ప్రజాశక్తి- పార్వతీపురం టౌన్:పార్వతీపురం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌తోపాటు పట్టణంలోని కొత్తవలసలో ఉన్న పలు కాలనీల్లో ఏనుగు శనివారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో సంచరించింది. దీంతో, ఆయా ప్రాంతాల ప్రజలతోపాటు పట్టణ ప్రజలు భయాందోళన వ్యక్తం చేశారు. ఈ ఒంటరి ఏనుగు పట్టణ రైల్వే స్టేషన్, మణికంఠ కాలనీ, కెపిఎం పాఠశాల వీధి, పెద్దవీధి ప్రాంతాల్లో కలియ తిరిగింది. ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టమూ చేయకుండా తిరిగి కొమరాడ మండలం పరసురాంపురం వైపు వెళ్లిపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఏనుగు అర్ధరాత్రి సంచరించడం, ఆ సమయంలో జనసమ్మర్ధం లేకపోవడంతో పెద్దగా నష్టం జరగలేదంటున్నారు. ఏనుగులను తరలించేందుకు పాలకులు, అధికారులు చర్యలు చేపట్టకపోవడమేమిటని స్థానికులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇంతవరకూ కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, జియమ్మవలస, బలిజిపేట, గరుగుబిల్లి, భామిని, సీతంపేట, వీరఘట్టం మండలాల ప్రజలకు ఏనుగులు ప్రాణసంకటంగా మారాయి. ఇప్పుడు ఏనుగు ఏకంగా పార్వతీపురం పట్టణంలోనికి ప్రవేశించి స్వైరవిహారం చేయడం చూస్తుంటే వాటి నియంత్రణలోగానీ, వాటిని తరలించడంలోగానీ అటవీ శాఖాధికారులు చర్యలు తీసుకోవడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏనుగు సంచారంపై రాత్రి వేళల్లో గస్తీని (పెట్రోలింగ్) పెంచినట్లు జిల్లా అటవీ శాఖాధికారి జిఎపి ప్రసూన తెలిపారు. 17 మంది ఏనుగు ట్రాకర్లు రెండు బృందాలుగా రేయింబవళ్లు నిశితంగా పరిశీలిస్తున్నారని చెప్పారు. ఏడు ఏనుగుల గుంపు గొట్టివలస నుండి దలైవలస మెట్టకు వెళ్లిందని, ఆ గ్రామంతోపాటు చుట్టుపక్కల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటవీ శాఖ క్షేత్ర స్థాయి సిబ్బందికి సహకరించాలని ఆమె కోరారు.










