రుతుక్రమం సమయంలో ప్యాడ్ వాడకుండా క్లాత్‌లు వాడుతున్న వారు ఉన్నారు. దాంతో సమస్యలు ఎదుర్కొంటున్న వారూ ఉన్నారు. ఆ సమయంలో సమాజం నుంచి ఎన్నో ఆంక్షలు ఎదుర్కొంటున్నారు. రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తున్నా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ క్రమంలో జ్యోతి కుమారి తన బృందంతో కలిసి ఊరూరు తిరుగుతూ రుతుక్రమ పరిశుభ్రత గురించి అవగాహన కల్పిస్తోంది. ప్యాడ్స్ కొనలేని వారి కోసం శానిటరీ బ్యాంకే నడుపుతోంది. అంతేకాదు.. సామాజిక కార్యకర్తగా గ్రామాల్లో సమస్యలను పరిష్కరిస్తోంది.
బీహార్‌లోని నవాడా జిల్లాలో హార్దియా గ్రామానికి చెందిన జ్యోతి కుమారి (21) చిన్నప్పటి నుంచి చురుకుగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేది. ఆ క్రమంలో పదో తరగతి చదువుతున్నప్పుడే పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సభ్యురాలుగా చేరింది. ఫౌండేషన్ చొరవతో ఓ బృందంగా ఏర్పడి గ్రామాల్లో కిశోరి (కౌమార) క్లబ్‌లను ఏర్పాటు చేసింది. లైంగిక సమస్యలపై పోరాడటంతో పాటు, మహిళల ఆరోగ్యం, హక్కులు సంబంధించిన సమస్యల గురించి తెలుసుకోవడం, చర్చించడం చేస్తూ ఉండేవారు. కరోనా తర్వాత బృందంలో మహిళల రుతుక్రమ సమస్యలపై చర్చ జరిగింది. రకరకాల అభిప్రాయాలు వచ్చాయి. గ్రామాల్లో మహిళలను అడిగి సమస్యలను తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు.
సవాళ్లను ఎదుర్కొని ...
ఆ క్రమంలో గ్రామాల్లో ఉన్న మహిళలను సమావేశపరిచి రుతుక్రమ సమస్యలపై మాట్లాడారు. కానీ ఆమెకు అవమానాలు ఎదురయ్యాయి. దాని గురించి బయటకు మాట్లాడటం ఏంటి? అంటూ చాలామంది ఆడవాళ్లు జ్యోతిని దుర్భాషలాడారు. 'అంటు, ముట్టు గురించి మగవాళ్లకు తెలిసేలా చర్చికోవాలా?' అని అవమా నించారు. అయినా ఆమె వెనకాడలేదు. రుతు పరిశుభ్రతపై అవగాహన కల్పించేం దుకు ప్రయత్నాలు సాగించింది. తర్వాత పాఠశాల్లో విద్యార్థులను కలిసి మాట్లాడినప్పుడు వారి నుంచి ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. రుతుక్రమ సమయంలో తమ తల్లులు ఇంట్లోకి రానివ్వరని చెప్పారు. దేవుడు గుడి, పచ్చళ్ల జాడీలు, బీరువా, ఇతరుల బట్టలు తాకకూడదంటూ దూరం బెడుతున్నారని చెప్పుకుని బాధపడ్డారు. కడుపులో నొప్పి వచ్చినా మందులు కొని ఇచ్చేవారు కాదని చెప్పారు. ఇవన్నీ విన్న జ్యోతి బృందం ఆశ్చర్యపోయింది. అవన్నీ అపోహలని, శుభ్రత పాటిస్తే ఇటువంటి నియమాలు పాటించక్కర్లేదని చెప్పారు. అలా పిల్లలకు జ్యోతి చాలా దగ్గరయ్యింది. కొంతమంది విద్యార్థులు వీరి కార్యకలాపాలు నచ్చి బృందంలో సభ్యులుగా చేరారు కూడా. గ్రామాల్లో బిడ్డతల్లులకు క్లాత్‌కు బదులు శానిటరి ప్యాడ్స్ వాడేలా కౌన్సిలింగ్ చేశారు. తద్వారా కొంతమంది ఆడవాళ్లలో మార్పు కనిపించింది. ఆడవాళ్ల రుతుక్రమ సమస్య ఇంట్లో అందరికీ తెలియాలని బృందం నిర్వహించే సెషన్లకు విద్యార్థుల తల్లిదండ్రులను పిలిచేవారు. వారికీ అవగాహన కల్పించారు. కొంతమంది నుంచి వ్యతిరేక అభిప్రాయాలు వచ్చాయి. అయినా జ్యోతి అవేమి పట్టించుకోలేదు. మరికొంత మంది సానుకూలంగా స్పందించారు. అప్పటి నుంచి ఇంట్లో మగవాళ్లే న్యాప్‌కీన్లు కొనుగోలు చేసి ఇంట్లో ఆడవాళ్లకు, పిల్లలకు ఇస్తున్నారు. ఇది మంచి పరిణామంగా బృందం గుర్తించింది.
