Oct 16,2023 22:05

న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్ల పథకం చెల్లుబాటును సవాలు చేస్తున్న పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌ ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించారు. ఈ కేసును ప్రస్తుత త్రిసభ్య ధర్మాసనం నుండి ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలని విజ్ఞప్తి తమకు అందిందని, ఈ కేసుకు గల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని వెంటనే బదిలీ చేయనున్నట్లు చంద్రచూడ్‌ తెలిపారు. షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 10న ఈ కేసు విచారణ జరగాల్సి ఉండగా, ఈ నెల 31కి వాయిదా వేశారు. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు కోసం విచారణ జాప్యం చేసేందుకు కోర్టు తిరస్కరించింది. విచారణను ఆలస్యం చేయడం కోసం బెంచ్‌ ఏర్పాటు ఉద్దేశించబడలేదని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఎనిమిదేళ్ల నుంచి ఈ కేసు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో వుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లోగానే ఈ ఎన్నికల బాండ్ల కేసును పరిష్కరించాలంటూ పిటిషనర్‌ ఎన్‌జిఓ అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ తరపు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ కోర్టును కోరారు.