కీర్తి ... ఓ ప్రైవేట్ కళాశాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్. కరోనా సమయంలో ఖాళీగా ఉండలేక మొదలు పెట్టిన ఫొటోగ్రఫీ తనకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చి పెట్టింది. అందుకు కారణం... ఆమె ప్రకృతిపై జరుగుతున్న వినాశనాన్ని, జీవావరణంపై మనుషులు చేస్తున్న విపరీత చర్యలను తన ఫొటోల ద్వారా వెల్లడించింది. ఓ వైపు విద్యార్థులకు పాఠాలు చెబుతూనే... పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తోంది.
తమిళనాడులో కల్లకురిచికి చెందిన కీర్తి సెల్వరాజ్ సివిల్ ఇంజనీర్ పూర్తి చేశారు. ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఇంట్లో ఖాళీగా ఉండటం ఇష్టం లేక అలా పొలాల వెంట, చెరువు గట్ల మీద తిరుగుతూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉండసాగింది. ఈ క్రమంలో ఓ కెమెరా చేత పట్టుకుని నచ్చిన పక్షులను, సరస్సులను, నదులను ఫొటోలు తీసి తన సోషల్ మీడియాలో పోస్టు పెడుతూ ఉండేది. అది చూసిన స్నేహితులు ఇటువంటి పక్షులు అంతరించిపోతున్నాయి. చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయంటూ కామెంట్లు చేయసాగారు. అవి చదివిన కీర్తి... వీటిపై అధ్యయనం చేయాలనుకుంది. చుట్టుపక్కల గ్రామాల్లో, జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్న సుమారు 155 రకాల పక్షుల గురించి వివరాలు సేకరించి పుస్తకాన్ని ముద్రించింది. అంతేకాదు; వాటి పూర్తి వివరాలను అంతర్జాతీయ డేటా సర్వే ప్లాట్‌ఫారమ్ అయిన 'ఎబర్డ్'లో రికార్డ్ చేసి ఉంచింది. అలా ప్రకృతి ప్రేమికురాలిగా మారింది.
సమస్యను తెలియజేస్తూ ...
సాధారణంగా ఎవరైనా చేతిలో కెమెరా ఉంటే ప్రకృతిలో అరుదుగా కనిపించే దృశ్యాలు, వింతలను, మనసుకు ఆహ్లాదాన్నిచ్చే వాటిని వెంటనే క్లిక్ చేస్తూ ఉంటారు. కాని కీర్తి మాత్రం తన కెమెరాతో ప్రకృతిని నాశనం చేసే దృశ్యాలు కనిపిస్తే చాలా ఆమె కెమెరా క్లిక్ మంటుంది. నీటి వనరులను ప్లాస్టిక్ వ్యర్థాలతో కాలుష్యం చేయడాన్ని ఫొటోలు తీసి స్థానిక అధికారులకు పంపించింది. ఇలా జిల్లా వ్యాప్తంగా నీటి వనరుల్లో జరుగుతున్న ప్లాస్టిక్ బాటిళ్లు, న్యాప్‌కిన్లు, ఇతరత్ర కాలుష్యాన్ని కలిగించే దృశ్యాలు, విశాలమైన సముద్రంలో వదిలేసిన ఫిషింగ్ వలలు, ప్లాస్టిక్ చెత్తలో చిక్కుకున్న తాబేళ్లను, వాటిల్లో చిక్కుకుని చనిపోయిన జీవరాశులు... ఇలా ఎన్నో ఫొటోలను కలెక్టర్ వరకూ తీసుకెళ్లి పరిష్కారం దిశగా ప్రయత్నించింది.
ఆయా ప్రాంతాల్లో విద్యార్థులతో కలిసి ప్రకృతి పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. దానితో పాటు 'నేను- నా పక్షి', ప్రకృతి వినాశనం చేస్తున్న ఛాయాచిత్రాలను ప్రతి ఒక్కరికీ పంచి ఇచ్చి, వారిలో పర్యావరణ ప్రాముఖ్యత దిశగా ఆలోచన కలిగించింది. అలా తన ఫొటోల ద్వారా పర్యాపరిక్షణకు కృషి చేసింది. కళ్లకురిచిలోని కీలకమైన నీటి వనరు అయిన గోముఖి డ్యామ్ వ్యూ పాయింట్ వద్ద ఐదు వేల మంది విద్యార్థులతో ఆమె చేసే క్లీన్ ఆప్ కార్యకలాపాల్లో భాగస్వామ్యం అయ్యారు. అలాగే భూగర్భ జలాలు పెంచే దిశగా మొక్కలను పెంచే ప్రయత్నం ప్రారంభించింది. డ్యామ్ సమీపంలో విద్యార్థులతో కలిసి వెయ్యికి పైగా తాటి విత్తనాలను నాటారు.
ఉద్యోగం వదిలి ...
మానవ తప్పిదాల వల్ల తరిగిపోతున్న అడువులు, జలవనరులను చూసి భవిష్యత్తులో ముప్పు పొంచి ఉందని కీర్తి గ్రహించింది. అందుకే తన ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదిలి పూర్తిగా పర్యావరణ పరిరక్షకురాలిగా బాధ్యతలు చేపట్టింది. ప్రకృతి పట్ల ప్రేమను కనబరచాలంటూ జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఏవియన్ జాతులను రక్షించాలని ఆమె అన్వేషణలో భాగంగా అటవీ శాఖతో కలిసి పని చేస్తోంది. ఆమె సేవలను గుర్తించిన అధికారులు గ్రీన్ ఛాంపియన్ అవార్డు 2022 అందించి, అభినందించారు.