న్యాప్‌కిన్‌ల తయారీ
కానీ కరోనా సమయంలో షాపుల్లో శానిటరీ ప్యాడ్స్ పంపిణీ నిలిచిపోయింది. దాంతో జ్యోతినే కలగజేసుకుని నగరం వెళ్లి శానిటరీ ప్యాడ్‌లను తీసుకువచ్చి అందరికీ అందజేసింది. 'ఇంట్లో మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే అందరూ బాగుంటారని' పదే పదే తన మాటల్లో వినిపించేది. లాక్‌డౌన్‌లో ఉపాధి లేక డబ్బులు లేవని చాలామంది ఆడవాళ్లు కొనుగోలు చేయలేదు. జ్యోతినే స్వంత ఖర్చుతో ఉచితంగా పంపిణీ చేసింది. కొన్నాళ్లకు ఇంటింటికి తిరిగి రూపాయి చందా అడుగుతూ వచ్చిన డబ్బుతో ప్యాడ్స్ కొని అందరికీ ఇచ్చింది. కొన్నాళ్లకు న్యాప్‌కిన్ల తయారీకి కృషి చేసింది జ్యోతి. పర్యావరణంలో భాగంగా స్థిరమైన క్లాత్‌ప్యాడ్‌లకు మారాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిని ఇంట్లోనే తయారుచేయడానికి 30 మంది సభ్యులు శిక్షణ కూడా తీసుకున్నారు. దాతల సహాయంతో కుట్టుమిషన్లు కొనుగోలు చేశారు. అప్పటినుంచి గుడ్డ ప్యాడ్‌లను తయారుచేస్తూ ఆదాయ వనరుగా సృష్టించు కున్నారు. దాంతో గ్రామంలో శానిటరీ బ్యాంక్‌ని ఏర్పాటు చేసి అవసరమైన న్యాప్‌కీన్‌లను మహిళలకు అందజేస్తుంది. ప్రభుత్వం అందుబాటు లోకి తెచ్చిన కుటుంబ నియంత్రణ, గర్భనిరోధక పద్ధతుల గురించి కూడా జ్యోతి తెలియజేస్తుంది.
21 ఏళ్ల జ్యోతి చెప్పే మాటలకు ప్రభావితమై రెండు గ్రామాలకు చెందిన 55 మంది విద్యార్థులు రెండు బృందాలుగా ఏర్పడ్డారు. ఊళ్లల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నాయి. ఏళ్ల తరబడి గ్రామంలో ఉన్న నీటి సమస్యను పరిష్కరించా లంటూ సభ్యులంతా రెండేళ్ల క్రితం పోరాటం చేశారు. అప్పుడు కూడా చాలామంది జ్యోతి చేసే పనిని వ్యతిరేకించారు. కానీ మహిళల ఐక్య సమూహంతో నిరసన చేసింది. కొన్ని రోజులకు అధికారులు స్పందించి ఇంటింటికి నీళ్ల కుళాయిలు ఏర్పాటుచేశారు. గతంలో ఆడపిల్లలు ఊరి బయటకు వెళ్లి చదువుకునే ధైర్యం చేసేవారు కాదు. కాని జ్యోతి బృందం సాయంతో నవాడలో నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ క్లాసులకు బాలికలు వెళుతున్నారు.










