Jun 26,2023 11:26

జైపుర్‌ : ఎయిరిండియా విమానం ఒకటి అత్యవసరంగా జైపుర్‌లో ల్యాండ్‌ అయ్యింది. అయితే దాన్ని మళ్లీ టేకాఫ్‌ చేసేందుకు పైలట్‌ ససేమిరా అనడంతో కొన్ని గంటలపాటు అక్కడే నిలిచిపోయింది. ఇంకేముంది.. కొందరు ప్రయాణీకులు రోడ్డు దారిపడితే.. మరికొందరు మళ్లీ విమానం బయలుదేరేవరకు పడిగాపులుపడ్డారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

లండన్‌ నుంచి బయలుదేరిన ఎయిరిండియా ఏఐ-112 విమానం షెడ్యూల్‌ ప్రకారం ... ఆదివారం తెల్లవారుజామున దాదాపు 4 గంటల సమయంలో ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్‌ అవ్వాల్సి ఉంది. అయితే, ఢిల్లీ ఎయిర్‌పోర్టు వద్ద వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో 10 నిమిషాలపాటు అక్కడే గాల్లో చక్కర్లు కొట్టిన విమానాన్ని ఆ తర్వాత రాజస్థాన్‌లోని జైపుర్‌కు దారిమళ్లించారు. దీంతో విమానం జైపుర్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది. దాదాపు రెండు గంటల తర్వాత విమానం తిరిగి ఢిల్లీ వెళ్లేందుకు ఢిల్లీ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ క్లియరెన్స్‌ ఇచ్చింది. కానీ, పైలట్‌ మాత్రం విమానాన్ని టేకాఫ్‌ చేసేందుకు నిరాకరించాడు. డ్యూటీ సమయం పరిమితులు, పనిగంటలను కారణంగా చూపి తాను విమానాన్ని నడపబోనని గట్టిగా చెప్పాడు. దీంతో దాదాపు 350 మంది ప్రయాణికులు జైపుర్‌ ఎయిర్‌పోర్టులో ఉండిపోవల్సి వచ్చింది. వీరిని గమ్యస్థానానికి చేర్చేందుకు ఎయిరిండియా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులంతా తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. మూడు గంటల పాటు ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతో కొందరు రోడ్డు మార్గంలో ఢిల్లీకి వెళ్లిపోయారు. ఆ అవకాశం లేనివారు ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాశారు. చివరకు ప్రత్యామ్నాయ సిబ్బందిని ఏర్పాటు చేయడంతో కొన్ని గంటల తర్వాత విమానం తిరిగి ఢిల్లీకి చేరుకుంది. జైపుర్‌లో తాము ఇబ్బందులు పడుతున్న దఅశ్యాలను కొందరు ప్రయాణికులు వీడియో తీసి సోషల్‌మీడియాలో షేర్‌ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. అయితే, ఈ ఘటనపై ఎయిరిండియా స్పందించలేదు.