బెర్లిన్ : ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన వార్తాపత్రికల్లో ఒకటైన, వియన్నా నుండి వెలువడే వియనర్ జీటుంగ్ దినపత్రిక మూడు శతాబ్దాలకు పైగా సాగిన ప్రయాణాన్ని ముగిస్తోంది. ఈ నెల 7వ తేదీ నుండి రోజువారీ ముద్రణను నిలిపివేస్తోంది. 1703 ఆగస్టు 8న మొదటిసారిగా ఈ పత్రిక వెలువడింది. వినెరిస్చెస్ డైరియం పేరుతో మొదటిసారిగా ఈ పత్రిక ప్రచురితమైంది. ఎలాంటి కవితాత్మక భాషను ఉపయోగించకుండానే సరళంగా వార్తలను ఇవ్వడం ఆరంభించింది. ''320 ఏళ్లు, 12మంది అధ్యక్షులు, 10మంది చక్రవర్తులు, రెండు రిపబ్లిక్‌లు, ఒక వార్తాపత్రిక'' అని తుది ప్రింట్ ఎడిషన్‌లోని మొదటి పేజీ పేర్కొంది. ఆస్ట్రియన్ ప్రభుత్వానికి చెందిన ఈ పత్రిక సంపాదకీయ బాధ్యతల పరంగా స్వతంత్రంగా వ్యవహరించేది. ప్రింట్ ఎడిషన్‌లో కమర్షియల్ రిజిస్ట్రీకి మార్పులను ప్రచురించేందుకు కంపెనీలు సొమ్ము చెల్లించాల్సిన అవసరాన్ని ఇటీవల ఒక చట్టంలో తొలగించారు. ఆ తర్వాత రెవిన్యూ బాగా తగ్గిపోవడంతో పత్రిక ఇబ్బందుల్లో పడింది. దేశీయ, విదేశీ, సాంస్కృతిక, వాణిజ్య వార్తలను ఇస్తూ, విస్తృతంగా వ్యాసాలు ప్రచురించే ఈ పత్రిక క్వాలిటీ బాగుంటుందనే పేరు వచ్చింది. నిధుల ఇబ్బందులతో 63 ఉద్యోగాల్లో కోత పెట్టింది. సంపాదక వర్గ సిబ్బందిని 20కి పరిమితం చేసింది. ఆన్‌లైన్‌లో పత్రిక కొనసాగుతుంది. నెలవారీ ప్రింట్ ఎడిషన్ తీసుకురావాలని భావిస్తోంది.