Feb 17,2023 11:32
  • ఈ ఏడాదికి ప్రతిపాదన
  • మొత్తం పనులకు అంచనా వ్యయం రూ.11,779 కోట్లు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ఉపాధిహామీ పథకం కింద పనిచేసే వారికి రోజు వేతనాన్ని రూ.257 ఇవ్వాలని గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఇది ప్రస్తుతం ప్రభుత్వం వెల్లడిస్తున్న తలసరి వేతన గణాంకాలకు పూర్తి భిన్నంగా ఉండడం గమనార్హం. వచ్చే 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఉపాధి హామీపై ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఎంత మందికి పనులు కల్పించాలి, ఎంత వ్యయం అవుతుంది, అందులో వేతన వాటా, మెటీరియల్‌ వాటా ఎంత ఉంటుందనేది ప్రతిపాదనల్లో ప్రస్తావించారు.
         ఏడాది మొత్తం మీద 27.50 కోట్ల పనిదినాలు కల్పించేందుకు ప్రతిపాదించారు. మొత్తం ఉపాధి హామీ వ్యయం రూ.11,779 కోట్లుగా ప్రతిపాదించారు. వేతనాలకు సంబంధించి ఒక్కొక్కరికీ రూ.257 చొప్పున మొత్తం రూ.7,067 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. దీనికి అదనంగా మెటీరియల్‌ కాంపోనెంట్‌ కిరద మరో రూ.4,712 కోట్లు వ్యయం చేయాలని నిర్ణయించారు. మొత్తం వ్యయంలో కన్వర్జెన్స్‌ పథకాల కింద రూ.4,898 కోట్లు ఖర్చు పెట్టాలని భావిస్తున్నారు.
          గ్రామ సచివాలయాల భవనాలు 1,917 నిర్మించేందుకు రూ.2,618 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. 8320 భారత్‌ నిర్మాణ్‌ సేవా కేంద్రాలకుగాను రూ.476 కోట్లు, 10243 వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ భవనాలకు రూ.1,390 కోట్లు, 3734 బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ కేంద్రాలకు రూ.551 కోట్లు, మహిళా స్వయం సహాయ గ్రూపుల భవనాలకు రూ.2,147 కోట్లు, రోడ్లు, డ్రెయిన్లు, ఇతర పనులకు రూ.2,090 కోట్లు వ్యయం చేయాలని ప్రతిపాదించారు. కొత్త మొక్కలు నాటేందుకు, పాత వాటిని నిర్వహించేరదుకు రూ.200 కోట్లు, ఇతర వ్యయానికి రూ.137 కోట్లు వెచ్చించేందుకు అధికారులు ప్రతిపాదించారు.

                                                                      వేతనం అతి తక్కువే

ఉపాధి హామీ పథకంలో భాగంగా రోజుకు ఇచ్చే వేతన కూలి రూ.257గా పరిగణించడం చాలా తక్కువగానే కూలీలు భావిస్తున్నారు. కూలి పనుల కోసం బయట ప్రాంతాలకు వలస వెళ్లిన వారికి రూ.350 నుంచి ఐదు వందల వరకు దక్కుతుండగా, స్థానికంగా ఉపాధి హామీలో మాత్రం రూ.257 ఖరారు చేస్తుండడంపై అనేక మంది పెదవి విరుస్తున్నారు. ఇదే సమయంలో తలసరి ఆదాయాన్ని రెండు లక్షల రూపాయలకుపైగా ప్రకటిస్తున్న తరుణంలో హామీ పథకంలో ఇచ్చే మొత్తం నెలకు ఏడు వేలుగా మాత్రమే ఉండగా, ఏడాదికి రూ.93 వేలుగా మాత్రమే కనిపిస్తుండడం గమనార్హం.