May 09,2023 10:16
  • రేపు కర్ణాటక ఎన్నికలు,
  • 13న ఫలితాలు
  • రూ.375 కోట్లకు పైగా సీజ్‌
  • 2896 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు

బెంగళూరు : పోటా పోటీ సమావేశాలు, సభలు, ర్యాలీలతో మార్మోగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సోమవారం తెరపడింది. ఎన్నికల హామీలు, పార్టీల మధ్య దూషణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఆద్యంతం ఆసక్తి రేపిన పార్టీల ప్రచారం ముగియడంతో కర్ణాటక బోసిపోయింది. ముఖ్యంగా, ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్‌, బిజెపి, జెడి (ఎస్‌) ప్రచారాన్ని ఉధృతంగా సాగించాయి. తమ అభ్యర్థుల కోసం తీవ్రంగా శ్రమించాయి. షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 13న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార బిజెపికి ఎదురుదెబ్బ తగలనున్నదనీ, కాంగ్రెస్‌కు ఫలితాలు ఆశాజనకంగా ఉండనున్నాయని పలు ప్రీపోల్‌ సర్వేలతో పాటు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
 

                                                                             ధన ప్రవాహం

ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. ఎన్నికల అధికారులు ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి చర్యలు తీసుకు న్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నగార మోగిన తర్వాత మార్చి 29 నుంచి ఇప్పటి వరకు రూ.375 కోట్లు పట్టుబ డ్డాయి. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఎన్నికల సంఘం సమాచారం ప్రకారం.. రూ.375.6 కోట్లు సీజ్‌ చేశారు. ఇందులో నగదు రూ.147 కోట్లుగా ఉన్నది. మద్యం, బంగారం, వెండి రూ.97 కోట్లు, ఉచిత వస్తువులు రూ. 24 కోట్లు, డ్రగ్స్‌, నార్కొటిక్స్‌ రూ.24 కోట్లుగా ఉన్నట్టు కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు. నగదు సీజ్‌కు సంబంధించి ఇప్పటి వరకు 2,896 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఎన్నికల తేదీల ప్రకటనకు ముందు (మార్చి 9 నుంచి మార్చి 27 వరకు) మొత్తం రూ.58 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
 

                             సోనియాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయండి - ఇసికి బిజెపి వినతి- స్పష్టత ఇవ్వండి : ఇసి

కర్ణాటక సార్వభౌమాధికారానికి మద్దతు తెలిపినందుకు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని, ఆమెకు గుణపాఠం చెప్పే విధంగా చర్య తీసుకోవాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ నేతృత్వంలోని బిజెపి ప్రతినిధి బృందం ఎన్నికల కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. కర్ణాటక పేరుప్రతిష్టలకు, సార్వభౌమత్వానికి, సమగ్రతకు ముప్పు కలిగించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే దానిని కాంగ్రెస్‌ సహించబోదంటూ సోనియా ఈ నెల హుబ్బల్లిలో జరిగిన సభలో చెప్పారంటూ కాంగ్రెస్‌ ట్వీట్‌ చేసింది. దీని ఆధారంగా సోనియాపై బిజెపి ఫిర్యాదు చేసింది. సోనియా ప్రసంగానికి సంబంధించిన ప్రతిని పరిశీలిస్తే సార్వభౌ మత్వం అనే పదాన్నే ఆమె ఉపయోగించ లేదని తేలింది. సోనియా వ్యాఖ్యలపై స్పష్టత ఇవ్వాలని ఎన్నికల సంఘం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసింది.
 

                                            నేడు, రేపు ప్రింటయ్యే ప్రకటనలకోసం ఇసి అనుమతి తీసుకోవాల్సిందే

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ రోజున (బుధవారం) లేదా పోలింగ్‌కు ముందు రోజున (మంగళవారం) ప్రకటనలను ప్రచురించాలని అనుకుంటే మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మోనటరింగ్‌ కమిటీ (ఎంసిఎంసి) నుంచి అనుమతి తీసుకోవాలని అన్ని రాజకీయ పార్టీలను, అభ్యర్థులను ఎన్నికల కమిషన్‌ సోమవారం ఆదేశించింది. అలాగే.. ఈ రెండు రోజుల్లో అనుమతి లేకుండా ఎటువంటి ప్రకటనలు ప్రచురించ బడకుండా చూసుకోవడం తమ బాధ్యత అని రాష్ట్రంలోని అన్ని ప్రముఖ వార్తా పత్రికల సంపాదకులకు కూడా ఇసి లేఖ రాసింది. వార్తా పత్రికలో ప్రచురించబడే ప్రకటనలతో సహా అన్ని విషయాలకు సంపాదకులు బాధ్యత వహించాలని.. ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనలను ఇసి తన లేఖలో గుర్తు చేసింది.
 

                                        బెంగళూరు బరిలో కోటీశ్వరులు - ధనబలం ఉన్న వారికే పార్టీల టికెట్‌

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో పోటీ పడుతున్న ప్రధాన పార్టీలన్నీ ధనబలం ఉన్న వారినే అభ్యర్థులుగా నిలిపాయి. బెంగళూరు నగరంలోని 28 అసెంబ్లీ స్థానాల నుంచి బరిలో నిలిచిన 384 మంది అభ్యర్థులలో 157 మంది... అంటే 41 శాతం మంది కోటీశ్వరులేనని ప్రజాస్వామిక సంస్కరణల సంఘం (ఎడిఆర్‌) అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది. బెంగళూరు నగరం నుండి పోటీ పడుతున్న 389 మంది అభ్యర్థులలో 384 మంది అఫిడవిట్లను ఈ సంస్థ పరిశీలించింది. వీరిలో 157 మంది రూ. కోటి, అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తులు ఉన్న వారే. 87 మంది అభ్యర్థులు... అంటే 23 శాతం మంది తమకు ఐదు కోట్ల రూపా యల కంటే ఎక్కువ విలువైన ఆస్తులు ఉన్నాయని ప్రకటించారు. 37 మంది అభ్యర్థులు (10 శాతం) తమకు రెండు నుండి ఐదు కోట్ల వరకూ విలువైన ఆస్తులు ఉన్నాయని తెలిపారు. 76 మంది అభ్యర్థులకు యాభై లక్షల నుండి రెండు కోట్ల రూపాయల వరకూ, 70 మంది అభ్యర్థులకు పది లక్షల నుండి యాభై లక్షల రూపాయల వరకూ విలువైన ఆస్తులు ఉన్నాయి.
           బెంగళూరు నగరం నుంచి బరిలో నిలిచిన 114 మంది అభ్యర్థులు పది లక్షల రూపాయల కంటే తక్కువ విలువైన ఆస్తులు ఉన్నాయి. కాంగ్రెస్‌ నుంచి 26 మంది, బిజెపి నుంచి 27 మంది, జేడీ (ఎస్‌) నుంచి 21 మంది, ఆప్‌ నుంచి 25 మంది అభ్యర్థులు తాము కోటీశ్వరులమని డిక్లరేషన్‌ ఇచ్చారు. బెంగళూరు నగరం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల సగటు ఆస్తి విలువ రూ.24.48 కోట్లు. చిక్‌పెట్‌ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న యూసఫ్‌ షరీఫ్‌ ఆస్తుల విలువ రూ.1,633 కోట్లు. గోవిందరాజనగర్‌ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రియకృష్ణ రూ.1,156 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారు. హెబ్బాల్‌ నుంచి బరిలో ఉన్న సురేషా రూ. 648 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో నిలిచారు.