- భారీగా నష్టపోయిన రైతులు
ప్రజాశక్తి- సోమల (చిత్తూరు జిల్లా) : అరటి తోటలపై ఏనుగులు దాడి చేసిన ఘటన చిత్తూరు జిల్లా సోమల మండలం ఇరికిపెంట పంచాయతీలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సోమవారం ఉదయం పొలాల వద్దకు వెళ్లగా అరటి పంట ధ్వంసమై ఉందని రైతులు వాపోయారు. ఇరికిపెంట పంచాయతీలోని చెన్నపట్నం చెరువు మొరవ వద్ద ఏనుగుల మంద అరటి తోటలపై అర్ధరాత్రి దాడిచేసి పంటను తొక్కివేసి తీవ్రంగా నష్టపర్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు నాలుగు నుండి ఆరు ఏనుగులు అరటి తోటతో పాటు టమాటా, బీన్స్, చెరకు పంటలపై దాడి చేసి నష్టపరిచాయని తెలిపారు. పంట నష్టపరిచిన ప్రాంతానికి పార్వతి నగర్ (బంగ్లా) కూత వేటు దూరంలోనే ఉండటంతో ఏ సమయంలోనైనా ఏనుగులు గ్రామం వైపు వస్తాయేమోనని వారు ఆందోళన చెందుతున్నారు. బాధితుల్లో రాజన్న, పాపయ్య నాయుడు తదితరులు ఉన్నారు. ఈ దాడిలో రూ. రెండు లక్షలకు పైగా పంట నష్టం జరిగిందని, ఈ ప్రాంతంలో ఎప్పటికప్పుడు పంటలపై ఇటువంటి దాడి చేస్తుండడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు తెలిపారు. ఏనుగులు ఇటువైపు రాకుండా అటవీ శాఖ సిబ్బంది చర్యలు తీసుకోవాలని వారు కోరారు.