కులగణనపై ప్రాంతీయ సదస్సులో మంత్రి చెల్లుబోయిన
చట్టబద్ధత కల్పించాలి : ఎమ్మెల్సీ లక్ష్మణరావు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సామాజిక సమానత్వానికి, విద్య ఆర్దిక పురోగతికి దోహదపడుతుందని రాష్ట్ర బిసి సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. సంక్షేమ అభివృద్ధి ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చేయడంతో పాటు భావితరాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. విజయవాడ బెంజి సర్కిల్‌లో ఓ ప్రైవేటు హోటల్‌లో సోమవారం కులగణనపై ఎన్‌టిఆర్, కృష్ణ, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల ప్రాంతీయ సదస్సు ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సులో మంత్రి మాట్లాడుతూ దేశంలో తొలిసారిగా 1872లో కులగణన జరిగిందన్నారు. 1931, 1941లో నిర్వహించిన కులగణన పూర్తి స్ధాయిలో జరగలేదన్నారు. గతంలో ఎస్‌సి, ఎస్‌టిలకు మాత్రమే గణన జరిగిందన్నారు. కులగణను చేపట్టాలని 2021లో రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని తెలిపారు. ఈ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపి రెండేళ్లు దాటుతున్నా ఎటువంటి నిర్ణయమూ తీసుకోకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే కులగణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థను ఉపయోగించి నిర్వహించే కులగణన ద్వారా అభివృద్ది ఫలాలు అందరికీ అందుతాయని తెలిపారు. దామాషా పద్దతిలో నిర్వహించే కులగణన ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు దోహదపడుతుందన్నారు. కులగణనలో రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొని సలహాలు, సూచనలు ఇవ్వాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
చట్టబద్ధత కల్పించాలి : ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు
కులగణనకు చట్టబద్ధత కల్పించాలని, కులగణన సర్వేలో వలంటీర్లును మినహాయించి సచివాలయ, రెవెన్యూ ప్రభుత్వ సిబ్బందిని ఉపయోగించుకోవాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు సూచించారు. కులగణన జరిగే పది రోజుల్లో ఒక రోజు సెలవు ప్రకటించి ఆ రోజు అందరి వివరాలు తీసుకోవాలన్నారు. అదే విధంగా ప్రతి సచివాలయంలోనూ కులగణన వివరాలను ప్రకటించి అభ్యంతరాలకు అవకాశం కల్పించాలన్నారు. గ్రామాల నుంచి ఉపాధి వెతుక్కుంటూ ఇతర జిల్లాలకు, పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్లిన ప్రజలను పిలిపించి వారి వివరాలనూ కులగణనలో చేరే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. కుల కార్పొరేషన్లను, కుల సంఘాల నాయకుల సహకారం తీసుకోవాలని, మతాన్ని కుల గణనలో ప్రస్తావించరాదని, ఆధార్ కార్డులతో ఇకెవైసితో ముడిపెట్టవద్దని పేర్కొన్నారు. కర్నూలు ఎంపి సంజీవ్‌కుమార్ మాట్లాడుతూ దేశ సంపదపై అందరికీ అవకాశాలు కల్పించేందుకు కులగణన చేపట్టాలన్నారు. కుల పెద్దలు, సంఘ నాయకులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. శాసనమండలి సభ్యులు కల్పలతా రెడ్డి మాట్లాడుతూ కుల గుణనలో సచివాలయ సిబ్బంది, వలంటీర్లు ఇతర ఉద్యోగస్తులు తప్పనిసరిగా పాల్గొనేలా చూడాలన్నారు. బోగస్ సర్టిఫికెట్లపై దృష్టి పెట్టాలన్నారు. వివిధ జాతులు, తెగలకు సంబంధించి ఒకటికి రెండు సార్లు పరిశీలించాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ మాట్లాడుతూ కులగణనలో ఎటువంటి పొరబాట్లూ దొర్లకుండా జాగ్రత్తగా చేయాలన్నారు. ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ సామాజిక న్యాయం, విద్య, ఆర్దికాబివృద్ధికి కులగుణన చేయాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం రాబోవు రోజుల్లో మంచి ఫలితాలు సాధించేందుక దోహదపడుతుందన్నారు. కులగణన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందన్నారు. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషగిరి(శేషు) మాట్లాడుతూ కులగణనల కుల పెద్దల సలహాలు తీసుకోవాలన్నారు. కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.నటరాజ్ మాట్లాడుతూ మాస్టిన్ కులాల వారిని మాదిగ, మాల కులాలతో కలపకుండా ప్రత్యేకంగా గుర్తించాలని, మోచి కులస్తులను వంశ వృక్షం తీసుకురమ్మని బాధించకుండా స్థానిక ఎస్‌సి కులాల జాబితాలో చేర్చాలని కోరారు. మత ఆధారితంగా కాకుండా కుల ఆధారంతో దళిత కులాలను గుర్తించాలని ఆయన సూచించారు. ఈసదస్సులో ఎస్‌సి కమిషన్ ఛైర్మన్ విక్టర్ ప్రసాద్, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎన్‌టిఆర్, బాపట్ల జిల్లాల జాయింట్ కలెక్టర్లు డాక్టర్ పి.సంపత్‌కుమార్, సిహెచ్ శ్రీధర్‌తో పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు.