Jul 31,2023 12:34

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా) : జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటల ఎన్యుమరేషన్‌ వెంటనే మొదలు పెట్టాలని జిల్లా కలెక్టర్‌ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ సంయుక్త కలెక్టర్‌ డాక్టర్‌ అపరాజిత సింగ్‌, డిఆర్‌ఓ ఎం.వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, క్షేత్రాధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించి పంట నష్టం ఎన్యుమరేషన్‌, ఓటిఎస్‌, కళ్యాణమస్తు స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం.- మంత్రి సందేశం, జగనన్న సురక్ష, జగనన్నకు చెబుదాం, తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ... ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిని రైతులు చాలా నష్టపోయారని, వారికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దెబ్బతిన్న పంటల నష్టం ఎన్యూమరేషన్‌ వెంటనే చేపట్టి ప్రభుత్వానికి నివేదికలు పంపించాలన్నారు. పంటకాలువలు, మురుగు కాలువల్లో పూడిక, గుర్రపు డెక్క, తుంటికాడలు తొలగింపు పనులు ఏ మేరకు జరుగుతున్నాయో ప్రతిరోజు పర్యవేక్షించాలన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ ఆగస్టు 15వ తేదీ లోగా ఆ పనులన్నీ పూర్తి కావాలని సూచించారు. వన్‌ టైం సెటిల్మెంట్‌ పత్రాల రిజిస్ట్రేషన్‌ పనులు పెండింగ్లో ఉన్నాయని వాటన్నిటిని వెంటనే పూర్తి చేయాలన్నారు. కళ్యాణమస్తు, షాది తోఫా పథకాల కింద 730 దరఖాస్తులు వచ్చాయని అవి ఎంపీడీవో లాగిన్‌ లో పెండింగ్లో ఉన్నాయని వాటిని సత్వరమే పరిశీలించి మంజూరుకు ప్రతిపాదనలు పంపాలన్నారు. ఆగస్టు 8వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించనున్నారని చెప్పారు. ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ... మంత్రి ప్రసంగించే సందేశం తయారు చేయడానికి జిల్లా అధికారులందరూ వారి వారి ప్రగతి నివేదికలను వెంటనే జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారికి పంపించాలని ఆదేశించారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో మున్సిపల్‌ కమిషనర్లు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, తదితర అధికారులు పాల్గొన్నారు.