- అంగన్వాడీలకు తెలంగాణ లాగా జీతాలు ఇవ్వాలి
- ఎఫ్‌ఆర్‌ఎస్ రద్దు చేయకపోతే సమ్మెకు సిద్దం
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ డిమాండ్
ప్రజాశక్తి-చిత్తూరు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసిడిఎస్‌కు బడ్జెట్ పెంచాలని, తెలంగాణ లాగా జీతాలు అంగన్వాడీలకు పెంచాలని ఎ.పి.అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. ఆదివారం చిత్తూరులో యూటీఎఫ్ కార్యాలయంలో ఎ.పి.అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా కమిటీ సమావేశం శ్యామల అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడుగా వున్నప్పుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మేం అధికారంలోకి వస్తే తెలంగాణ కంటే అదనంగా వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇపుడు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల దగ్గర అన్ని ప్రభుత్వ పనులు చేయించుకుంటూ వారి సమస్యలు పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. దేశంలో, రాష్ట్రంలో శిశు మరణాలు రేటు తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తున్నది అంగన్వాడీలని గుర్తు చేశారు. మరి ఇలాంటి పథకాన్నికి నిధులు తగ్గించడం సిగ్గుచేటని.. నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలను రకరకాల పద్ధతుల్లో వేధించడం మానుకోవాలన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని పోరాటం చేస్తుంటే ఉక్కు పాదంతో అణచివేయడం ఏమిటి ప్రశ్నించారు. ప్రజా ఉద్యమాలను అణచిన ఏ ప్రభుత్వాలు మనుగడ సాధించలేదన్నారు. మహిళలను రాత్రిలో కూడా పోలీస్ స్టేషన్లో పెట్టడం దారుణమన్నారు. కొత్తకొత్త యాప్‌లు పెట్టి అంగన్వాడీలకు మానసిక ఒత్తిడి తీసుకురావడంతో అనారోగ్య సమస్యలు తీవ్రంగా వస్తున్నాయన్నారు. వీటితో పాటు అంగన్వాడీలకు ప్రమోషన్లు ఇవ్వాలని, మినీ వర్కర్‌ను మెయిన్ వర్కర్స్‌గా గుర్తించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర కోశాధికారి , జిల్లా ప్రధాన కార్యదర్శి షకీల, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు, యూనియన్ జిల్లా నాయకులు పద్మ, పంచవర్ణ, ప్రమీల, మమత, లీలా, జిల్లాలో వున్న 12 ప్రాజెక్టు నాయకత్వం నాయకులు హాజరయ్యారు.