ప్రజాశక్తి-హైదరాబాద్ : మార్క్సిజం, లెనినిజం విశ్వసిద్ధాంతమని, ఇదే ప్రపంచానికి మార్గదర్శి అని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నవతెలంగాణ దినపత్రిక నూతన వెబ్‌సైట్‌ను గురువారం హైదరాబాద్‌లోని ఎమ్‌హెచ్ భవన్‌లో సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రారంభించారు. సుందరయ్య వర్థంతి సందర్భంగా రూపొందించిన ప్రత్యేక పేజీలను సిజిఎం ప్రభాకర్ ప్రారంభించారు. పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్థంతి సందర్భంగా సుందరయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సిజిఎం ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించిన సభలో తమ్మినేని రాజకీయ పరిణామాలను వివరించారు. సుందరయ్య స్థిరత్వం కల్గిన ఆదర్శ రాజకీయ నేత అని కొనియాడారు. కమ్యూనిస్టు మేనిఫెస్టోను భారతదేశ పరిస్థితులకు అన్వయించిన దార్శనికుడని అన్నారు. ఆదర్శం, నిరాడంబరత కల్గిన నేత అని, కార్యకర్తల పట్ల ప్రేమను చూపించేవారని తెలిపారు. భావజాల రంగంలో పత్రికలు, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా కీలకపాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ప్రస్తుత రాజకీయాలను అర్థం చేసుకుని, ప్రజలను చైతన్యవంతం చేసే బాధ్యత పత్రికల మీద ఉందని అన్నారు. సిజిఎం ప్రభాకర్ మాట్లాడుతూ పత్రికా రంగంలో డిజిటల్ రంగం వేగంగా విస్తరిస్తోందని అన్నారు. అందులో భాగంగానే ఇ-పేపర్ తీసుకొచ్చామని, దీన్ని 25లక్షల మందికి పైగా చూస్తున్నారని తెలిపారు. ఇన్‌చార్జి ఎడిటర్ రాంపల్లి రమేష్, స్వేచ్చ Ûఇన్‌చార్జి ప్రవీణ్ తదితరులు ప్రసంగించారు. నవతెలంగాణ బుక్ హౌస్ ఎడిటర్ ఆనందాచారి, 10 టివి మాజీ ఎమ్‌డి వేణుగోపాల్, స్వేచ్ఛ ఇన్‌ఛార్జి ప్రతినిధులు భువన్, దివ్య, నవతెలంగాణ వెబ్ డెస్క్ ఇన్‌ఛార్జి అనంతోజు మోహన్ కష్ణ, నవతెలంగాణ బోర్డు సభ్యులు, జనరల్ మేనేజర్లు, మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.