Jul 17,2023 08:40

వృత్తిరీత్యా ఆమె ఆర్కిటెక్‌.. మోటారు బైక్‌ నడపడం అభిరుచి. ఆమె పేరు జై భారతి. హైద్రాబాద్‌లో నివసించే భారతి చాలామంది బైక్‌ రైడర్స్‌ లాగానే బైక్‌పై వివిధ దేశాలు చుట్టేశారు. అలా ఓసారి థారులాండ్‌కి వెళ్లిన ఆమెకు అక్కడ రోడ్ల మీద ట్యాక్సీలు నడుపుతూ, బైక్‌ రైడింగ్‌ చేస్తూ చాలామంది మహిళలు కనిపించారు. వారంతా సొంత వాహనాలు నడిపేవారు కాదు.. బతుకుతెరువు కోసం డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. మరి మనదేశంలో ఈ రంగంలో మహిళలు ఎందుకు లేరు అని ఆమె ప్రశ్న వేసుకున్నారు. ఉండి తీరాలీ అని నిర్ణయించుకున్నారు.

భారతి ఇండియా తిరిగి వచ్చాక- మొబిలిటీ రంగంలో మహిళల ఉపాధే ధ్యేయంగా 2019లో 'ఎంఓడబ్ల్యుఓ' (మూవింగ్‌ ఉమెన్‌) (కదిలే మహిళ) పేరుతో, 2022 నుండి 'ఎంఓడబ్ల్యుఓ ఫ్లీట్‌' పేరుతో సంస్థలను ప్రారంభించారు. 'ఎంఓడబ్ల్యుఓ' భారతదేశంలో మహిళల కోసం ప్రారంభించిన మొట్టమొదటి మోటారు శిక్షణా సౌకర్యాన్ని అమలుచేసే సాంకేతిక భాగస్వామిగా కూడా ఉంది. ఈ ప్రయాణంలో ఆమె అనుభవాలు ఆమె మాటల్లో విందాం.
           ఓసారి నేను ఇండియా నుంచి వియత్నాం బైక్‌ రైడింగ్‌ చేస్తున్నాను. 17 వేల కిలోమీటర్ల ఆ ప్రయాణంలో రోడ్డు రవాణా మార్గంలో ఎందరో మహిళలు ఉపాధి మార్గంలో ఉండడం గమనించాను. వియత్నాం, థారుల్యాండ్‌, కాంబోడియా దేశాల్లో 40 ఏళ్లకు పైబడిన మహిళలు కాల్‌ ట్యాక్సీలు, బైక్‌లు నడుపుతూ కనిపించారు. రోడ్లపైకి మహిళలు అంత స్వేచ్ఛగా వస్తున్నారంటే వారికి అక్కడ భద్రత ఉందని నాకర్థమైంది. మన దేశంలో లింగ వివక్ష ఎక్కువగా ఉంది. పురుషులతో సమానంగా మహిళలు మోటారు రంగంలో లేరు. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితులు రావాలి. రవాణా రంగంలో పురుషులతో సమానంగా మహిళలకు కూడా ఉపాధి ఉండాలి. ముఖ్యంగా రోడ్డు మార్గంలో మహిళలు జీవనోపాధి సంపాదిస్తే క్రమేణా అది మహిళందరి రక్షణకు దోహదపడుతుందని నేను నమ్ముతాను. ఆ ఆలోచన నుండే ఎంఓడబ్ల్యుఓ ఆవిర్భవించింది.
 

                                                              ఉపాధే లక్ష్యంగా ఎంఓడబ్ల్యుఓ ఫ్లీట్‌..

నేను శిక్షణ ప్రారంభించిన కొంతకాలానికే నాకు ఒక విషయం అర్థమైంది. మొబిలిటీ రంగం వైపు వెళ్లాలని మహిళలు ఆసక్తి చూపుతున్నా సామాజికంగా, సాంస్కృతికంగా వారు సమస్యలు ఎదుర్కొంటున్నారు. పైగా దీన్ని గౌరవప్రదమైన ఉపాధిగా పరిగణించకపోవడం వల్ల అనేక అవమానాలు పడాల్సివస్తోంది. దీంతో శిక్షణకే పరిమితం చేయకుండా జీవనోపాధి పొందేలా 'ఎంఓడబ్ల్యుఓ' ఫ్లీట్‌ను ప్రారంభించాను. ఇందులో మెరుగైన ఉపాధి మార్గాలను ప్రవేశపెట్టాను.
            ఇప్పటికీ తక్కువ ఆదాయం గల కుటుంబాల మహిళలకు డ్రైవింగ్‌ నైపుణ్యం ఉండటం లేదు. ఎందుకంటే ఇది సాంప్రదాయానికి విరుద్ధమని భావిస్తారు. ఆ మహిళలను ఇటువైపు రప్పించడం నాకు ఎదురైన మొదటి సవాల్‌. రెండో సవాల్‌ ఏంటంటే.. చాలామంది మహిళలకు ఈ ఉద్యోగాలు చేయగలమా లేదా అని వెనకడుగు వేసేవారు. వారందరిలో ఆత్మవిశ్వాసం పెంపొందేలా పలు వర్క్‌షాపులు నిర్వహించాను.
 

