Sep 01,2023 09:06

ఆయనేం ఐశ్వర్యవంతుడేమీ కాదు. సామాన్య ఉద్యోగి. అయితేనేం.. నిలువెత్తు మూర్తీభవించిన సేవాగుణం అతనిలో ఉంది. కష్టం.. సుఖం... తెలిసిన వ్యక్తి. పేదరికంలో పుట్టిన వారి జీవన విధానం తెలిసిన రైతు కుటుంబీకుడు. ఆయన పేరు కొమిరి కృష్ణమూర్తి. వృత్తిరీత్యా కానిస్టేబులు. మదర్‌థెరిస్సా, స్వామి వివేకానంద, అంబేద్కర్‌, ఎపిజె అబ్దుల్‌కలాం వంటి ప్రముఖుల జీవితాలను ఆదర్శంగా తీసుకున్నారు. తనవంతుగా సమాజ సేవలో భాగంగా నిలుస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పట్టణ పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కృష్ణమూర్తి, అన్నార్తులు, అభాగ్యులకు చేదోడుగా ఉంటున్నారు.

33

             తెల్లవారి లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకూ పోలీసులకు అనేక పనులుంటాయి. నేరస్తులు, నేరాలు-ఘోరాలు, తగాదాలు, విచారణలు, దర్యాప్తులు, రహదారి ప్రమాదాలు, క్షతగాత్రులకు సేవలు, మృతదేహాలకు కాపలా, కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు తప్పవు. వీటన్నింటినీ మధ్య కూడా మానవత్వం వెల్లివిరుస్తోందంటే అది కృష్ణమూర్తి లాంటి వారిని చూసి తెలుసుకోవచ్చు. ఎవరైనా పల్లెల నుంచి ఫిర్యాదు చేయటానికి వస్తే వారు నేరగాళ్లయినా సరే భోజనం చేశారా? అంటూ మర్యాద పూర్వకంగా పలకరిస్తారు. భోజనం చేయలేదనో, చేసేందుకు డబ్బులు లేవనో చెబితే తన జేబులో ఉన్న డబ్బులిచ్చి ఏదైనా తిని రమ్మని చెబుతారు. అది ఆయన ఉదార స్వభావానికి నిదర్శనం.
          ఆసుపత్రి, కోర్టు కేసులను చూసే కృష్ణమూర్తి ఎవరికైనా అనారోగ్యం బాగోలేదంటే సాయమందిస్తారు. సాధారణంగా మండలంలోని ఏజెన్సీ గ్రామాలైన తమ్మందొరవలస, సువందరవలస, లక్ష్మీపురంవలస తదితర గ్రామాల నుంచి వచ్చే గిరిజనానికి తిరిగి ఇంటికి వెళ్లేందుకు కూడా డబ్బులు ఉండవు. తినడానికి తిండి ఉండదు. అలాంటి వారికి ఆసరాగా ఉండి డబ్బులు ఇవ్వడమో లేదా రవాణా సౌకర్యం ఏర్పాటు చేయటమో ఆయన అలవాటు. ఎవరైనా సరే ఆకలిగా తన జేబులో డబ్బులు లేకుంటే ఇతరుల వద్ద తీసుకుని అయినా వారికి అందిస్తారు. అది ఆయన తత్వం. ఫీజులు కట్టలేకపోతున్నామనీ, ఆరోగ్యం కోసం ఆసుపత్రుల్లో వైద్యానికి సహాయం కావాలనీ కోరితే తనవంతుగా ఆర్థిక సహాయం చేస్తుంటారు. వివిధ ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, రోడ్డుప్రమాదాలు వంటివి జరిగినప్పుడు కూడా సాయం చేయడంలో కృష్ణమూర్తి ముందుంటారు. ఎవరైనా చనిపోయినప్పుడు, అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నప్పుడు ప్రత్యేకంగా జీపు వంటి వాహనాలు ఏర్పాటు చేస్తుంటారు. కరోనా కష్టకాలంలో కూడా తనవంతుగా ఆర్థిక సహాయంతో పాటుగా, మందులు, నిత్యావసర సరుకులు అందజేశారు. అభాగ్యులు, పేదలు ఎవరైనా చనిపోతే వారి దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం వంటివి చేశారు. ఫీజులు కట్టలేకపోతున్నామనీ, పిల్లల చదువులు ఆగిపోయేలా ఉన్నాయని ఎవరైనా వస్తే ఇట్టే తనకు తోచినమేరకు నగదు ఇచ్చి పంపుతుంటారు.

