
ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్ : పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు ఏర్పాటును ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో అనంతపురంలోని విద్యుత్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.రాంభూపాల్ మాట్లాడుతూ విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోయలేని భారం వేస్తున్నాయని తెలిపారు. సర్దుబాటు ఛార్జీలంటూ రూ.వేల కోట్లు భారాలను ప్రజలపై మోపడం తగదన్నారు. మోడీ ప్రభుత్వం ఆదేశాలకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తలొగ్గడం సరికాదన్నారు. కరెంట్‌కు బిల్లులే కాకుండా ఫిక్స్ ఛార్జీలు, కస్టమర్ ఛార్జీలు, సర్ ఛార్జీలు, విద్యుత్ సుంకం, సర్దుబాటు ఛార్జీల పేరుతో జనాన్ని ప్రభుత్వాలు పీల్చిపిప్పి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ రంగాన్ని అదానీ తదితర బడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారన్నారు. తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందిచకుంటే విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా మరో ఉద్యమానికి సిద్ధం కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. అనంతరం జిల్లా విద్యుత్ శాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర 1వ కమిటీ కార్యదర్శి వి.రామిరెడ్డి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎస్.ముస్కిన్, వై.వెంకటనారాయణ, నగర నాయకులు వలీ, ప్రకాష్, మసూద్, పాల్గొన్నారు.