Jul 13,2023 14:55

ప్రజాశక్తి-కాకినాడ : నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు అదుపులో ఉంచాలని డిమాండ్‌ చేస్తూ గురువారం కాకినాడ రెవిన్యూ డివిజనల్‌ కార్యాలయం వద్ద సిపిఎం ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కన్వీనర్‌ ఎం.రాజశేఖర్‌, జిల్లా సీనియర్‌ నేత దువ్వ శేషబాబ్జీ, నాయకులు కె.సత్తిరాజు, సిహెచ్‌. రాజ్‌ కుమార్‌లు మాట్లాడుతూ.. గడిచిన కొన్ని వారాలుగా టమోట, అల్లం, మిర్చి వంటి కూరగాయల ధరలు చాలా దారుణంగా పెరిగాయన్నారు. ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయన్నారు. అన్ని రకాల బియ్యం పైనా బస్తాకు ఒక్కసారిగా 200రూ. పెంచారని తెలిపారు. మరోపక్క విద్యుత్‌ చార్జీలు వేలకు వేలు రూపాయల బిల్లులు వస్తున్నాయన్నారు. రకరకాల చార్జీల పేరుతో విద్యుత్‌ బిల్లులు వస్తున్నాయన్నారు. ప్రజల ఆదాయాలు అంతంతమాత్రంగా ఉన్న సమయంలో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసిపి ఇరువురూ కలిసి సామాన్య మధ్యతరగతి ప్రజల జీవనాన్ని దెబ్బకొడుతున్నారని విమర్శించారు. ధరలు ఇంతగా పెరిగినా రైతులకు ఏమాత్రం మేలు జరగడం లేదన్నారు. బ్లాక్‌ మార్కెట్‌ దళారీలను అరికట్టాలన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలని సిపిఎం డిమాండ్‌ చేస్తోందన్నారు. ధర్నా అనంతరం ఆర్‌.డి.ఓ. ఎన్‌.వి.వి. సత్యనారాయణ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా శేషబాబ్జీ మాట్లాడుతూ ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం నుండి ఏమైనా ఆదేశాలు వచ్చాయా అని అడిగారు. తమ వినతి పత్రాన్ని ప్రభుత్వానికి పంపిస్తామని ఆర్‌.డి.ఓ. తెలిపారు. ఈ సందర్భంగా ఆర్‌.డి.ఓ. కార్యాలయం నుండి వర్షంలోనే నినాదాలు చేస్తూ జిల్లా పరిషత్‌ సెంటర్‌ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పలివెల వీరబాబు, మేడిశెట్టి వెంకట రమణ, మలక వెంకట రమణ, చంద్రమళ్ళ పద్మ, నర్ల ఈశ్వరి, సిహెచ్‌. వేణు, కె. నాగజ్యోతి, నాగాబత్తుల సూర్యనారాయణ, లతో పాటు సిహెచ్‌. విజరు కుమార్‌, మూర్తి, రాణి, కె.రాజశేఖర్‌, రాజు, కుమారస్వామి, చిట్టిబాబు, గంగ సూరిబాబు, దినేష్‌, సాహిత్‌ , వాసు తదితరులు పాల్గొన్నారు.