ఒక అడవిలో పిల్ల ఏనుగు దారిలోని చెట్లను విరవసాగింది. ఆ దారినే వస్తున్న ఎలుగుబంటి అది చూసి 'ఓ గజమా! ఆ చెట్లను ఎందుకు? అలా విరుస్తున్నావు? మనల్ని కాపాడే మన అడవి చెట్లను విరవవచ్చా?' అనడిగింది.
అప్పుడు ఆ పిల్ల ఏనుగు 'నాకు ఎంత బలం ఉందోనని చూసుకుంటున్నాను. సింహం కన్నా నేను బలం గలదాన్ని అని నిరూపించుకోవాలి' అంది.
ఆ మాటలకు ఎలుగుబంటి నవ్వి 'సింహం అడవికి రాజు. అది ఉండటం వల్ల మానవులు ఈ చెట్లను నరకకుండా వెళ్లిపోతున్నారు. నువ్వేమో నీ బలం నిరూపించాలని చెట్లను నాశనం చేయడం మంచిది కాదు. నీ బలం చూసుకోవాలంటే దారికి అడ్డంగా ఉన్న కొండ రాళ్లను తొలగించు. దాంతో నీ బలం ఏంటో అందరికీ అర్థమయ్యి, మెచ్చుకుంటారు' అంది.
ఎలుగుబంటి చెప్పిన సలహా సబబుగా ఉండటంతో ఆలోచించింది ఏనుగు. అలాగే చేసి చూపిస్తా అని మనసులో అనుకుంది. తన బలంతో ఆ దారిలో ఉన్న రాళ్లను, ముళ్ల కంపను తొండంతో ప్రతిరోజూ కొంచెం కొంచెంగా తొలగించసాగింది. ఓ రోజు ఆ వైపు వచ్చిన మృగరాజు సింహం చూసి ఏనుగు చేస్తున్న మంచి పనిని ప్రశంసించింది.
వెంటనే పిల్ల ఏనుగులూ వచ్చి ఏనుగుకు సహాయపడ్డాయి. వాటికి చేతనైనంత పనిచేశాయి. అడవి జంతువులకు చెరువు దగ్గరకు వెళ్లే దారి ఏర్పరచాయి. దాంతో అడవిలో ఉన్న పులులు, సింహాలు, జింకలు, నక్కలు, గుర్రాలు, తోడేళ్లు అన్నీ కలిసి అభినందించాయి.
- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య
99085 54535










