వాషింగ్టన్: ఐఫోన్ 15 మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుంచి టెక్ వర్గాల్లో చర్చంతా దాని చుట్టే తిరుగుతోంది. సెప్టెంబర్ 22నే ప్రపంచవ్యాప్తంగా దీని విక్రయాలు ప్రారంభమయ్యాయి. యాపిల్ స్టోర్ల ముందు కొనుగోలుదారులు బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో ఐఫోన్‌ను ఎందుకు కొంటున్నారో కొందరు తమ కారణాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. టెస్లా, 'ఎక్స్' అధినేత ఎలాన్ మస్క్ సైతం ఐఫోన్‌పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.ప్రపంచ ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్లు స్టీఫెన్ విల్క్స్, రూబెన్ వూ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌తో బంధించిన కొన్ని చిత్రాలను యాపిల్ సీఈఓ టిమ్ కుక్ 'ఎక్స్'లో షేర్ చేశారు. ఐఫోన్ ద్వారా పరిమితులులేని సృజనాత్మకతను సఅష్టించొచ్చని వీరు నిరూపించారని కుక్ ఆ చిత్రాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ చిత్రాలతో పాటు వారితో కలిసి దిగిన ఫొటోలను కుక్ 'ఎక్స్'లో పంచుకున్నారు. దీనిపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. ఐఫోన్ ద్వారా తీసే చిత్రాలు, వీడియోల బ్యూటీ అపురూపమని వ్యాఖ్యానించారు.
అలాగే న్యూయార్క్‌లోని ఓ యాపిల్ స్టోర్ వద్ద నెలకొన్న సందడి, దానికి సంబంధించిన చిత్రాలను కుక్ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. దీనికి మస్క్ స్పందిస్తూ.. తానూ ఒకటి కొనబోతున్నానని వెల్లడించారు. అయితే, మస్క్ రియాక్షన్‌పై 'ఎక్స్'లో విపరీతమైన స్పందన వస్తోంది. కొంతమంది ఆయన ఏ మోడల్, ఏ కలర్ ఫోన్‌ను కొంటున్నారో తెలుసుకోవాలని ఉందంటూ ఆసక్తి కనబరుస్తున్నారు. మరికొందరేమో బహుశా 'ఎక్స్'లో వాణిజ్య ప్రకటనల కోసమే ఆయన ఇలా స్పందిస్తున్నారని కామెంట్ చేస్తున్నారు.