Apr 27,2023 06:47

కొంతమందికి ఖాళీగా కూర్చోవడం అంటే ఇష్టం ఉండదు. ఏదో ఒకటి కల్పించుకుని నిత్యం పని చేస్తూనే ఉంటారు. అందులోనే ఆనందం వెతుకుంటారు. అటువంటి వారిలో మధుకాంత ముందుంటారు. 93 ఏళ్ల వయస్సులోనూ చక్కగా మిషన్‌ కుడుతున్నారు. పర్యావరణహితమైన గుడ్డ సంచులను కుట్టి ఉచితంగా పంపిణీ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
హైదరాబాద్‌ నివాసి అయిన మధుకాంత భట్‌ సొంతూరు గుజరాత్‌లోని జామ్‌నగర్‌ జిల్లాలోని ఒక చిన్న గ్రామం. అప్పట్లో ఆడపిల్లలు బడికి పంపేవారు కాదు. దాంతో ఆమెకు చదువుకోవా లన్న కోరిక తీరలేదు. కనీసం ఏదో ఒక చేతివిద్య నేర్చుకోవాలని ఆశపడ్డారు. అది తీరలేదు. మధుకాంతకు 18 ఏళ్ల వయస్సులో పెళ్లి అయ్యింది. భర్త ఉద్యోగం రీత్యా హైదరాబాద్‌కు వచ్చారు. కానీ మధుకాంతకు గుజరాతీ తప్ప మరే భాష రాదు. పక్కవాళ్లతో మాట్లాడేందుకు చాలా ఇబ్బంది పడేవారు. దాంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లేవారు కాదు. వీరికి ఐదుగురు సంతానం. నలుగురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. వీరూ తనలాగా ఉండకూడదని నిశ్చయించుకుంది. ఆడపిల్లల చదువు బాధ్యత తానే తీసుకుంది. ఇంట్లో పెద్దవాళ్లు వద్దు అని వారించినా పట్టించుకోలేదు. పిల్లల్ని దగ్గరుండి స్కూలుకు తీసుకెళ్లేది. ఎవరూ సరిగ్గా స్కూలుకు, ట్యూషన్‌కు వెళ్లకపోయినా, చదువుకోకపోయినా మధుకాంత కోప్పడేవారు. పిల్లలు బాగా చదువుకులా సహకరించేవారు. దాంతో అందరూ చదివి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఆమె పిల్లలు తెలుగు, ఇంగ్లీషు, గుజరాతీ, ఇతర బాషాలు మాట్లాడగలరు.

2


పిల్లలు స్కూలుకు వెళ్లినప్పుడు ఖాళీగా ఉండటం ఇష్టం లేక మధుకాంత మిషన్‌ కుట్టేవారు. బయట ఎక్కడా శిక్షణా తరగతులకు వెళ్లలేదు. మొదట్లో పిల్లలు బట్టలు, చిన్న చిన్నవి మాత్రమే కుట్టారు. మొదటి నుంచి కష్టపడేతత్వం, గ్రహింపుశక్తి ఎక్కువ. ఇంటికి దగ్గర్లో కుట్టుమిషన్‌ కుట్టేవారిని చూసి చిన్న డ్రెస్‌లు కుట్టారు. ఇంటికి వచ్చి వాటిని కుట్టేవారు. కొన్నాళ్లు నైపుణ్యం సాధించారు. దాంతో ఇరుగు పొరుగు బట్టలు తీసుకొచ్చి ఇచ్చేవారు. కొద్ది సమయం దొరికినా బట్టలు కుట్టేందుకు మొగ్గు చూపేవారు. ఆమె పిల్లలకు పెళ్లిళ్లు అయ్యాయి. మనవ సంతానం పుట్టారు. వారికీ పెళ్లిళ్లు చేశారు. అయినా మధుకాంత మాత్రం తనకు ఎంతో ఇష్టమైన మిషన్‌ కుట్టడం మాత్రం ఆపలేదు. ఇంటికి దగ్గర్లో ఉన్న ఓ బట్టల దుకాణ దారుడు దగ్గర మిగిలిన చిన్న చిన్న గుడ్డ ముక్కలను తీసుకొచ్చి సంచులు కుట్టారు. పర్యావరణ పరిరక్షనలో భాగంగా సుమారు 35 వేల సంచులను నగరంలో ఉచితంగా పంపిణీ చేసి ఆదర్శంగా నిలిచారు.

  • కాళ్లు నొప్పులైనా

వయస్సు మీద పడుతుండటంతో కాళ్లు నొప్పులు వచ్చాయి. కళ్లు మసకబారినా, శరీరం సహకరించకపోయినా, మిషన్‌ కుడతానంటూ మధుకాంతా ఉత్సాహం చూపుతున్నారు. దాంతో కుటుంబసభ్యులు ఎనిమిదేళ్ల క్రితం మిషన్‌కు కరెంట్‌ మోటర్‌ను బిగించారు. ఇప్పటికీ సూదిలో దారం ఎక్కించుకుంటారు. క్లాత్‌లను కొలతలు వేసుకుని కత్తెరతో కట్‌ చేసి సంచులను, మాస్క్‌లను కుడుతున్నారు. వీటిని ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లో ఉచితంగా పంపిణీ చేస్తున్న మధుకాంత ' పని చేయకుండా కూర్చోవడం అంటే ఇష్టం లేదు. వందేళ్లు వచ్చినా సరే ...ఏదో ఒక పని చేస్తూనే ఉంటా. అప్పుడే మనసుకు హాయిగా ఉంటుంది' అంటారు.