మన దేశంలో ప్రకృతి వనరులు విశేషంగా ఉండటం వల్ల అనాది నుంచి ఆహార ధాన్యాలు, ఫలసంపద, అటవీ ఉత్పత్తులకు కాణాచిగా ఉండేది. అందుచేతనే పాశ్చాత్యుల కన్ను మనపై పడింది. వ్యాపారం నిమిత్తం తొలుత పోర్చుగీసు, డచ్చి, ఫ్రెంచి వారు; తరువాత బ్రిటీషువాళ్లు మనదేశంలో అడుగుపెట్టారు. ఇక్కడి వ్యవసాయక ఉత్పత్తుల్ని ముడి సరుకుల్ని వారి దేశాలకు అతి చౌకధరలకు కొనుక్కొని పోయి, అక్కడ వారి యంత్ర పరికరాలతో వస్తువుల్ని ఉత్పత్తి చేసి మళ్లీ వాటిని మన దేశానికే తెచ్చి విక్రయించి, అధిక లాభాలు గడించేవారు. రాను రాను మన ఖనిజ సంపద మీద కూడా కన్ను పడింది. దాన్ని కూడా ఆయా దేశాలకు తరలించుకుపోయేవారు. ప్రజలు పేదరికంలో మగ్గిపోయేవారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఈ పరిస్థితి మారలేదు. భూస్వామ్య వ్యవస్థ అలాగే ఉండి, దున్నేవాడికి భూమి కరువయ్యింది. పేదరైతులు ఏ బంజరు భూములో సాగు చేద్దామనుకున్నా భూస్వాములు, పెత్తందారులు తీవ్రంగా ప్రతిఘటించేవారు. అలాంటి తాడనలను, పీడనలను ఎదుర్కో వడానికి దేశంలో ఎక్కడికక్కడ రైతులు భూ పోరాటాలు చేశారు. ఆయా కాలాల్లో, ఆయా ప్రాంతాల్లో కవులు, రచయితలు, కళాకారులు తమ కళారూపాల ద్వారా ఆయా పోరాటాలకు వెన్నుదన్నుగా నిలిచారు. అలాంటి సందర్భంలో అభ్యుదయ కవి సీరపాణి రచించిన చైతన్య గీతమే 'ఏరువాక'.
పొద్దు పొడిచిందిలే ఓరన్నా!
మొద్దు నిద్దుర వీడు రైతన్నా!
మొక్కవోయిన పాత ఉక్కు నాగళ్ళన్ని.
పదును పెట్టే మంచి అదను వచ్చిందిరా!
భూస్వామ్యులను ఎదిరించడానికి తగిన సమయం వచ్చింది. బండదేరి మూలబడిపోయిన పాత ఉక్కు నాగళ్లను పదును పెట్టే సమయం ఆసన్నమైందని కవి రైతాంగాన్ని మేల్కొల్పుతున్నాడు.
కొండలన్నీ పేల పిండయ్యి పోవాలి!
కాడని బీడులు గుండయ్యి పోవాలి!
పుట్టలా, గుట్టలా బూజు దులిపెయ్యాలి!
మెట్టలూ, మెరకలూ మాగాణులవ్వాలి!
ఇక్కడ కొండలూ, బీడులూ, పుట్టలూ, గుట్టలూ కేవలం వస్తుపరమైనవే కావు. ఇవి కరడుగట్టిన భూస్వామ్య వ్యవస్థకు సంకేతాలు. వీటన్నింటినీ తెగగొట్టి, మెట్టల్ని మెరకల్ని కూడా మాగాణులుగా మార్చమంటున్నాడు కవి.
రెక్కలన్నీ విరిచి, రేయి పగలూ నిలిచి
కష్టించు పేదలకు కనరాదు నేల
భూమి మీదా కాలు మోపని బాబులకు
వందలూ, వేలు ఎకరాలెందుకోయి?
రైతాంగ పోరాటానికి మూల కారణమైన విషయం ఈ చరణాల్లో స్పష్టం చేశాడు కవి. భూమిపై కాలైనా మోపని సుఖజీవులకు వందలూ వేలు ఎకరాలెందుకని సూటిగా ప్రశ్నిస్తున్నాడు.
కోడి కూసే వేళ కాడేసు కెళుతుంటె
పుట్టలో నాగులు బుస్సుమని లేస్తాయి!
బెదిరి పోయావంటె బెంబేలు పెడతాయి!
ఎదిరి నిలిచావంటె చెదిరి పోతాయిరా!
బడుగు రైతులు తమ శక్తిని కూడగట్టుకొని భూస్వాములను ఎదురొడ్డి తమ పొలాలకు తామే హక్కుదారులుగా ప్రకటించుకుని సేద్యం చెయ్యడానికి ఉపక్రమిస్తారు. ఉషోదయ వేళ తమ ప్రయత్నాన్ని సఫలీకృతం చేసుకునే సందర్భంలో 'నాగులు' అంటే భూస్వాములు, పెత్తందారులు ప్రతిఘటిస్తారని భావం. ఆ ప్రతిఘటనలకు భయపడితే మరింత సంక్షోభానికి గురిచేస్తారంటున్నాడు. అదే ఎదురు నిలిస్తే తోకముడిచి పలాయనం చిత్తగిస్తారంటున్నాడు కవి.
తుమ్మ చెట్టులు నరికి, తుప్పలన్నీ పెరికి,
రంకె వేసే నదుల వంకరలు తీర్చేసి,
పాతాళ గంగను పైపైకి రప్పించి,
బంగారు పంటలే పండించవోయి!
భూమిని చదునుచేసి అనే అర్థంలో చెబుతున్నా, తుమ్మచెట్టును నరికి తుప్పలన్నీ పెరికి అంటే భూస్వామ్య వ్యవస్థను సమూలంగా తుడిచిపెట్టి అనే భావమే ప్రస్ఫుటమవుతోంది. రంకెవేసే నదుల వంకరలు తీర్చడమంటే, ప్రాజెక్టులు నిర్మించి వధాగా పోయే నదీజలాలను నిల్వచేసి అని కవి భావం. అలాగే వ్యవసాయ బోరుబావుల ద్వారా భూగర్భ జలాలను సైతం ఉపయోగించుకొని బంగారు పంటలు పండించమంటున్నాడు.
'రైతులంటే, పల్లె బైతు'లను సోమరుల
కూతలన్నీ పాడు నూతిలో పడతాయి!
'అన్నదాతకు మిన్న, అవనిలో లేడన్న'
చెక్కు చెదరని కీర్తి దక్కు నీకొక్కడికె!
ఎండనక వాననక కష్టపడి పంటలు పండించి ప్రపంచం ఆకలి తీర్చే రైతన్నలను పామరులుగాను, మోటు మనుషులు గాను గతంలో నాగరికలు చూసేవారు. అలాంటి వారిని సోమరు పోతులుగా కవి అభిశంసిస్తున్నాడు. 'అన్నదాతకు మించినవాడు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు' అని తనకొక్కడికే శాశ్వతమైన కీర్తి దక్కుతుందని కవి ఉద్ఘాటిస్తున్నాడు.
భూ సంస్కరణల చట్టం పూర్తిస్థాయిలో అమలు చేయకముందే, కవి రైతన్నలకు అండగా ఉండి రైతాంగ పోరాటాలకు స్ఫూర్తినివ్వడం సాహసోపేతమైన చర్య. కవులు, రచయితలు బీదలపాట్లను కరుణ రసాత్మకంగా వర్ణించి వారిపై సానుభూతి చూపించినంత మాత్రాన సమాజం ముందడుగు వెయ్యలేదు. కవి తాను కూడా వారితో మమేకమై ముందుండి నడిపించినట్లుగా భాసిస్తే అది ఏ ఉద్యమానికైనా వెయ్యేనుగుల బలం ఇస్తుంది.
ఈ గేయం 'సీరపాణి' రచించిన డమరుధ్వని కవితా సంపుటి లోనిది. సీరపాణి కవిత్వం ఎక్కువగా సంస్క ృత పద భూయిష్ఠంగా ఉంటుంది. ఈ 'ఏరువాక' గేయం మాత్రం తేట తెలుగు పదాలతో పాడుకునేందుకు వీలుగా ఉంటుంది. ఇది జానపదశైలిలో నడిచిన గీతం. ఈ పాటను ఆ రోజుల్లో చాలామంది ప్రచారానికి ఉపయోగించుకున్నారు. దీని రచనాకాలం మే 31, 1972. ఈ కవిత 1975లో రాజమండ్రి పట్టణ యువజన సంఘం నిర్వహించిన కవితల పోటీలో ప్రథమ బహుమతి గెలుచుకుంది.
సీరపాణి నామ చిహ్నం ప్రత్యేకత : సీరము అంటే నాగలి అని అర్థం. సీరమును ధరించిన వాడు సీరపాణి. రచయిత పూర్తి పేరు బుడితి బలరాం నాయుడు. సీరపాణి అనేది కలం పేరు.
- పిల్లా తిరుపతిరావు
70951 84846