Sep 04,2023 14:44

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ (అన్నమయ్య) : బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌, కూరగాయలు, నిత్యవసర ధరలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయని, దేశంలో నిరుద్యోగ శాతం పెరిగిపోయిందని.. వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి నిత్యవసర ధరలు తగ్గించి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని సిపిఎం జిల్లా సమితి సభ్యులు రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. నిరుద్యోగ సమస్య, అధిక ధరలకు నిరసనగా సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రవికుమార్‌ మాట్లాడుతూ.. నిత్యావసర ధరలు తగ్గించాలని, ఆర్టీసీ చార్జీలు, విద్యుత్‌ ఛార్జీలు, ఆస్తి పన్ను, నీటి పన్ను, ఇంటి పన్ను తగ్గించాలని, చెత్త పన్ను తీసివేయాలని, ప్రభుత్వ భూములు, పోడు భూములు సాగు చేస్తున్న గిరిజనులకు, పేదలకు పట్టాలివ్వాలని అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచి 200 రోజులు పని కల్పించాలని, పట్టణాలలోనూ ఈ పథకాన్ని అమలు చేయాలని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి పంట రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం చేసిన నరేంద్ర మోడీ మాట నిలబెట్టుకోవాలని, రాష్ట్రంలో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్మిక హక్కులను హరించే నాలుగు లేబర్‌ కోడ్‌లను ఉపసంహరించుకోవాలని, మూతపడిన ఫ్యాక్టరీలు తెరిపించాలని, కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని, రాష్ట్రానికి ప్రత్యేక హౌదా, విభజన చట్టంలో హామీల అమలు, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని కోరారు. పాడైన రోడ్లు బాగు చేయాలని, అన్ని ప్రాంతాలలో ఫిల్టర్‌ చేసిన నీటిని ఉచితంగా ప్రజలు అందించాలని, టిడ్కో గహాలు పంపిణీ చేయాలని, అర్హులైన వారికి జగనన్న ఇల్లు ఉచితంగా నిర్మించి ఇవ్వాలని, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని, మందుల కొరత నివారించాలని, అన్నమయ్య ప్రాజెక్టు ముంపు బాధితులకు, ముదివేడు రిజర్వాయర్‌ నిర్వాసితులకు పునరావాసం, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఈ మేరకు తహసిల్దార్‌ సుబ్రహ్మణ్యం రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు రమణ, నాయకులు సతీష్‌, సిఐటియు నాయకులు ఓబయ్య, లక్ష్మీదేవి, ప్రసాద్‌, సునీల్‌ రమణయ్య, సుబ్రహ్మణ్యం, భాష తదితరులు పాల్గొన్నారు.