలను నడపడం, అనుమతి లేకుండా తమ స్థానంలో వేరొకరికి బాధ్యతలు అప్పగించకూడదని పేర్కొన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన ప్రింట్ టికెట్లు, టికెట్ ఇష్యూయింగ్ మిషను, ఇతర డాక్యుమెంట్లకు వారే వారే ఫూర్తి జవాబుదారీగా ఉండాలని, వాటిని పోగొట్టుకుంటే వారే బాధ్యులని స్పష్టం చేశారు. తనిఖీ అధికారులపైనా నిర్ధిష్ట బాధ్యతలు ఉంచారు. బస్సుల్లో ప్రయాణించే సమయంలో నిషేధిత వస్తువులైన అగ్ని రాజేసే పరికరాలు, పేలుడు పదార్థాలు, ఆయుదాలు, అటవీ ఉత్పత్తులు, డ్రగ్స్, మద్యం సీసాలు, జంతువుల రవాణాపై నిఘా పెంచాలని, వాటి వివరాలు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని నిర్దేశించారు. ముందుగా నిర్ణయించిన రూట్లను మార్చివేసి ఇతర రూట్లలో వెళ్లడం, రాజకీయ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం కూడా సరికాదని స్పష్టం చేశారు.