                                                                    సౌకర్యవంత పని వేళల్లోనే..

ఈ రంగంలో మహిళలు రాణించాలంటే వాళ్లు ఎదుర్కొనే మరో సమస్య.. రాత్రి పూట డ్రైవింగ్‌ చేయడం.. సాధారణంగా అటువంటి సమయంలో ఎక్కువ మొత్తం చెల్లించేందుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తారు. కానీ మహిళలు ఆ ప్రయాణాలు సురక్షితం కాదని భావించి కూడా వెనకడుగు వేస్తున్నారు. వారి సౌలభ్యం కోసం సౌకర్యవంతమైన వేళల్లో.. పరిమిత గంటల్లో ఆదాయం తగ్గకుండా ఈ రంగంలో ఉపాధి పొందే మార్గాల గురించి అన్వేషించాను. ఆసక్తి ఉన్న కొంతమంది మహిళలను కూడా సంస్థలో భాగం చేసుకున్నాను. వారంతా ఎంఓడబ్ల్యుఓలో శిక్షణ తీసుకున్న వారే.
 

                                                                           గౌరవప్రద ఉపాధిగా..

మా దగ్గర శిక్షణ తీసుకున్న వారిలో చాలా మంది మహిళా డ్రైవర్లు ఉపాధిమార్గంలో ఉన్నారు. వారిని చూసి మరింత మంది మహిళలు ఈ రంగంవైపు కచ్చితంగా వస్తారు. ఇతర రంగాల వైపు వెళ్లాలని చూసే మహిళలు డ్రైవింగ్‌ నైపుణ్యం మంచి అవకాశంగా భావించాలి. నేను అనుకున్న లక్ష్యం నెరవేరడంలో ఈ మహిళా డ్రైవర్లు టార్చ్‌ బేరర్లుగా ఉండబోతున్నారు. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది.
 

                                                             నా ప్రయాణం వ్యవస్థను మారుస్తోంది..

రెండు చక్రాలను బ్యాలెన్స్‌ చేసుకుంటూ ప్రపంచాన్ని చుట్టి వస్తున్న నేను ఎంతో ఆత్మవిశ్వాసం ఉంటేనే ముందుకు అడుగేయగలను. అదే ధైర్యం ఈ మహిళల్లోనూ చూడాలనుకున్నాను. ఓ సమస్య నన్ను పరిష్కారం వైపు నడిపించింది. ఆ ప్రయాణం ఓ వ్యవస్థను తయారుచేస్తోంది. సానుకూల దృక్పథంతో అనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేస్తే విజయం తప్పకుండా కలుగుతుంది. మార్పు మొదలవ్వాలంటే మొదటి అడుగు మీదే కావాలి'.

బైక్‌ రైడింగ్‌ ప్రారంభించిన జై భారతి దక్షిణాసియా నుండి యుఎస్‌ వరకు లక్ష కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఎంఓడబ్ల్యుఓ ఫ్లీట్‌ ద్వారా మహిళా సాధికారత సాధించేందుకు దేశవ్యాప్తంగా పలు వర్క్‌షాపులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ రంగంతో అనుసంధానమై ఉపాధి కల్పిస్తున్నారు. ఓ వాట్సాప్‌ నంబరు క్రియేట్‌ చేసి అందులో 2000 మందిని సభ్యులుగా చేర్చారు. అక్కడ వారి ఆలోచనలు, ఆకాంక్షలు పంచుకుంటారు. సంస్థ తరపున ఇప్పటి వరకు హైద్రాబాద్‌లో 2500 మందికి శిక్షణ ఇచ్చారు. వారిలో 200 మంది ఎలక్ట్రిక్‌ ఆటోలు నడుపుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నారు. వీరంతా భవిష్యత్తులో కాల్‌ ట్యాక్సీలు నడుపుతామని ధైర్యంగా చెబుతున్నారు. ఫ్లీట్‌ ద్వారా పరిమిత కాలంలో రూ.15000 నుండి రూ.17 వేల వరకు ఆదాయం పొందుతున్న ఈ మహిళలంతా మొదటిసారి ఉపాధిమార్గంలోకి వచ్చినవారే.
         వీలైనంత ఎక్కువమంది మహిళలు రవాణా రంగంలో జీవనోపాధి సంపాదిస్తే.. మహిళలు ధైర్యంగా వీరి వాహనాల్లో ప్రయాణిస్తారు. ఆ మార్పు క్రమంగా మహిళల రక్షణ వైపు అడుగులు వేస్తుంది.