Aug 03,2023 13:08
  •  మూడు ఎకరాల్లో వరినట్లు వేసి నిరసన

ప్రజాశక్తి - నౌపడ (శ్రీకాకుళం) : శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేటలోని గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు భూసేకరణకు భూములు ఇవ్వని రైతుల పొలాల్లోని పంటలను రెవెన్యూ అధికారులు బుధవారం ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మూలపేట రైతుల పంట భూములను గురువారం ఉదయం సిపిఎం నాయకులు పరిశీలించారు. పలువురు మహిళలు దౌర్జన్యంగా పొలాలను ద్వంసం చేశారని సిపిఎం నాయకులు వద్ద వాపోయారు. ఆ సందర్భంగా సిపిఎం నాయకులు రైతులతో కలిసి మూడు ఎకరాల్లో వరినట్లు వేసి నిరసన తెలిపారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి కష్ణమూర్తి, జి సింహాచలం మాట్లాడుతూ.. మూలపేటలో రెవెన్యూ పోలీస్‌ అధికారుల సమక్షంలో భూములు ఇవ్వని రైతులు వేసుకున్న పంటలను ధ్వంసం చేయడం దారుణమన్నారు. ఉత్తరప్రదేశ్లో బిజెపి సంస్కృతిని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అధికారులు రాజ్యాంగ పరిధిలో నడుచుకోవాలే తప్ప దానికి భిన్నంగా వ్యవహరించకూడదన్నారు. బలవంతపు సేకరణ ఆపాలని, రైతులపై నిర్బంధాన్ని ఆపాలని డిమాండ్‌ చేశారు. భూములు ఇవ్వని రైతుల పైన దౌర్జన్యం చేస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు. పంట భూముల్లో సిపిఎం నాయకులు వరినాట్లు వేస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని నాయకులను అడ్డుకున్నారు. పోలీసులకు, సిపిఎం నాయకులు మధ్య వాగ్వదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో సిపిఎం నాయకులను బలవంతంగా అరెస్టు చేసి నౌపడ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

2

 

3