55

                                                                 వృద్ధుల సేవలో కోఆర్డినేటర్‌గా...

కృష్ణమూర్తి సేవాదృక్పథాన్ని గుర్తించిన పోలీసు ఉన్నతాధికారులు ఆయనను వృద్ధమిత్ర కోఆర్డినేటర్‌గా నియమించారు. 2017 నుంచి కృష్ణమూర్తి తనకొస్తున్న జీతంలో ప్రతినెలా రూ.10 వేలు తన జీతం నుంచి సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారు. వృద్ధులకు ఆర్థిక సాయం, చీరలు, పంచెలు, దుప్పట్లు ఇవ్వడం చేస్తున్నారు.

తండ్రి బాటలో ... : వీరఘట్టం మండలం కొట్టుగుమ్మడలో కొమిరి అప్పలసూరి, పార్వతమ్మ దంపతులకు కృష్ణమూర్తి జన్మించారు. తండ్రి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించారు. ఎవరికైనా సాయమందించటంలో తండ్రి ముందుండే వారు. చదువు, సంస్కారంతోపాటు నాన్న నుండి అలవడిన సేవా గుణం కృష్ణమూర్తిలో పెరిగింది. ఇప్పటికీ నేరగాడు ఎదురుపడినా కూడా 'బాగున్నావా' అనే తప్ప ఆయన నోటి వెంట మరో ఉచ్చారణ ఉండదు. 1993లో కృష్ణమూర్తి పోలీసు కానిస్టేబుల్‌గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. మొదటి నెల జీతం తీసుకున్నప్పటి నుంచి ఇలా ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తన మిత్రుడు పెద్దఎత్తున సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడని తెలుసుకున్న తమ బ్యాచ్‌ ఫ్రెండ్స్‌ ఇటీవల కృష్ణమూర్తిని కలిసి అభినందించారు. 30 ఏళ్లనాటి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. 'శభాష్‌' సోదరా అంటూ వెన్నుతట్టి ప్రోత్సహించారు.
                  - నాగు కాకిముక్కల
       పార్వతీపురం రూరల్‌, 9440081649

55

                                                                    మహనీయుల స్ఫూర్తితో సేవ

పేదలు, అభాగ్యులు, అన్నార్థుల బాధలు నాకు బాగా తెలుసు. పేదరికంలోని దయనీయ పరిస్థితులను కళ్లారా చూశా. 30 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నా. సాయం కోసం వచ్చిన వారికి నా వంతుగా ఉన్నంతలో చేస్తున్నా. ప్రతినెలా నాకు వచ్చే జీతంలో రూ.10 వేలు ఆర్థిక సహాయం చేస్తున్నా. 2017 నుంచి క్రమం తప్పకుండా ఏదో ఒక రూపంలో ప్రతినెలా అందజేస్తున్నా. నా సేవలను గుర్తించిన ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. 40 వరకూ సన్మానాలు జరిగాయి. ఉత్తమ పోలీసు కానిస్టేబుల్‌గా అవార్డులు అందుకున్నా. గతంలో డెంకాడ, బలిజపేట, సాలూరు ప్రాంతాల్లో పనిచేశా. పలుమార్లు ఉత్తమ పోలీసుగా అవార్డులు, సన్మానాలు, ప్రశంసాపత్రాలు అందుకున్నా.
                              - కొమిరి కృష్ణమూర్తి
     హెడ్‌ కానిస్టేబుల్‌ (1273), పార్వతీపురం టౌన్‌ పోలీస ్‌స్టేషన్‌.